బాహుబలితో పాన్ ఇండియా హీరో అయిపోయాడు రానా. అలా అని చకచకా సినిమాలు ఒకె చేసేయలేదు. పైగా హెల్త్ ఇస్యూలు రావడంతో సినిమా ల విషయంలో స్లోగానే వున్నాడు. నేనే రాజు నేనే మంత్రి తరువాత మహానాయకుడు లో చేసినా అది పెద్ద పాత్ర కాదు.
ఆ తరువాత ఫుల్ లెంగ్త్ లో కేవలం రానా హీరోగా తయారైన సినిమా అరణ్య నే. పైగా రానా అన్ని భాషల్లో ప్రేక్షకులకు వున్న పరిచయంతో అరణ్య సినిమాను పాన్ ఇండియా సినిమాగా నిర్మించారు. కానీ కరోనా వల్ల కేవలం దక్షిణాదిలోనే విడుదలయింది.
సినిమా విడుదల తరువాత ఎలా వుంటుందన్నది పక్కన పెడితే సబ్జెక్ట్, పబ్లిసిటీ, రానా అన్నీ కలిసి అరణ్య సినిమాకు మాంచి బజ్ తీసుకువచ్చాయి. సినిమాను ముందుగానే చాలా షోలు వేసి ఇండస్ట్రీ జనాలకు చూపించి, పాజిటివ్ వైబ్ ను కూడా క్రియేట్ చేసే ప్రయత్నం చేసారు.
ఇన్ని చేసినా సినిమాకు సరైన ఓపెనింగ్స్ దక్కలేదు. రంగ్ దే సినిమాతో పోటీగా విడుదలైన రానా సినిమా కు ఓపెనింగ్స్ దక్కలేదు. ఆపైన సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చేసింది. సినిమాను ముందే ముఫై నిమషాలు కోసేసినా,జనాలకు రీచ్ కాలేకపోయింది.
టోటల్ గా సినిమా తెలుగు నాట తొలి వీకెండ్ పెద్దగా గొప్ప ఫలితం సాధించలేదు. దీన్ని బట్టి చూస్తుంటే బాహుబలి సినిమా రానా కు సరైన మార్కెట్ ను క్రియేట్ చేయడం లేదని అర్థం అయిపోతోంది.
అలా క్రియేట్ చేసి వుంటే సినిమా ఫలితం ఎలా వున్నా కనీసం మంచి ఓపెనింగ్ దక్కేది. ప్రస్తుతం రానా చేతిలో విడుదలకు రెడీగా విరాటపర్వం సినిమా వుంది. ఆ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్. కచ్చితంగా మంచి ఓపెనింగ్ పుల్ చేయగల హీరోయిన్. ఆ సినిమా తరువాత పవన్ తో చేస్తున్న మల్టీ స్టారర్ అయ్యప్పన్ రీమేక్ వుంది. ఆ సినిమాకు కూడా ఓపెనింగ్ సమస్య వుండదు.
ఇకపై రానా సినిమాలు ప్లాన్ చేస్తే కచ్చితంగా ఇలా కాంబినేషన్ సరైనది వుండేలా చూసుకోవాల్సిందే. అదే అరణ్య నేర్పిన పాఠం కావచ్చు.