55 కోట్ల బడ్జెట్.. అదీ బాలకృష్ణ మీద.. చిన్న విషయమేమీ కాదు. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 100వ చిత్రమిది. అందుకే, అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దర్శకుడిగా క్రిష్‌ని ఎంచుకోవడం, చారిత్రక కథని బాలకృష్ణ నమ్ముకోవడం.. ఇవన్నీ ఈ సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి. అయినాసరే, బడ్జెట్ పరంగా సందేహాలైతే అలాగే వున్నాయి. బడ్జెట్ సంగతెలా వున్నా, 'మార్కెట్' ఇక్కడ కీలకం కదా.!
ఇదిలా వుంటే, 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా బాధ్యతని పూర్తిగా టీడీపీ తీసుకున్నట్లే కన్పిస్తోంది. మొన్నటికి మొన్న ట్రైలర్ ఆవిష్కరణ సందర్భంగా టీడీపీ నేతలు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఇంకోపక్క, తెలుగు చక్రవర్తికి సంబంధించిన చారిత్రక గాధ కావడంతో, ఈ సినిమాకి 'పన్ను మినహాయింపు' దిశగా టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆల్రెడీ సినిమా యూనిట్‌కి 'అభయహస్తం' అందించారనే ప్రచారం జరుగుతోంది. మరోపక్క, తెలంగాణలోనూ ఈ సినిమాకి పన్ను మినహాయింపులు లభించే అవకాశాలున్నాయట. ఈ విషయంలో ఇటు బాలకృష్ణతోపాటు, అటు చంద్రబాబు కూడా కేసీఆర్‌ని ఒప్పించారనే గుసగుసలు విన్పిస్తున్నాయి.
తెలంగాణలో.. అదీ చారిత్రక ప్రాంతమైన కోటిలింగాలలో ట్రెయిలర్‌ని విడుదల చేయడం, ఆడియో ఫంక్షన్‌కి ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిని ఫిక్స్ చేయడం.. ఇదంతా పక్కా వ్యూహం ప్రకారమే జరుగుతున్నాయన్నది నిర్వివాదాంశం. సినిమా విడుదలకు ముందే కాదు, విడుదలయ్యాక కూడా శాతకర్ణి బాధ్యతల్ని టీడీపీ మోస్తుందా.? ఏమో మరి, తెలుగు చరిత్ర.. అంటూ ఈ సినిమాని టీడీపీ ప్రమోట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.