ఈ ఏడాది అలా కలిసొచ్చింది

సీక్వెల్ అంటే బెంబేలెత్తిపోయే రోజుల నుంచి పార్ట్-2 ఉంటేనే ముద్దు అనే పరిస్థితికి వచ్చింది టాలీవుడ్.

ఒకప్పుడు సీక్వెల్ వస్తుందంటే ప్రేక్షకుల గుండె గుభేల్ మనేది. పార్ట్-2 తీయడానికి మేకర్స్ గుండె బిక్కుబిక్కుమని కొట్టుకునేది. రక్తచరిత్రకు పార్ట్-2 తీస్తే చుక్కలు కనిపించాయి. కథానాయకుడికి సీక్వెల్ రాగానే దిక్కులు చూడకుండా పరుగెత్తారు జనం.

అలా.. సీక్వెల్ అంటే బెంబేలెత్తిపోయే రోజుల నుంచి పార్ట్-2 ఉంటేనే ముద్దు అనే పరిస్థితికి వచ్చింది టాలీవుడ్. పెద్ద సినిమాలకు పార్ట్-2 తీయకపోతే ఇప్పుడదో పెద్ద వార్త. అలా గడ్డు కాలం నుంచి సక్సెస్ ఫుల్ దశకు చేరుకున్నాయి సీక్వెల్స్. మరీ ముఖ్యంగా ఈ ఏడాది సీక్వెల్స్ పంట పండింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 3 సీక్వెల్స్ సూపర్ హిట్టయ్యాయి.

ముందుగా పుష్ప-2తోనే మొదలుపెడదాం. ఈ సీక్వెల్ కంటెంట్ పై చాలా కంప్లయింట్స్ ఉన్నాయి. ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడో ముగించారనే విమర్శలున్నాయి. ‘వేర్ ఈజ్ పుష్ప’ అంటూ విడుదల చేసిన వీడియోకు అసలు సినిమాలో చోటే లేదు. ప్రారంభంలో చూపించిన జపాన్ ఎపిసోడ్ ఎటెళ్లిపోయిందో తెలియదు. పార్ట్-1లో కనిపించిన జాలి రెడ్డి ఎక్కడ దాక్కున్నాడో పత్తా లేడు.

ఇలా చెప్పుకుంటూపోతే చాలా కంప్లయింట్స్. కానీ సినిమా ఆడుతోంది. మామూలుగా కాదు, అరివీర భయంకరమైన వసూళ్లు వస్తున్నాయంటున్నారు. మొదటి రోజే పుష్ప-2, ప్రపంచవ్యాప్తంగా 294 కోట్ల గ్రాస్ సాధించిందని మేకర్స్ ప్రకటించుకున్నారు. వాళ్లు చెప్పిందే నిజమైతే, భారతీయ సినీ చరిత్రలోనే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇది. ఇక ఇక్కడ ఆర్ఆర్ఆర్, బాహుబలి-2ల గురించి మాట్లాడుకోవడాల్లేవ్.

ఇక సీక్వెల్ గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్టయిన మరో సినిమా టిల్లూ స్క్వేర్. డీజే టిల్లూ ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. దానికి కొనసాగింపుగా వచ్చిన టిల్లూ స్క్వేర్ అంతకంటే పెద్ద హిట్టయింది. ఇంకా చెప్పాలంటే వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది ఈ మూవీ. విడుదలకు ముందే వంద కోట్లు అని నాగవంశీ ప్రకటిస్తే, అంతా ఓవర్ చేస్తున్నాడని అనుకున్నారు. కట్ చేస్తే అదే నిజమైంది. ఇప్పుడు పార్ట్-3 కూడా ఉందంటున్నారు.

ఈ ఏడాది హిట్టయిన మరో సీక్వెల్ ‘మత్తు వదలరా 2’. మత్తు వదలరా సినిమా సైలెంట్ గా వచ్చి పెద్ద హిట్టయితే.. మత్తు వదలరా-2 సినిమా భారీ అంచనాలతో వచ్చి మరీ ఆ అంచనాల్ని అందుకుంది. క్రైమ్-కామెడీ జానర్ లో వచ్చిన ఈ సినిమా ఈ ఏడాది వచ్చిన చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని నమోదు చేసింది.

ఇలా 2024 సంవత్సరం సీక్వెల్స్ కు కూడా కలిసొచ్చింది. అలా అని అన్ని సీక్వెల్స్ హిట్టవ్వలేదు. ఈ లిస్ట్ లో డబుల్ ఇస్మార్ట్, యాత్ర-2, గీతాంజలి మళ్లీ వచ్చింది లాంటి డిజాస్టర్లు కూడా ఉన్నాయి. కాకపోతే సక్సెస్ అయిన సీక్వెల్స్ సంఖ్య పెరిగింది. రాబోయే రోజుల్లో దేవర-2, కల్కి-2, పుష్ప-3 లాంటి పెద్దపెద్ద సీక్వెల్స్ కూడా రాబోతున్నాయి.

13 Replies to “ఈ ఏడాది అలా కలిసొచ్చింది”

  1. Really even i didn’t expected puspa -2 will became flower .

    forgot about wild fire not even fire .

    My local theater sai ranga still tickets not booked 50% they changed ticket prices starting from monday but already damage happened.

Comments are closed.