ముంబై పరిసరాల్లో గత కొంతకాలంలో దాదాపు వంద రైడ్స్ ను నిర్వహించారట అక్కడి ఎన్సీబీ అధికారులు. వంద రైడ్స్ లో వాళ్లు ఏం పట్టుకున్నారో, డ్రగ్స్ మూలాలను ఎంత వరకూ శోధించారో కానీ.. క్రూజ్ షిప్ పై జరిపిన రైడ్ మాత్రం సంచలనంగా మారింది.
కేవలం ముంబై అనే కాదు.. హైదరాబాద్ పరిసరాల్లో కూడా తరచూ రేవ్ పార్టీలు అనే మాట వినిపిస్తూ ఉంటుంది. శనివారం, ఆదివారాల్లో ఈ వార్తలు వస్తుంటాయి. సోమవారానికి మళ్లీ వీటి అప్ డేట్ ఉండదు!
హైదరాబాద్ పరిసరాల్లో జరిగే రేవ్ పార్టీల వార్తల విషయానికి వస్తే.. నల్లగొండ జిల్లా వరకూ ఇలాంటి చోటు చేసుకుంటూ ఉంటాయి. శుక్రవారం రాత్రులు, శని-ఆదివారాల రాత్రులు వీకెండ్ సందర్భంగా జరుగుతూ.. శని, ఆదివారాల వార్తల్లో నిలుస్తాయి.
ఇలాంటి వాటిపై ఎన్ని రైడ్స్ జరిగినా.. అవి వార్తల్లో ఒకటీ రెండు రోజులే ఉంటాయి. అంతకు మించి మసాలా వాటిల్లో ఉండదు. ఆ రైడ్స్ లోనూ డ్రగ్స్ మూలాలు పట్టుపడుతూ ఉంటాయి, డ్రగ్స్ వినియోగదారులు ఉంటారు. వారిలో యువత, ఐటీ ఉద్యోగులు, ఓ మోస్తరు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారు.. ఉన్నట్టుగా వార్తల్లో చెబుతూ ఉంటారు.
మరి వాటికీ, ముంబై క్రూజ్ షిప్ రేవ్ పార్టీకీ ప్రధానమైన తేడా.. అందులో షారూక్ తనయుడు పట్టుబడటమే! దక్షిణాది మీడియాకు ఈ వ్యవహారంపై పెద్ద ఆసక్తి లేకపోయినా, ఉత్తరాదిన మాత్రం వేరే వార్తలు లేనట్టుగా ఉన్నాయి.
అన్నింటికీ మించి.. ఈ వ్యవహారంలో షారూక్ కు నీతులు చెప్పే సోషల్ మీడియా నెటిజన్లు, పిల్లల పెంపకంపై లెక్చర్లు దంచే వాళ్లు, సెలబ్రిటీల పిల్లలంటే ఇంతే అనే వాళ్లు.. ఎవరికి తోచినట్టుగా వాళ్లు దుమ్ముత్తి పోయడానికి అస్సలు వెనుకాడం లేదు!
గమనించాల్సిన అంశం ఏమిటంటే.. ఆ క్రూజ్ షిప్ లో ఆర్యన్ ఖాన్ ఒక్కడే డ్రగ్స్ వాడినట్టుగా కూడా ఎన్సీబీ అధికారులు చెప్పలేదు! రెండు రోజుల పాటు అలలపై తేలియాడుతూ సాగిపోయే ఆ పడవలో.. డ్రగ్స్ మత్తులో ఊగే వాళ్లూ చాలా మందే ఉండవచ్చు.
అలాగే ఆ క్రూజ్ షిప్ కు సంబంధించిన వీడియోల్లో కూడా ఇతరుల ఫేస్ లను బ్లర్ చేస్తూ, ఒక్క షారూక్ తనయుడి మొహం మాత్రమే కనిపించేలా వాటిని బయటకు వదిలి వైరల్ చేస్తున్నారు! తప్పదా.. షారూక్ తనయుడు అయినందుకు ఈ మాత్రం టార్గెట్ గా కావాల్సిందే అన్నట్టుగా మారింది ఇందులో నీతి!