రంగారెడ్డి జిల్లా రావిలాలలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి నిర్వహించిన రణభేరి బహిరంగ సభకు ఎవరూ ఊహించని అతిథి హాజరయ్యారు. ఆ అతిథే సూరీడు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా సూరీడు సుపరిచితుడే.
వైఎస్సార్‌కు నీడలా వెంట నడిచిన సూరీడు … ఆయన మరణానంతరం రాజకీయంగా కనుమరుగయ్యాడు. ఈ నేపథ్యంలో రేవంత్ బహిరంగ సభా వేదికపై సూరీడు తళుక్కున మెరిసి అందర్నీ ఆశ్చర్య పరిచాడు.
వైఎస్సార్ మరణానంతరం కొన్ని రోజులు మాత్రమే ఆయన కుటుంబంతో సూరీడు ఉన్నాడు. జగన్ కుటుంబంతో సూరీడుకి మంచి సంబంధాలు లేవని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది.
అందుకు తగ్గట్టుగానే జగన్ కుటుంబానికి సూరీడు పూర్తిగా దూరంగా ఉంటున్నాడు. దీంతో వైఎస్‌కు నీడలాంటి సూరీడు గురించి జనం మరిచిపోయారు. వ్యక్తిగత వ్యాపారాలను చూసుకుంటున్నారని అడపాదడపా ఆయన గురించి బాగా తెలిసిన వాళ్లు చెబుతుంటారు.
అంతకు మించి ఆయన ఎప్పుడూ మీడియా కంట పడలేదు. తాజాగా రేవంత్‌రెడ్డి నిర్వహిస్తున్న రణభేరి సభలో సూరీడు ఒక్కసారిగా ప్రత్యక్షం కావడంతో, మీడియా కెమెరాలు క్లిక్‌మనిపించాయి. రేవంత్‌తో కలిసి ఆయన ఫొటో దిగారు. కాంగ్రెస్ నేతలతో పాత పరిచయాల నేపథ్యంలో సభా వేదికపై సూరీడుని పలువురు ఆప్యాయంగా పలకరించారు.