నటుడు మమ్ముట్టి తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఓ సినిమా ఫంక్షన్ లో ప్రసంగిస్తూ, మమ్ముట్టి చూపించిన అత్యుత్సాహం, అతడిపై విమర్శలకు దారితీసింది. తప్పును తెలుసుకున్న ఈ సీనియర్ నటుడు, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే క్షమాపణలు కోరాడు.
ఇంతకీ ఏం జరిగింది..
యువ దర్శకుడు జాడ్ ఏంథనీ జోసెఫ్ ఓ సినిమా తీశాడు. దాని పేరు 2018. టొవినో థామస్, కుంచకో బోబన్, అసిఫ్ అలీ లాంటి ఆర్టిస్టులు నటించిన ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా టీజర్ ను కట్ చేశారు. ఈ టీజర్ ను మమ్ముట్టి చేతుల మీదుగా లాంఛ్ చేయించారు.
టీజర్ లాంఛ్ సందర్భంగా దర్శకుడు జాడ్ ను ప్రశంసల్లో ముంచెత్తాడు మమ్ముట్టి. సరిగ్గా అక్కడే కాస్త హద్దు మీరాడు. జాడ్ తలపై జుట్టు ఎక్కువగా లేకపోయినా, అతడి బుర్రలో చాలా మేటర్ ఉందనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యల్ని చాలామంది తప్పుపట్టారు.
తప్పు తెలుసుకున్న సూపర్ స్టార్
బట్టతల అనేది చాలామందిలో సహజమని. దాన్ని ఎత్తిచూపడం బాడీషేమింగ్ కిందకి వస్తుందని సోషల్ మీడియాలో పెద్ద దుమారం చెలరేగింది. మరీ ముఖ్యంగా మమ్ముట్టి లాంటి పెద్ద నటుడు, ఇలా బాడీ షేమింగ్ చేయడం తప్పని చాలమంది విమర్శించారు. దీనిపై మమ్ముట్టి వెంటనే స్పందించారు.
డైరక్టర్ జాడ్ జోసెఫ్ ను ప్రశంసిస్తూ తను చేసిన వ్యాఖ్యలు కొందర్ని బాధించాయని, తను అలా అనడం తప్పేనని అంగీకరించారు మమ్ముట్టి. తను చేసిన కామెంట్స్ పట్ల చింతిస్తున్నానని తెలిపారు.
ఈ మొత్తం వ్యవహారాన్ని దర్శకుడు జేడ్ మాత్రం లైట్ తీసుకున్నాడు. జుట్టు తక్కువగా ఉందని, తను, తన కుటుంబ సభ్యులు ఎప్పుడూ బాధపడలేదని, మమ్ముట్టి కావాలని ఆ వ్యాఖ్యలు చేయలేదని అన్నాడు. నిజంగా తన హెయిర్ ఫాల్ పై ఎవరైనా ఆందోళన చెందితే షాంపూ కంపెనీలకు వ్యతిరేకంగా గళం విప్పాలని అన్నాడు. అలా ఈ వివాదం సమసిపోయింది.