ఎట్టకేలకు హీరోకు బెయిల్

వీరాభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టైన కన్నడ స్టార్ హీరో దర్శన్ కు ఎట్టకేలకు బెయిల్ దొరికింది. కర్నాటక హైకోర్టు ఆయనకు 6 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో దర్శన్ అభిమానులు…

వీరాభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టైన కన్నడ స్టార్ హీరో దర్శన్ కు ఎట్టకేలకు బెయిల్ దొరికింది. కర్నాటక హైకోర్టు ఆయనకు 6 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో దర్శన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

బళ్లారి జైళ్లో ఉన్న దర్శన్, తనకు నడుము నొప్పి తీవ్రంగా ఉందని, ఆపరేషన్ చేయించుకోవాలని, దాని కోసం బెయిల్ కావాలని కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో దర్శన్ కు హాస్పిటల్ లో టెస్టులు చేయించారు. ఆయనకు సర్జరీ తప్పదని వైద్యులు నిర్థారించడంతో, కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

అయితే దర్శన్ కు ఇచ్చిన గడువు 6 వారాలు మాత్రమే. ఈ టైమ్ లోనే ఆయన చికిత్స పూర్తిచేసుకోవాలి. అంతేకాదు, ఈ టైమ్ లో దేశం దాటి వెళ్లకుండా ఉండేందుకు పాస్ పోర్ట్ సీజ్ చేయాలని, షూటింగ్స్ కూడా పాల్గొనకూడదని కోర్టు ఆదేశించింది.

హీరో దర్శన్, హీరోయిన్ పవిత్ర చాలా క్లోజ్. ఆమెపై దర్శన్ అభిమాని రేణుకాస్వామి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో దర్శన్ అతడ్ని కిడ్నాప్ చేయించి, చిత్రహింసలుపెట్టి, హత్య చేయించాడనేది అతడిపై ఆరోపణ. ఈ కేసుకు సంబంధించి జూన్ 11న అరెస్ట్ అయిన దర్శన్, అప్పట్నుంచి జైళ్లోనే ఉన్నాడు.

3991 పేజీల భారీ ఛార్జ్ షీటులో దర్శన్-పవిత్రతో పాటు మిగతా 15 మంది నిందితులపై 200 సాక్ష్యాధారాల్ని ప్రవేశపెట్టారు పోలీసులు. వీటిలో అత్యంత కీలకమైన రక్తపు మరకల సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. దర్శన్-పవిత్ర దుస్తులు, షూ నుంచి రేణుకా స్వామి రక్తపు మరకల ఆనవాళ్లను పోలీసులు రాబట్టారు. మొత్తం కేసుకు ఇదే కీలకం అంటున్నారు.

దీంతో అతడికి కింది కోర్టు బెయిల్ నిరాకరించింది. అయితే అనారోగ్య కారణాల వల్ల బెయిల్ ఇవ్వాల్సిందిగా హైకోర్టును ఆశ్రయించి, అనుకున్నది సాధించాడు దర్శన్.

తాజా బెయిల్ పై మృతుడు రేణుకా స్వామి తండ్రి స్పందించాడు. దర్శన్ కు కేవలం వెన్ను ఆపరేషన్ కోసం మాత్రమే బెయిల్ వచ్చిందని.. ఈ కేసులో దోషులకు కచ్చితంగా శిక్ష పడుతుందని, తనకు న్యాయస్థానాలపై నమ్మకం ఉందని ఆయన అన్నాడు.

4 Replies to “ఎట్టకేలకు హీరోకు బెయిల్”

Comments are closed.