బాలీవుడ్ ప్రముఖ నటి విద్యాబాలన్‌కు మరెవరికీ లేనంతగా ఈ రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెకు మాత్రమే ఎందుకలా? అనే అనుమానం ఎవరికైనా రావచ్చు. ఔను, అందుకు ఓ ప్రత్యేక విశేషం ఉంది.
విద్యాబాలన్ తన 42వ పుట్టిన రోజును జనవరి 1న అంటే నేడు జరుపుకుంటున్నారు. అందుకే ఆమెకు పుట్టిన రోజుతో పాటు కొత్త ఏడాదిని పురస్కరించుకుని కూడా నటీనటులు, సెలబ్రిటీలు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు.
విద్యాబాలన్ వెండితెర కంటే ముందు బుల్లితెరపై విశేష పాపులారిటీ సంపాదించుకున్నారు. బుల్లితెరపై ఆమె ‘హమ్ పాంచ్’ సిరీయల్లో నటించి మెప్పించారు. ఈ సిరీయల్ 1995 నుంచి 2006 వరకు ప్రసారం అయ్యింది. ఈ సిరియల్లో విద్యాబాలన్ నటన ఆమెకు వెండి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేలా చేశాయి.
మాధురీదీక్షిత్ స్ఫూర్తితో చిత్రపరిశ్రమలోకి వచ్చిన విద్యా బాలన్ … భాలో థేకొ అనే బెంగాలీ చిత్రంతో 2003లో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత 2005లో ‘పరిణితా’ సినిమాతో విద్యా బాలన్ బాలీవుడ్‌కు పరిచయం అయ్యారు.
అనంతరం ఆమె వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. ఏ వేడుకలోనైనా చీరలోనే ప్రత్యక్షం కావడం విద్యాబాలన్ ప్రత్యేకత. చీరకట్టుకే ఆమె 'ట్రేడ్‌మార్క్' గా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు. నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న విద్యాబాలన్‌కు మనమూ శుభాకాంక్షలు చెబుదాం.