అమ్మ తనతో లేకపోయినా, ఆమె చెప్పిన మాటలు నిత్యం తనను నడిపిస్తుంటాయని అంటోంది శ్రీదేవి కూతురు, బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్. తను ఎలా నడుచుకోవాలి, ఇండస్ట్రీలో ఎలా ఉండాలి లాంటి విషయాల్ని అమ్మ చెప్పేదని అంటోంది. మరీ ముఖ్యంగా ఒకరిపై ఆధారపడకుండా జీవించడం అమ్మను చూసి నేర్చుకున్నానని అంటోంది.
“ఏదో ఒకదానిపైన, లేదా ఎవరో ఒకరి పైన ఆధారపడకుండా ఉండే మహిళలంటే నాకు చాలా ఇష్టం. అలాంటి వాళ్లే నాకు స్ఫూర్తి. నాకు మా అమ్మ ఎప్పుడూ చెప్పే విషయం ఇదే. సొంతంగా గుర్తింపు తెచ్చుకోవాలని, ఏ విషయంపై, ఎవరిపైనా ఆధారపడకుండా జీవించాలని చెప్పింది. ప్రస్తుతం నేను అదే చేస్తున్నాను. భవిష్యత్తులో కూడా అమ్మ చెప్పిందే ఫాలో అవుతాను.”
అలియా భట్, సారా అలీఖాన్, పాప్ సింగర్ బియాన్స్ అంటే తనకు ఇష్టం అంటోంది జాన్వి కపూర్. వాళ్లు తమకంటూ ఓ సొంత గుర్తింపు సంపాదించుకున్నారని.. వాళ్ల మనస్తత్వం, నడుచుకునే విధానం తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది. ఇక తన చెల్లెలు ఖుషీ కపూర్ కూడా తనకు అప్పుడప్పుడు స్ఫూర్తిగా నిలుస్తుందని అంటోంది జాన్వి.
జాన్వి కపూర్ హీరోయిన్ గా పరిచయమైన ధడక్ సినిమా విడుదలకు కొన్ని నెలల ముందు శ్రీదేవి మృతి చెందింది. తన తొలి సినిమా చూడకుండానే అమ్మ ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయిందనే బాధ తనను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుందంటోంది జాన్వి. అయితే జాన్వి నటించిన కొన్ని క్లిప్పింగ్స్ ను నిర్మాత కరణ్ జోహార్, శ్రీదేవికి చూపించాడని అంటారు.