తాను ఎప్పుడూ పాత్రను చూసి సినిమా చేయనని, తన పాత్ర కన్నా మంచి కథ అయితే చాలు, చిన్న, పెద్ద, కొత్త, పాత ఏవీ చూడనని, తన వరకు గాలి సంపత్ సినిమా చేయడం ఓ అద్భుతం అని హీరో శ్రీవిష్ణు అన్నారు.
గాలిసంపత్ ప్రీరిలీజ్ ఫంక్షన్ లో శ్రీవిష్ణ ప్రసంగిస్తూ, తన కెరీర్ జరిగిన ఓ అద్భుతం గాలిసంపత్ అని, ఎవరి సినిమా చూస్తూ పెరిగానో, ఎవరి సినిమాలు చాలా మంది ఆనందించిన వాటిలో సగం వరకు వుంటాయో అలాంటి రాజేంద్ర ప్రసాద్ తో చేయడం అన్నది ఆ అద్భుతం అని శ్రీవిష్ణు అన్నారు.
ఆయన నట విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూస్తారని, చూసిన తరువాత లేచి శాల్యూట్ చేయాల్సిందే అని లేదూ అంటే తాను చెప్పేది ఏమీ లేదని శ్రీవిష్ణు అన్నారు.
కరోనాకు అందరూ భయపడుతున్న టైమ్ లో, ఈ వయసులో రాజేంద్ర ప్రసాద్ ధైర్యం చేసి ఈ సినిమా చేయడం అబ్బురం అని, ఈ సినిమా దర్శకుడు అనీష్ ఎప్పుడు సినిమా చేస్తా అన్నా తాను సిద్దం అని అన్నారు.
ఇండస్ట్రీలోకి ముందుగా దర్శకుడు అవుదామని వచ్చానని, ఆ టైమ్ లో తాను రాసుకున్న కథలు అన్నీ హీరో రామ్ కోసమే అన్నట్లు వుండేవని, అలాంటి రామ్ తన సినిమా ఫంక్షన్ కు రావడం ఓ కలలా వుందని విష్ణు అన్నారు.
ఈ సినిమా నిర్మాతలు సాయి, సాహో, హరీష్ ముగ్గురికి వున్న స్టామినా, ఉత్సాహం చూస్తుంటే వారు నిర్మాతలుగా చాలా పెద్ద స్థాయిని అందుకుంటారని శ్రీవిష్ణు అన్నారు.