అప్పలకొండ: అరేయ్ జోగి! ఉన్నట్టుండి మనల్ని జైల్లో పడేస్తే ఏం చెయ్యాలంటావ్?
జోగినాథం: మనల్నెవడు పెడతాడ్రా కొండా! ఎవ్వణ్ణీ కనీసం లెంపకాయ కూడా కొట్టలేదు ఇప్పటిదాకా.
అప్పలకొండ: అవుననుకో…ఒకవేళ పెడితే?
జోగినాథం: (చిరాగ్గా) ఎందుకు పెడతార్రా? ఏం చేసామని?
అప్పలకొండ: (అంతే చిరాగ్గా) ఎహె. ఏమీ చెయ్యకపోయినా పెట్టేయొచ్చు. అన్నీ తెలుసంటావ్..ఇది మాత్రం తెలీదు నీకు.
జోగినాథం: (కూల్ గా) అది కాదురా…ఏ దొంగతనమో, మానభంగమో, మర్దరో, దొమ్మీయో చేస్తేనో..కనీసం తాగి బండి నడిపితేనో కదరా జైల్లో పెట్టేది. ఉత్తిపుణ్యానికి ఎందుకు పెడతారు? నీకు తెలిస్తే చెప్పు..
అప్పలకొండ: అందుకే మరి సినిమాలు చూడమనేది.
జోగినాథం: (నిట్టూరుస్తూ) ఓహో…సినిమా నాలెడ్జా?
అప్పలకొండ: అలా నిట్టూర్చకురోయ్..సినిమాయే కదా అని తీసి పారెయ్యకు. ఈ మధ్య బోల్డెంత లోకజ్ఞానం ఇచ్చే సినిమాలు తీసేత్తన్నారు.
జోగినాథం: సరే..మొదలెట్టు.
అప్పలకొండ: (ఉత్సాహంగా నవ్వుతూ) ముందుగా “నాంది”…ఏంటి!!? ఒకవేళ అన్యాయంగా మనల్ని ఏ పోలీసోడైనా, మంత్రైనా, ఇంకా పెద్దోడైనా సరే బొక్కలో ఏయిస్తే..కేసు కొట్టేసాక ఆళ్ల మీద కూడా మనం రివెర్స్ కేసు పెట్టొచ్చు. అదన్నమాట.
జోగినాథం: ఇది ముందే ఉంది కదరా! పరువునష్టం కేసు.
అప్పలకొండ: మరదే..హాఫ్ నాలెడ్జ్ అంటే..పరువునష్టం కేసు కాదురా. మనల్ని ఏ నేరం కింద లోపలేసారో, ఆ నేరాన్ని నిజంగా చేస్తే ఎన్నేళ్లు జైలు శిక్ష పడుద్దో ఆ శిక్షని మన మీద దొంగ కేసు పెట్టినోళ్లకి ఏయించేసే పవర్ఫుల్ సెక్షనన్నమాట. దాని నెంబర్ 211..
జోగినాథం: అబ్బో…అయితే ఇది గొప్ప విషయమేరా. పాపం మనబోటోళ్లకి పెద్దోళ్ల మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం అన్నమాట.
అప్పలకొండ: అవును
జోగినాథం: మరి అలా రివెర్స్ కెసు పెడితే ఆ పెద్దోళ్లు కక్షగట్టి మనల్ని లేపేస్తేనో?
అప్పలకొండ: ఎహె. లేపలేర్రా..నాందిలో అల్లరి నరేష్ ని అలాగే లేపాలనుకున్నారు. కానీ ఏం పీకలేకపోయారు.
జోగినాథం: అది సినిమారా..ఆడు హీరో!!
అప్పలకొండ: (షాకింగ్ గా చూస్తూ) అంతేనంటావా? ఈ యాంగిల్లో నేను పెద్దగా ఆలోచించలేదురోయ్. మరెందుకు తీసినట్టురా ఆ సినిమా?
జోగినాథం: నీలాంటి పిరికి సన్నాసుల కోసం కాదు. ధైర్యవంతుల కోసం. జరిగిన అన్యాయానికి సమాధానం చెప్పే లీగల్ అస్త్రం ఉందని చెప్పడానికి. తీసినోడికి నా హ్యాట్సాఫ్.
అప్పలకొండ: అయితే నాకు ఈ యాంగిల్ కన్నా “చెక్” ఫార్ములాయే బెటరేమో.
జోగినాథం: అదేంటిరోయ్?
అప్పలకొండ: ట్యలెంటురా…ట్యాలెంటుంటే ఉరిశిక్ష పడినా కూడా తప్పించుకోవచ్చంట.
జోగినాథం: ఏంటి? జైలు గోడ దూకే ట్యాలెంటా?
అప్పలకొండ: ఎహె అది కాదు. చెస్ ఆట ఆడడం లాంటిదన్నమాట.
జోగినాథం: దాంతో పనేమవుద్దిరా?
అప్పలకొండ: చెస్సులో విపరీతమైన ట్యాలెంటుందని శిక్ష పడిన టెర్రరిస్టు మీద జనాల్లో సింపతీ కలిగించి, ఉరి నుంచి యావజ్జీవ కారాగార శిక్ష కి తగ్గించే ప్రయత్నం చేస్తుంది అందులో లాయరమ్మ రకుల్ ప్రీత్.
జోగినాథం: పనయ్యిందా?
అప్పలకొండ: లేదురా..సింపతీ వచ్చే టైముకి టైం కలిసిరావట్లేదని హీరో జైల్లోంచి పారిపోయాడు.
జోగినాథం: ఎలా పారిపోయాడు?
అప్పలకొండ: టన్నెల్ తవ్వించుకుని…(చిరగ్గా)..అంతా చెప్పడం కష్టం రా..సినిమా చూడెళ్లి.
జోగినాథం: చూస్తాలే గానీ..అంతలా తవ్వించుకుని పారిపోయే ట్యాలెంటున్నప్పుడు చెస్ ఆట ఏమి ఉపయోగపడినట్టు?
అప్పలకొండ: అదీ నిజమేరా. అయితే ఇది కూడా కరెక్ట్ కాదు నాకు. మరెలారా? అన్యాయంగా ఎవడైనా నన్ను జైల్లో పెడితే?
జోగినాథం: నిన్ను అన్యాయంగా జైల్లో పెట్టెంత అన్యాయం ఎవ్వడూ చెయ్యడులే గానీ ప్రశాంతంగా ఇంటర్నెట్లో “శ్రీ రామదాసు” సినిమా చూడు.
అప్పలకొండ: సూపర్రా జోగి. బాగా గుర్తు చేసావ్. నాకు అన్యాయం చేసినోడికి దేవుడే కళ్లు తెరిపిస్తాడని మా అమ్మమ్మ కూడా చెప్పేదిరా. దేవుడ్ని నమ్ముకున్నోడికి ఏమీ అవ్వదురా? రామదాసులాగ!