జోషిమఠ్ హిమాలయాల్లో వుంది. అక్కడ భూమి కుంగిపోతూ వుంది. దశాబ్దాల క్రితమే దీనిపై ఒక కమిటీ వేసారు. ఇక్కడ నిర్మాణాలు, ప్రాజెక్టులు ప్రమాదమని కమిటీ హెచ్చరించింది. అయినా ఎవరూ వినలేదు. టూరిస్టుల కోసం హోటళ్లు కట్టారు. ప్రాజెక్టులు కట్టారు. ఇప్పుడు ఇళ్లలో బీటలు వస్తూ వుండడంతో మేల్కొన్నట్టు నటిస్తున్నారు. వార్తలు సద్దుమణిగితే అంతా మామూలే.
హిమాలయ పర్వత ప్రాంతాలు గట్టిదనం ఉన్నవి కావు. కొండ చరియలు విరిగి పడడం సర్వసాధారణం. 1880లో నైనిటాల్‌లో 153 సార్లు కొండ చరియలు విరిగిపడితే 115 మంది యూరోపియన్లు చనిపోయారు. స్థానిక ప్రజలు ఎంత మంది పోయారో లెక్కల్లో లేవు. ఆ రోజుల్లో యూరోపియన్ల ప్రాణాలు మాత్రమే విలువైనవి. ఆ తర్వాత మురుగునీటి నిర్వహణకి 64 కాలువలు తవ్వించి నష్ట నివారణ చేసారు. ప్రకృతి ఎప్పుడూ హెచ్చరిస్తూనే వుంటుంది. మనమే వినం.
జోషిమఠ్ నుంచి మన తిరుమల కొండ నేర్చుకోవాల్సింది ఏమైనా వుందా? శేషాచలం కొండలు పురాతనమైనవి. భూమిలో గట్టిదనం ఎక్కువ. భూకంప ప్రమాదం లేనేలేదు. మరి దేనికి భయం? దేనికంటే విచ్చలవిడిగా జరిగిన, జరుగుతున్న నిర్మాణాలు. విశ్వేశ్వరయ్య కాలంలో నిర్మించిన మొదటి ఘాట్ సురక్షితం. అయితే రెండో ఘాట్ రోడ్‌లో వర్షం వస్తే రోడ్డుకి అడ్డంగా కొండ రాళ్లు దొర్లుతుంటాయి. ఇది నిర్మాణంలోని చిన్నలోపం అనుకుందాం.
అయితే 30 ఏళ్ల క్రితం తిరుమల చూసిన వాళ్లకి, తేడా స్పష్టంగా తెలుస్తుంది. అప్పటి చల్లదనం, స్వచ్ఛమైన గాలి లేదు. నిర్మాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. స్థానికులందరినీ కొండ దించేశారు. కొందరికి మాత్రం తిరుమల బాలాజీనగర్‌లో పునరావాసం ఇచ్చారు. కొండపైన అధికారం అంతా టీటీడీదే.
గత 50 సంవత్సరాలుగా ఏం జరిగిందంటే దేవుడిపైన భారం పెంచేశారు. గతంలో సులభంగా జరిగే దర్శనం ఇప్పుడు సంక్లిష్టం. ఉద్యోగుల సంఖ్య పెరిగిపోవడంతో టీటీడీ బడ్జెట్ పెరిగింది. స్థిరాస్తుల మీద వచ్చే ఆదాయం తక్కువ. హుండీ, దర్శనం టికెట్లు, గదుల ద్వారానే ఆదాయం రావాలి. దాంతో అన్ని ప్రభుత్వాలు గేట్లు ఎత్తేసి దాతల విరాళాలతో నిర్మాణాలు పెంచేశారు. పచ్చని చెట్లు,ప్రకృతి స్థానంలో కాంక్రీట్ నిర్మాణాలు పెరిగాయి. కొండల్లోకి చొచ్చుకెళుతున్నారు. రోడ్లు వేస్తున్నారు. ఆధ్యాత్మిక కేంద్రం, కట్టడాల పట్టణంగా మారితే టీటీడీకి లాభం కావచ్చు కానీ, ప్రకృతికి నష్టం.
ఫోర్‌వీలర్ కల్చర్ పెరగడంతో తిరుమలలో నిరంతరం కొన్ని వేల వాహనాలు తిరుగుతూ వుంటాయి. అందుకే తిరుమలలో ఒకప్పుడు ఎండాకాలం కూడా చల్లగా వుండేది. కొన్నేళ్లుగా ఆలయం బయట చలువ పందిళ్లు వేస్తున్నారంటే టెంపరేచర్‌లో మార్పు గమనించవచ్చు.
జోషిమఠ్ పరిస్థితి రాకపోవచ్చు. వచ్చే వరకూ తెచ్చుకోవద్దు.