మరోసారి గ్యాంగ్ స్టర్ క్యారెక్టర్ లో రజనీకాంత్ చేస్తున్న సినిమా కాలా. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. యూనిట్ అంతా ముంబయి నుంచి చెన్నైకు తిరిగొచ్చింది. సినిమా కంప్లీట్ అయ్యేంత వరకు పెద్దగా గ్యాప్స్ ఇవ్వకూడదని డిసైడ్ అయిన రజనీకాంత్, కాలా సినిమా సెకెండ్ షెడ్యూల్ ను వెంటనే ప్రారంభించబోతున్నాడు.
ఈనెల 15 నుంచి 2 రోజుల పాటు మరోసారి అభిమానులను కలవనున్నాడు రజనీకాంత్. ఆ తర్వాత ఓ 4 రోజులు విశ్రాంతి తీసుకొని, 24వ తేదీ నుంచి తిరిగి కాలా సెకెండ్ షెడ్యూల్ ను ప్రారంభించాలని ఫిక్స్ అయ్యాడు. ఈ మూవీ కోసం ఇప్పటికే చెన్నైలో థారావి సెట్ ను నిర్మిస్తున్నారు. మరో వారం రోజుల్లో సెట్ నిర్మాణం పూర్తయిపోతుంది.
ధారావి సెట్ లోనే సినిమాకు సంబంధించి మేజర్ షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మరోసారి ముంబయి వెళ్లి బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేస్తారు. పాటల కోసం విదేశాలకు వెళ్లే షెడ్యూల్స్ ను టాకీ తర్వాత పెట్టుకున్నారు.
కాలాకు సంబంధించి మొన్నటివరకు రోజుకో ఫొటో బయటకొచ్చింది. ముంబయిలో షూటింగ్ జరిగిన ప్రతిరోజు ఓ స్టిల్ బయటకొచ్చింది. ఇకపై ఈ లీకుల్ని అరికట్టేందుకు, సెకెండ్ షెడ్యూల్ నుంచి సెట్ లోకి సెల్ ఫోన్లు తీసుకురావొద్దని యూనిట్ లో అందరికీ ఆదేశాలు జారీ అయ్యాయి.
నానా పటేకర్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో హుమా ఖురేషీ, అంజలి పాటిల్ హీరోయిన్లు. రజనీకాంత్ అల్లుడు ధనష్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.