అల్లు అర్జున్ కేసుపై అప్ డేట్

మధ్యంతర బెయిల్ పై బయటకొచ్చిన అల్లు అర్జున్, హైకోర్టు ఆదేశాల మేరకు నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పెట్టుకున్నాడు.

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ నిందితుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు కూడా. బెయిల్ వచ్చినప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల ఒక రాత్రి అతడు చంచల్ గూడ జైలులో గడిపాడు. అతడికి నంబర్ కూడా కేటాయించారు.

అలా మధ్యంతర బెయిల్ పై బయటకొచ్చిన అల్లు అర్జున్, హైకోర్టు ఆదేశాల మేరకు నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పెట్టుకున్నాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు, ఈ కేసును 30వ తేదీకి, అంటే సోమవారానికి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరింత సమయం కోరడంతో, కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన సందర్భంగా నాంపల్లి కోర్టు, నిందితుడికి 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఆ రిమాండ్ గడువు నేటితో ముగిసింది. దీంతో అతడి రిమాండ్ పై తదుపరి విచారణ జనవరి 10కి వాయిదా పడింది.

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కొడుకు తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, మొత్తం 18 మందిని నిందితులుగా పేర్కొన్నారు.

ఏ1 నుంచి ఏ8 వరకు సంధ్య థియేటర్‌ యాజమాన్యాన్ని, మేనేజర్ ను, ఏ9, ఏ10 గా సెక్యూరిటీ ఇంచార్జ్, ఫ్లోర్ ఇన్‌చార్జ్‌ను, ఏ11 గా హీరో అల్లు అర్జున్ ను, ఏ12 నుంచి ఏ17వరకు అల్లు అర్జున్‌ బౌన్సర్లను… ఏ18గా మైత్రీ మూవీమేకర్స్‌ను నిందితులుగా చేర్చారు.

ఏ11 నిందితుడుగా అల్లు అర్జున్ ఇప్పటికే ఓసారి పోలీసుల విచారణకు హాజరయ్యాడు. దాదాపు 4 గంటల పాటు పోలీసులు నిందుతుడ్ని ప్రశ్నించారు. ఓవైపు విచారణ నడుస్తుండగానే, మరోవైపు అతడి జ్యూడీషియల్ రిమాండ్ పై, రెగ్యులర్ బెయిల్ పై వాయిదాలు నడుస్తున్నాయి.

2 Replies to “అల్లు అర్జున్ కేసుపై అప్ డేట్”

    1. వాడు మన అన్న జాతకం కూడా చెప్పేడు కదా…..లాస్ట్ కి ఏమైంది ఉప్మా అయ్యింది అన్న పరిస్థితి

Comments are closed.