సూర్యకాంతం అంటే ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. కానీ మధ్య వయస్కులకు ఆమె పేరుతో బాగా పరిచయం. అసలు సూర్యకాంతం లేని సినిమా అప్పట్లో లేదంటే అతిశయోక్తి కాదు. సూర్యకాంతం అంటే గయ్యాళితనానికి మారుపేరుగా సినిమాల్లో ఆమె పాత్రలుండేవి. సినిమాల్లో నటించడానికి బదులు జీవించడం అంటే ఎలాంటిదో సూర్యకాంతం పాత్రలు చూస్తే అనుభవంలోకి వస్తుంది.
కోడళ్లను వేధించే అత్తలకు సరదాగా సూర్యకాంతం అని పేట్టేవాళ్లు. ఇంతకూ ఇప్పుడు సూర్యకాంతం గొడవెందుకంటారా? అక్కడికే వెళ్దాం. మెగా ఫ్యామిలీలో సూర్యకాంతం గురించి, ఆ ఇంటి సభ్యుడే చెప్పారు. ఆ విషయం గురించి మాట్లాడే ముందు సూర్యకాంతం గురించి రెండు మాటలు చెప్పుకోవాల్సి వచ్చింది.
‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా విడుదల కోసం హీరో సాయితేజ్ ఎదురు చూస్తున్నారు. ఈ నెల 25న క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సినిమాతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా ఆయన మీడియాతో పంచుకున్నారు.
అన్ని సినిమాలు ఓటీటీలో చూసేవి కాదని సాయితేజ్ అభిప్రాయపడ్డారు. కొన్నింటిని థియేటర్లలో చూస్తే తప్ప ఆ మజా ఏంటో తెలియదన్నారు. సినిమాలో ఓ జోక్ పేలినప్పుడు థియేటర్‌లో నలుగురితో కలిసి ఎంజాయ్ చేస్తేనే ఆనందమన్నారు. థియేటర్‌లో సినిమా చూసినపుడు కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించలేమన్నారు.
ఆ అనుభూతిని పునః సృష్టించి జోష్ నింపడం కోసమే థియేటర్‌లో సినిమా విడుదలకు కష్టపడుతున్నామన్నారు. ఇదేవో తన కోసమో, తన సినిమా కోసమో ఎంత మాత్రం కాదని ఆయన చెప్పుకొచ్చారు. చిత్ర పరిశ్రమను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
ఫైనల్‌గా సినిమా గెలవాలనేది తమ తపన అని అన్నారు. సినిమా గొప్పదని చాటేందుకే తమ ప్రయత్నమన్నారు. 25న థియేటర్లలో విడుదల కానున్న సినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నట్టు సాయితేజ్ తెలిపారు. గతంలో మాదిరిగానే ప్రేక్షకులు థియేటర్ అనుభూతిని ఆస్వాదిస్తూ, నవ్వుకుంటూ బయటికొస్తారని మాత్రం చెప్పగలనన్నారు.
మీరు ‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటూనే తోడు వెతుక్కున్నారా? అనే పశ్నకు… సిగ్గుపడుతూ, నవ్వుతూ అలాంటిదేమీ లేదని చెప్పారు. అమ్మ ఆనందం కోసమే పెళ్లి చేసుకుంటానని చెప్పారు. అమ్మలను బిజీగా ఉంచకపోతే వాళ్లు ఏవేవో చేస్తుంటారని అతను చెప్పుకొచ్చారు.
అమ్మ పదేపదే పెళ్లి చేసుకోవాలని అడుగుతుంటే, సరే అమ్మా, మీ ఇష్టం వచ్చినట్టే పెళ్లి చేసేయ్ అని చెప్పినట్టు సాయితేజ్ తెలిపారు. ప్రస్తుతానికి ఒంటరి జీవితాన్నే ఆస్వాదిస్తున్నట్టు తెలిపారు.
ఇంటి పెద్ద కొడుకుగా తన బాధ్యతలు కొన్ని ఉన్నాయన్నారు. వాటిని పూర్తి చేయాల్సి ఉందన్నారు. అంతేకాకుండా పెళ్లి చేసుకోవడం కంటే తనకు సోలోగా ఉంటేనే సంతోషంగా ఉంటుందని చెప్పుకొచ్చారాయన.
ఇక ఇటీవల పెళ్లి అయిన నిహారిక గురించి కూడా ఆయన మాట్లాడారు. నిహారిక తన తల్లి పోలిక ఉంటుందని చెబుతారన్నారు. అందువల్ల నిహారికలో తల్లిని చూసుకుంటానన్నారు. నిహారిక ఎప్పుడూ హుషారుగా ఉంటుందన్నారు. ఇంట్లో నిహారిక ఉంటే సందడికి ఏ మాత్రం తక్కువ ఉండదన్నారు. గలగల మాట్లాడుతూ ఉంటుందన్నారు.
మా ఇంటి సూర్యకాంతం ఇక మీ ఇంటి సూర్యకాంతం అంటూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నిహారిక అప్పగింతలు పూర్తి చేయడానికి ప్రత్యేక కారణం ఉందని సాయితేజ్ తెలిపారు. ‘సూర్యకాంతం’ పేరుతో నిహారిక సినిమా చేసిందన్నారు. అందుకే సూర్యకాంతం అంటూ సరదాగా ఇన్‌స్టాగ్రామ్‌లో రాసినట్టు తెలిపారు. నిహారిక, చైతన్య మంచి జోడీ అని తెలిపారు.