నువ్వు నేను ఫేం అనిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక మీదట తాను కెమెరా ముందుకు రాకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్నే తనే స్వయంగా ప్రకటించారు. నటన అనేది తీరని దాహం లాంటిదంటారు. అది కొందరికి వ్యసనం కూడా.
చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అవకాశం వచ్చే పాత్రల్లో నటిస్తూ చిత్రపరిశ్రమలో కొనసాగుతుంటారు. అలాంటిది ఒక్కసారిగా ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం అంటే… అదో పెద్ద నిర్ణయమే. నువ్వు నేను ఫేం అనిత అలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడం వల్లే వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.
శ్రీరాం, తొట్టి గ్యాంగ్, నేను పెళ్ళికి రెడీ, ఆడంతే.. ఆడో టైపు, నేనున్నాను, రగడ, జీనియస్ తదితర సినిమాల్లో అనిత నటించి మెప్పించారు. హిందీలో కూడా ఆమె నటించారు. అంతేకాదు, హిందీలో పాపులర్ సీరియళ్లలో నటించి బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించారు. అమెకు చెప్పుకోతగ్గ స్థాయిలో అభిమానులున్నారు.
బుల్లితెర, వెండితెరలపై బిజీగా గడుపుతున్న సమయంలోనే ఆమె రోహిత్రెరెడ్డి అనే వ్యక్తిని పెళ్లాడారు. ప్రేమ పండి, ఇటీవల తమ జీవితంలోకి ఓ చిన్నారి వచ్చిన విషయాన్ని దంపతులిద్దరూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆమె కెరీర్‌కు సంబంధించి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.
ఇక మీదట తాను వెండితెర, బుల్లితెరకు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్య పరిచారు. తన ఏకాగ్రత పూర్తిగా బిడ్డపైనే ఉంచాలని భావిస్తున్నట్టు ఆమె స్పష్టం చేశారు. మరి ఈ నిర్ణయం తాత్కాలికమేనా? లేక నిజంగానే మాటపై ఉంటారా? అనేది కాలమే తేల్చాల్సి ఉంది.