టాలీవుడ్‌లో మ‌రో బ‌యోపిక్‌పై వివాదం

రాజ‌కీయ నాయ‌కుల జీవిత చ‌రిత్ర‌ల ఆధారంగా తెర‌కెక్కే బ‌యోపిక్‌లు టాలీవుడ్‌లో వివాదాస్ప‌దం కావ‌డం కొత్తేమీ కాదు. ఇప్పుడు మ‌రో చిత్రం కూడా అదే కోవ‌లో చేరింది. స‌ద‌రు సినిమా నిర్మాత‌లు, ద‌ర్శ‌కుడిపై వైసీపీ యువ‌నేత…

రాజ‌కీయ నాయ‌కుల జీవిత చ‌రిత్ర‌ల ఆధారంగా తెర‌కెక్కే బ‌యోపిక్‌లు టాలీవుడ్‌లో వివాదాస్ప‌దం కావ‌డం కొత్తేమీ కాదు. ఇప్పుడు మ‌రో చిత్రం కూడా అదే కోవ‌లో చేరింది. స‌ద‌రు సినిమా నిర్మాత‌లు, ద‌ర్శ‌కుడిపై వైసీపీ యువ‌నేత ఫైర్ అయ్యారు. అలాగే త‌మ అనుమ‌తి లేకుండా సినిమా తెర‌కెక్కించ‌డంపై పోలీసుల‌కు ఫిర్యాదు కూడా చేశారు.

టాలీవుడ్‌లో తాజాగా  'దేవినేని' సినిమా వివాదానికి దారి తీసింది. బెజ‌వాడ నేప‌థ్యంలో ప్ర‌ముఖ పొలిటీషియ‌న్ దేవినేని నెహ్రూ జీవిత క‌థ ఆధారంగా ద‌ర్శ‌కుడు న‌ర్రా శివ‌నాగేశ్వ‌ర‌రావు 'దేవినేని' చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాను జీఎస్ఆర్‌, రాము రాథోడ్ నిర్మిస్తున్నారు.  

నందమూరి తారకరత్న టైటిల్‌ పాత్రలో నటిస్తోన్న 'దేవినేని' చిత్రానికి 'బెజవాడ సింహం' అనేది ట్యాగ్‌లైన్‌. గ‌తంలో వంగ‌వీటి మోహ‌న్‌రంగా, దేవినేని వ‌ర్గాల మ‌ధ్య జ‌రిగిన ఆధిప‌త్య పోరు చివ‌రికి అనేక హ‌త్య‌ల‌కు దారి తీసిన సంగ‌తి తెలిసిందే. 

ఇరు వైపు కుటుంబ స‌భ్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేప‌థ్యంలో వంగ‌వీటి రాధ పాత్ర‌లో న‌టుడు బెన‌ర్జీ, వంగ‌వీటి రంగా పాత్ర‌లో సురేష్ కొండేటి , చ‌ల‌సాని వెంక‌ట‌ర‌త్నం పాత్ర‌లో తుమ్మ‌ల ప్ర‌స‌న్న‌కుమార్‌, కేఎస్ వ్యాస్ పాత్ర‌లో సంగీత ద‌ర్శ‌కుడు కోటి న‌టించారు.

బెజవాడలో ఇద్దరు మహానాయకుల మధ్య స్నేహం, శ‌త్రుత్వంతో  పాటు  సెంటిమెంట్‌ కలయికలో ఈ చిత్రాన్ని రూపొందిస్తు న్నట్లుగా దర్శకుడు నర్రా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి పాత‌క‌క్ష‌ల‌ను తిర‌గ‌దోడేలా సినిమా తెర‌కెక్కిస్తున్నార‌నే భ‌యం అన్ని వ‌ర్గాల్లో ఉంది. 

ఈ నేప‌థ్యంలో ఈ సినిమాను త‌మ అనుమ‌తి లేకుండా తెర‌కెక్కించ‌డంపై దేవినేని నెహ్రూ త‌న‌యుడు, వైసీపీ యువ‌నేత దేవినేని అవినాష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వెంట‌నే సినిమాను నిలిపివేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. అంతేకాకుండా, ఈ సినిమా నిర్మాత‌లు, ద‌ర్శ‌కుడిపై అవినాష్ పోలీస్ కేసు ఫైల్ చేయ‌డం గ‌మ‌నార్హం.  

గ‌తంలో వంగ‌వీటి జీవిత క‌థ ఆధారంగా ప్ర‌ముఖ వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు వ‌ర్మ సినిమాను తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో వంగ‌వీటి కుమారుడు రాధా కూడా వ‌ర్మ సినిమాపై అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఆ త‌ర్వాత సర్దుమ‌ణిగింది. తాజాగా దేవినేని సినిమాపై ఆయ‌న త‌న‌యుడు అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డంతో టాలీవుడ్‌లో చ‌ర్చ‌కు దారి తీసింది.

ఉప్పెనంత వసూళ్లు

రెడ్డి కులస్తులు ఓన్ చేసుకుంటారా?