మా సినిమాను వెనక్కు వెళ్లమన్నారు

ఏ బ్యాకింగ్ లేని వాళ్లు సినిమా చేస్తే ఎన్ని ఇబ్బందులు వుంటాయో కార్తికేయ 2 విడుదల సమయంలో తెలిసిందని హీరో నిఖిల్ అన్నారు. తాము మూడేళ్లు కష్టపడి, పాండమిక్ పరిస్థితులను ఎదుర్కొని సినిమా చేసి…

ఏ బ్యాకింగ్ లేని వాళ్లు సినిమా చేస్తే ఎన్ని ఇబ్బందులు వుంటాయో కార్తికేయ 2 విడుదల సమయంలో తెలిసిందని హీరో నిఖిల్ అన్నారు. తాము మూడేళ్లు కష్టపడి, పాండమిక్ పరిస్థితులను ఎదుర్కొని సినిమా చేసి ఆగస్టు 22 న డేట్ వేసుకుంటే వెనక్కు వెళ్లమని చెప్పారన్నారు. 

సరే అని ఆగస్టు 5 అనుకుంటే అక్కడి నుంచి వెనక్కు పంపారన్నారు. 12 అనుకుంటే అక్కడ కూడా వద్దని అక్టోబర్ కు వెళ్లిపొమ్మని చెప్పారని వివరించారు. ఎప్పుడూ స్టబర్న్ గా వుండే తాను ఆ రోజు ఏడ్చానని నిఖిల్ అన్నారు.

పీపుల్స్ మీడియా నిర్మించిన కార్తికేయ 2 సినిమా విడుదల నేపథ్యంలో నిఖిల్ ‘గ్రేట్ ఆంధ్ర’ తో మాట్లాడారు. మొత్తానికి తమ నిర్మాతలు పట్టుదలతో ఆగస్టు 12న వస్తామని చెప్పి, విడుదలచేస్తున్నారని వారికి తాను ఎప్పటికీ రుణపడ వుంటానని అన్నారు. సినిమా చాలా బాగా వచ్చిందని, దేశంలోని అనేక లొకేషన్లలో చిత్రీకరించామని చెప్పారు.

ద్వారకలో సినిమా చిత్రీకరించడం తనకు మరిచిపోలేని అనుభూతిని ఇచ్చిందని, అలాగే ఇస్కాన్ మందిరంలో టీజర్ లాంచ్ చేయడం కూడా దైవ కృప అని నిఖిల్ అన్నారు. ఈ ఏడాది తనవి దాదాపు నాలుగు సినిమాలు రెడీగా వున్నాయన్నారు. 18 పేజెస్, సుధీర్ వర్మ సినిమా, మరో సినిమా కూడా దాదాపు షూటింగ్ ఆఖరి దశలో వున్నాయన్నారు.

ఇటీవల తన తండ్రిని కోల్పోవడం అత్యంత బాధాకరమైన సంఘటన అని, పిల్లలను పెంచి వాళ్లు ప్రగతి సాధించాక, ఆనందించాల్సిన సమయం లేకుండా మరణించడం చాలా విషాదం అని, అందుకే ఎవరైనా సరే వాళ్ల తల్లితండ్రులు వున్నపుడే కాస్త ఎక్కువ సమయం వారితో గడపాలని నిఖిల్ అన్నారు.

తన వైవాహిక జీవితం హ్యాపీగా సాగుతోందని, ఈ మేరకు వచ్చిన గ్యాసిప్ లు అన్నీ అవాస్తవమని అన్నారు.