ఇండస్ట్రీలో హీరోలు చాలా జాగ్రత్తగా మాటలు పేర్చుకుని మాట్లాడతారు. వాటిల్లో ఒకటికి రెండు అర్థాలు స్ఫురిస్తాయి. ' అరవింద సమేత అనేతి త్రివిక్రమ్ సినిమా. ఆయన సినిమాలో నేను పార్ట్ తప్ప, నా సినిమాలో ఆయన పార్ట్ కాదు' అనే విధంగా ఎన్టీఆర్ మాట్లాడారు.
అరవింద సమేత ప్రమోషన్లు ఈ రోజు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా ఎన్టీఆర్ ప్రింట్ మీడియాతో మాట్లాడారు. అజ్ఞాతవాసి భయంకరమైన డిజాస్టర్ కావడం అన్నది త్రివిక్రమ్ ను కానీ, మిమ్మల్ని కానీ టెన్షన్ కు గురి చేసిందా? అని అడిగితే ఎన్టీఆర్ సమాధానం ఇది.
అంటే అరవింద సమేత ఫలితం ఎలా వున్నా, మంచి చెడ్డా రెండూ త్రివిక్రమ్ వే అని ముందుగానే ఎన్టీఆర్ చెప్పేసారన్నమాట. అన్నట్లు సిక్స్ ప్యాక్ చేయడం కూడా త్రివిక్రమ్ కోరికే అని, లావుగా వున్న తనను కాస్త తగ్గాలని కోరడంతో, పనిలో పని సిక్స్ ప్యాక్ చేసేసానని ఎన్టీఆర్ వెల్లడించారు. మొత్తానికి త్రివిక్రమ్ సమేత ఎన్టీఆర్ అన్నమాట.
అరవింద సమేతకు సంబంధించి మరో కీలకమైన అంశంపై కూడా క్లారిటీ ఇచ్చాడు ఎన్టీఆర్. ఈ సినిమాలో తన మార్క్ యాక్షన్ కంటే ఎమోషనల్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకొచ్చాడు. ఎన్నేళ్ల నుంచో త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించాలని వెయిట్ చేసిన తనకు, ఎట్టకేలకు ఓ సరికొత్త స్టోరీని త్రివిక్రమ్ తీసుకొచ్చాడని అంటున్నాడు.
ట్రయిలర్ రొటీన్ గా ఉందనే విషయంపై కూడా ఎన్టీఆర్ స్పందించాడు. ఆ ఫీడ్ బ్యాక్ కూడా తన వద్దకు వచ్చిందని, ట్రయిలర్ లోనే అన్ని ఎలిమెంట్స్ చూపించలేం కదా అని రివర్స్ లో ప్రశ్నించాడు. ట్రయిలర్ లో చూపించిన అంశాల కంటే మరిన్ని సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో పాటు, ఎమోషనల్ కంటెంట్ సినిమాలో ఉందనేది ఎన్టీఆర్ అర్థం.
అరవింద సమేత తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి మల్టీస్టారర్ చేస్తానని తెలిపిన ఎన్టీఆర్, ప్రస్తుతానికైతే రాజమౌళి నుంచి ఎలాంటి కబురు లేదని స్పష్టం చేశాడు. అయితే సెట్స్ పైకి వెళ్లకముందే మరోసారి వర్క్ షాప్ నిర్వహించే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్టు బయటపెట్టాడు.
ఇప్పటికే ఎన్టీఆర్-చరణ్ కలిసి ఓసారి కాలిఫోర్నియా వెళ్లారు. వీళ్లిద్దరిపై అక్కడ ప్రత్యేకంగా ఫొటోషూట్ జరిగింది. కార్తికేయ ఆధ్వర్యంలో చిన్నపాటి వర్క్ షాప్ కూడా జరిగిందట. ఇప్పుడు అలాంటిదే మరో వర్క్ షాప్ నిర్వహించిన తర్వాత సెట్స్ పైకి వెళ్లాలని రాజమౌళి భావిస్తున్నాడంటూ ఆఫ్ ది రికార్డ్ వెల్లడించాడు ఎన్టీఆర్.