యువ హీరో మంచు మనోజ్ ట్వీట్ సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. ట్వీట్‌లో సస్పెన్స్ ఉన్నా…. అది పెళ్లికి సంబంధించిన ప్రకటన గురించే అనే చర్చకు తెరలేచింది. టాలీవుడ్ అగ్రనటుడు మంచు మోహన్‌బాబు తనయుడు మనోజ్, రాయలసీమలో ప్రముఖ రాజకీయ కుటుంబం భూమా నాగిరెడ్డి, శోభా దంపతుల తనయ మౌనికా ప్రేమలో ఉన్నారు. ఇద్దరి మొదటి వివాహాలు కలిసి రాని సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మంచు మనోజ్, మౌనిక కొంత కాలంగా కలిసి జీవిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ జంట తరచూ వివిధ ప్రాంతాలకు వెళుతోంది. దీంతో పెళ్లి చేసుకుంటున్నారన్న వార్తలు బలపడ్డాయి. పెళ్లికి సంబంధించి మనోజ్‌ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, కొట్టి పారేయలేదు కానీ దాట వేసిన సంగతి తెలిసిందే. మనోజ్ తాజా ట్వీట్ ఆయన పెళ్లి అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది.
“నా హృదయానికి చేరువైన ఓ ప్రత్యేకమైన వార్తను గత కొంతకాలంగా నాలోనే దాచుకుని ఉన్నాను. జీవితంలో మరో దశలోకి అడుగు పెడుతున్నందుకు సంతోషంగా ఉంది. జనవరి 20న వివరాలు ప్రకటిస్తా. ఎప్పట్లా మీ ఆశీస్సులు కావాలి” అని ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
ఫిబ్రవరి 2న పెళ్లి ముహూర్తం ఖరారైనట్టు తెలిసింది. పెళ్లికి కేవలం రెండువారాలు మాత్రమే గడువు వుండడంతో, ఆ విషయాన్ని అభిమానులతో పంచుకోనున్నారనే చర్చ జరుగుతోంది. హృదయ సంబంధమైన ప్రత్యేక వార్త అంటే… ప్రేమ, పెళ్లికి మించి ఏముంటాయి? అందుకే పెళ్లికి సంబంధించిన ప్రకటనే అని నెటిజన్లు నమ్మకంగా చెబుతున్నారు.