పాపం.. ఆయన మాటతీరే అంత

నిర్మాత నాగవంశీ యాటిట్యూడ్ ఏంటి.. ఆయన మాటతీరు ఎలా ఉంటుందనే విషయం తెలుగు సినీ జర్నలిస్టును ఎవర్ని అడిగినా చెబుతారు.

నిర్మాత నాగవంశీ యాటిట్యూడ్ ఏంటి.. ఆయన మాటతీరు ఎలా ఉంటుందనే విషయం తెలుగు సినీ జర్నలిస్టును ఎవర్ని అడిగినా చెబుతారు. మొన్నటికిమొన్న ఓ మహిళా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన వ్యంగ్యంగా స్పందించిన తీరు ఇప్పటికీ చాలామందికి గుర్తే. నాగార్జున-కొండా సురేఖ ఇష్యూపై స్పందించమని అడిగితే ఆ టైమ్ లో తను విదేశాల్లో ఉన్నానని సెటైరిక్ గా చెప్పడం ఆయనకే చెల్లింది.

ఇదేదో ఆయన్ను విమర్శించే కార్యక్రమం కాదు. ఆయన మాటతీరే అంత. ఆయన వైఖరి అది. బాడీ లాంగ్వేజ్ ఎవరి కోసమో మారదు కదా. బాలీవుడ్ జనాలకు ఇప్పుడు తెలిసొచ్చిందంతే.

ప్రస్తుతం సోషల్ మీడియాలో నాగవంశీ పేరుతో హోరెత్తిపోతోంది. కొంతమంది నార్త్-సౌత్ నిర్మాతలతో కలిసి నిర్వహించిన చిన్న చిట్ చాట్ కార్యక్రమంలో బోనీ కపూర్, నాగవంశీ పక్కపక్కన కూర్చున్నారు. గట్టిగా వాదించుకున్నారు. ఇద్దరి వాదనల్లో లాజిక్ ఉంది, పస ఉంది.

ఎటొచ్చి బోనీ కపూర్ లాంటి పెద్ద మనిషి ముందు నాగవంశీ యాటిట్యూడ్ బాగాలేదనేది ప్రధానంగా బాలీవుడ్ మేకర్స్ నుంచి విమర్శ. బోనీ లాంటి వ్యక్తికి గౌరవం ఇస్తూ మాట్లాడాలని, అతడితో వినయంగా మాట్లాడాలనే కామన్ సెన్స్ నాగవంశీకి లేదంటూ కొందరు దుమ్మెత్తిపోస్తున్నారు. ఏం చేస్తాం, నాగవంశీ మాటతీరే అంత.

పుష్ప-2 సినిమా సింగిల్ డేలో 85 కోట్లు వసూలు చేసినప్పుడు బాలీవుడ్ లో చాలామందికి నిద్రపట్టి ఉండదంటూ ఘాటు విమర్శ చేశారు నాగవంశీ. అక్కడితో ఆగలేదు, బాలీవుడ్ సినిమా బాంద్రా, జుహూకే పరిమితమైపోయిందన్నారు. దీనికి బోనీ కపూర్ దీటుగా స్పందించారు.

బాలీవుడ్ గొప్పదనాన్ని మరిచిపోకూడదన్నారు. అల్లు అర్జున్ కూడా అమితాబ్ బచ్చన్ అభిమాని అనే విషయాన్ని గుర్తుచేశారు. తను ఎన్టీఆర్ అభిమానినని అన్నారు. దీనికి కూడా నాగవంశీ తనదైన వైఖరితో కౌంటర్ ఇవ్వడంతో కొంతమంది బాలీవుడ్ జనాలకు అది నచ్చలేదు.

ఫిలిం మేకర్ సంజయ్ గుప్తా, నాగవంశీపై విరుచుకుపడ్డాడు. బోనీ జీ లాంటి సీనియర్ నిర్మాత పక్కన కూర్చొని, ఫేక్ క్రేజ్ తో, కనిపిస్తున్న ఈ అసహ్యకరమైన వ్యక్తి ఎవరు అంటూ మండిపడ్డాడు. సౌత్ సినిమా నుంచి ఇలాంటి అసహ్యకరమైన వైఖరిని తను చూడలేదన్నాడు. దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎంతోమంది సౌత్ మేకర్స్, తమ వినయం-మాటతీరుతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారని, వాళ్లను చూసి నాగవంశీ నేర్చుకోవాలని సూచించాడు.

సంజయ్ గుప్తాతో పాటు మరింత మంది బాలీవుడ్ క్రిటిక్స్ నాగవంశీపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. అయితే మనోడు కూడా ఏం తగ్గలేదు. దీటుగానే స్పందించాడు. పెద్దల్ని ఎలా గౌరవించాలో బాలీవుడ్ జనం తనకు నేర్పించక్కర్లేదన్నాడు. బాలీవుడ్ జనం బోనీకి గౌరవించే కంటే ఎక్కువగానే తాము ఆయన్ను గౌరవిస్తామన్నాడు.

రౌండ్ టేబుల్ కార్యక్రమం ముగిసిన తర్వాత తను, బోనీ హ్యాపీగా నవ్వుకొని కౌగిలించుకున్నామని, కాబట్టి వీడియోలో తన మాటలు చూసి ఓ అభిప్రాయానికి రావొద్దని సూచిస్తున్నాడు. నాగవంశీ క్లారిటీ ఇచ్చినా అతడిపై ట్రోలింగ్ ఏమాత్రం తగ్గలేదు.

5 Replies to “పాపం.. ఆయన మాటతీరే అంత”

  1. GA గారు మీరు చెప్పే నేటిజెన్స్ ఏమో గాని జనరల్ నెటిజన్స్ మాత్రం నాగ వంశీ గారిని సపోర్ట్ చేస్తున్నారు ఈ విషయం లో

Comments are closed.