గద్దర్ అవార్డులపై పట్టు వదలని రేవంత్

ఉమ్మడి ఏపీలో సినిమా పరిశ్రమకు అప్పటి ప్రభుత్వాలు ప్రదానం చేసే నంది అవార్డులు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉండేవి. సినిమాలకు, వివిధ సాంకేతిక నిపుణులకు, నటీ నటులకు, గాయనీ గాయకులకు, సంగీత దర్శకులకు, గీత రచయితలకు,…

ఉమ్మడి ఏపీలో సినిమా పరిశ్రమకు అప్పటి ప్రభుత్వాలు ప్రదానం చేసే నంది అవార్డులు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉండేవి. సినిమాలకు, వివిధ సాంకేతిక నిపుణులకు, నటీ నటులకు, గాయనీ గాయకులకు, సంగీత దర్శకులకు, గీత రచయితలకు, దర్శక నిర్మాతలకు నంది అవార్డులు రావడమంటే ఎంతో గౌరవంగా భావించేవారు. నంది అవార్డుల ఉత్సవాలంటే సినిమా పరిశ్రమకు పండగే.

అయితే రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణలోనూ సినిమాలకు అవార్డులు ఇవ్వడంలేదు. తెలంగాణ ఏర్పడగానే సీఎం అయినా కేసీఆర్ నంది అవార్డులను అంగీకరించలేదు. నంది అనేది ఆంధ్రకు సంబంధించింది కాబట్టి ఆ పేరుతో అవార్డులు ఇవ్వబోమని, తాము హంస పేరుతో హంస అవార్డులు ఇస్తామని చెప్పాడు.

మొత్తం మీద రెండు రాష్ట్రాల్లోనూ అవార్డులు లేక దశాబ్దం దాటిపోయిందనే చెప్పాలి. ఇక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లుండి ఒక కార్యక్రమంలో (ప్రజా యుద్ధ నౌక అని పిలుచుకునే గద్దర్ చనిపోయినప్పుడు) గద్దర్ పేరుతో సినిమా అవార్డులను ఇస్తామని ప్రకటించాడు. అంటే గద్దర్ అవార్డులన్నమాట. తన మాటే శాసనమని కూడా అన్నాడు.

గద్దర్ పేరుతో అవార్డులనేవి సినిమా పరిశ్రమకు నచ్చలేదు. కానీ బయటకు ఏమీ మాట్లాడలేదు. కానీ ఒకరిద్దరు గద్దర్ సినిమాకు సంబంధించిన వ్యక్తి కాదని, అతను కవిగా, గాయకుడిగా పేరు తెచ్చుకున్నాడని, కాబట్టి అతని పేరుతో అవార్డులు ఇవ్వడం సముచితం కాదని అన్నారు. కాకపొతే గద్దర్ పేరుతో అవార్డులను సినిమా పరిశ్రమతో సంబంధం లేని ప్రజా కవులకు, ప్రజా గాయకులకు ఇవ్వవచ్చని అన్నారు.

కానీ దీనిపై పెద్దగా చర్చ జరగలేదు. మొత్తం మీద సినిమా ప్రముఖులు మౌనంగా ఉన్నారు. గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తామని ప్రకటించినప్పుడు సినిమా వాళ్ళు హర్షాతిరేకాలు వ్యక్తం చేయలేదు. వాస్తవానికి నంది అనేది తెలంగాణకు, ఆంధ్రకు సంబంధించింది కాదు. ఏ రాష్ట్రంలోనైనా శివాలయాల్లో మనకు నంది కనిపిస్తుంది. లేపాక్షి నంది చాలా ప్రసిద్ధి. నందిని ఒక కళా ఖండంగా చెప్పుకోవచ్చు.

కానీ నంది అవార్డు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చింది కాబట్టి కేసీఆర్ దానికి ఆంధ్ర రంగు పూశాడు. ఆయన ప్రతిపాదించిన హంస అవార్డులోని హంస కూడా తెలంగాణకు సంబంధించింది కాదు. సరే.. ఆ సంగతి అలా ఉంచితే, కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులను గౌరవించలేదని, వారికి సముచిత స్థానం కల్పించలేదని ఒక అభిప్రాయం ఉంది. ఆ ఉద్యమకారుల్లో గద్దర్ కూడా ఒకడు. ఆయన తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడాడు. గద్దర్ ను కేసీఆర్ గౌరవించలేదు

కాబట్టి తాను గౌరవించి ఆయన పేరు ఎప్పటికీ నిలిచి ఉండేలా చేయాలనుకున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే సినిమా రంగానికి గద్దర్ అవార్డులు ఇస్తామని ప్రకటించాడు. ఇదిలా ఉంటే.. జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత, ప్రముఖ సినిమా కవి దివంగత డాక్టర్ సి. నారాయణ రెడ్డి అవార్డు ప్రదాన కార్యక్రమం జరిగింది. దీంట్లో నటుడు మురళీమోహన్ నంది అవార్డుల అవార్డుల ప్రదానం పదేళ్లుగా ఆగిపోయిందని, వాటిని కొనసాగించాలని అన్నాడు.

దీనికి రేవంత్ రెడ్డి సమాధానమిస్తూ అంతకంటే ఘనంగా డిసెంబర్ 9 న మేలి జాతి రత్నం గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తామని తాను గతంలోనే ప్రకటించానని అన్నాడు. ఈ ప్రతిపాదనపై సీనీ ప్రముఖులెవరూ తనను సంప్రదించలేదని, స్పందించలేదని చెప్పాడు.

ఇప్పటికైనా సినిమా ప్రముఖులు ముందుకు వస్తే తాను అన్నమాట ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ తొమ్మిదిన అవార్డులు ఇస్తామని చెప్పాడు. ఈ విషయంలో మరో మాట లేదని తేల్చిచెప్పాడు. ఈ విషయంలో రేవంత్ చాలా పట్టుదలగా ఉన్నాడని అర్ధమవుతోంది.

5 Replies to “గద్దర్ అవార్డులపై పట్టు వదలని రేవంత్”

  1. ఒక ఉత్తమ గేయ రచన కేటగిరీ కి గద్దర్ అవార్డు ఇవ్వొచ్చుకాని, ఫిల్మ్ అవార్డ్స్ మొత్తానికి గద్దర్ పేరు పెట్టేంత కళాకారుడేమీ కాదుగా గద్దర్.

    1. మీ కామెంట్ కొంచం గద్దర్ ని అవమానించినట్టుగా ఉంది. ( ఫిల్మ్ అవార్డ్స్ మొత్తానికి గద్దర్ పేరు పెట్టేంత కళాకారుడేమీ కాదుగా గద్దర్. ). కానీ మీ పాయింట్ కరెక్ట్.

      నాకు కూడా సినిమా అవార్డులకు గద్దర్ పేరు పెట్టడం నచ్చలేదు. గద్దర్ ని చాలా అభిమానించే వాళ్ళు కూడా ఈ పేరు ఇష్టపడక పోవచ్చు. సినిమా అవార్డులకు అయన పేరు relevant గా లేదు.

      ఒక స్పెషల్ అవార్డుకు అయన పేరు పెడితే మరింత గౌరవంగా ఉంటుంది. కవులకు, గాయకులకు అయన పేరుతో అవార్డు ఇస్తే బాగుంటుంది.

      ఇంతకుముందు నంది విగ్రహాలు ఇచ్చేవారు. ఇప్పుడు గద్దర్ విగ్రహాలు ఇస్తారా? రేవంత్ ఐడియా వెనుక ఎదో ఓట్ల రాజకీయం ఉన్నట్టుంది.

      ఏదైనా నంది అవార్డులను కంటిన్యూ చేసి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కో సంవత్సరం ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే రాష్ట్రాలు వేరైనా సినిమా ఇండస్ట్రీ ఒకటే కదా.

  2. తెలంగాణ ప్రభుత్వం సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ కదా మన తెలుగు ఇండస్ట్రీ కి, వెంటనే స్పందిస్తారు లేండి.

Comments are closed.