ఫిబ్రవరికి ఫుల్ అవుతోంది మెల్లగా!

ఫిబ్రవరి మొత్తం థియేటర్లలో సినిమాలు ఫుల్‌గా వుంటాయి. మార్చి నెలలోనే అసలు సమస్య మొదలవుతుంది.

ఈసారి ఫిబ్రవరి పోటాపోటీగా వుంటుంది అనుకున్నారంతా. ఎందుకంటే సంక్రాంతికి పెద్దగా సినిమాలు రాలేదు. మూడే మూడు సినిమాలు వచ్చాయి. సంక్రాంతి వెళ్లిన దగ్గర నుంచి మూడు వారాల పాటు సరైన సినిమా రాలేదు థియేటర్ లోకి. అందువల్ల అన్ని సినిమాలు కలిసి ఫిబ్రవరిలో కుమ్మేసుకుంటాయని అనుకున్నారంతా. కానీ పరిస్థితి చూస్తుంటే ఫిబ్రవరిలో కూడా సెలెక్టివ్ గా సినిమాలు వచ్చేలా కనిపించింది. కానీ మెలమెల్లగా ఒక్కో సినిమా యాడ్ అవుతున్నాయి.

7న తండేల్ సినిమా విడుదలవుతోంది. చైతన్య-సాయిపల్లవిల భారీ సినిమా. ఈ సినిమాతో పాటు అజిత్ డబ్బింగ్ సినిమా పట్టుదల కూడా. ఆ పై వారం రెండు తెలుగు సినిమాలు. లైలా..బ్ర‌హ్మ అనందం. అంటే అప్పటికి థియేటర్లో నాలుగు సినిమాలు అవుతాయి. 21న ఒక డబ్బింగ్ సినిమా ధనుష్ డైరక్షన్ లో. అది అయిదో సినిమా. 26న సందీప్ కిషన్ మజాకా సినిమా వుండనే వుంది. దీనికి మల్టీ స్టారర్ భైరవం తోడయ్యేలా వుంది. అంటే అప్పటికి ఏడు సినిమాలు అవుతాయి.

పట్టణాల్లో ఎక్కువ థియేటర్లు వుంటాయి కనుక ఇన్ని సినిమాలు ఏదో కాస్త షేర్ మీద అయినా రన్ అవుతూ వుంటాయి. సింగిల్ స్క్రీన్ లు, రెండు స్క్రీన్ లు వున్న చోట్ల మాత్రం సినిమా ఇలా విడుదల చేసి మూడు రోజుల తరువాత లేపేయాల్సి వుంటుంది.

ఇక్కడ మరో పాయింట్ కూడా వుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇంకా చాలా థియేటర్లలో వుంది. వీకెండ్స్ లో ఫుల్ అవుతోంది కూడా. అందువల్ల చాలా వరకు థియేటర్లలో ఆ సినిమాను ఇంకా వుంచుతారు. పైగా బాగా లాభాలు తీసుకున్నారు కనుక, షేరింగ్ మీద రెండు మూడు వారాలు ఆడడానికి కూడా ఎగ్జిబిటర్లు కాదు అని అనరు.

ఫిబ్రవరి మొత్తం థియేటర్లలో సినిమాలు ఫుల్‌గా వుంటాయి. మార్చి నెలలోనే అసలు సమస్య మొదలవుతుంది.

One Reply to “ఫిబ్రవరికి ఫుల్ అవుతోంది మెల్లగా!”

Comments are closed.