‘మా’ ఎన్నికలను అత్యంత కట్టుదిట్టంగా జరుపతామని, ఆరోపణలు వస్తున్నట్టు రిగ్గింగ్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశమే ఉండదని సంబంధిత ఎన్నికల అథారిటీ ప్రకటించింది.
పోస్టల్ బ్యాలెట్లను తమకు అనుకూలంగా మలుచుకుని మంచు విష్ణు ప్యానల్ రిగ్గింగ్‌కు పాల్పడుతోందని ప్రకాశ్‌రాజ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా ‘మా’ ఎన్నికల అధికారి వి.కృష్ణమోహన్, అసిస్టెంట్ ఎన్నికల అధికారి జీవీ నారాయణరావు ఒక ప్రకటన విడుదల చేశారు.
పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని ఇటీవల కొందరు అభ్యర్ధులు ఆరోపించిన కారణంగా, దీనిపై పూర్తి వివరణ ఇస్తున్నట్టు వారు వెల్లడించారు. మా ఎన్నికలపై ఎలాంటి భయాలు, అపోహలు పెట్టుకోవద్దని ఆ ఇద్దరు అధికారులు సూచించారు.
పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని నిష్పక్ష పాతంగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్ పత్రాల జారీలో అవకతవకలపై వస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. ఆ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని కొట్టి పారేశారు.
పోస్టల్ బ్యాలెట్స్ ఓటర్స్ కు బ్లూ డార్ట్ కొరియర్ ద్వారా నిన్ననే పంపామని వారు వెల్లడించారు. రిగ్గింగ్‌కు ఎంత మాత్రం అవకాశం లేకుండా.. ఈ ఎలక్షన్స్ కోసం వెరిఫికేషన్ స్లిప్ విధానాన్ని పరిచయం చేస్తున్నట్టు ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.
ఈ ఎలక్షన్స్ ప్రక్రియ అంతా కట్టుదిట్టంగా, పూర్తి భద్రతతో నిర్వహిస్తున్నామని ఎలక్షన్ అథారిటీ స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో అనుమానాలను నివృత్తి చేసేందుకు ఎన్నికల అథారిటీ ప్రయత్నించిందని చెప్పొచ్చు.