వివాదాస్పద, సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ ఎమోషనల్ అయ్యాడు. జీవితంలో కీలకమైన వ్యక్తిని కోల్పోయానని ఆవేదన చెందాడు. కరోనా మహమ్మారి వర్మలో మరో వ్యక్తిని బయటికి తీసింది. సహజంగానే సెంటిమెంట్‌కు తాను దూరమని వర్మ చెప్పడం చూశాం. అలాంటి వ్యక్తి వరుసకు సోదరుడైన పి.సోమశేఖర్ కరోనాకు బలి కావడంతో కలత చెందాడు.
రంగీలా, దౌడ్, సత్య, జంగల్, కంపెనీ తదితర చిత్రాల నిర్మాణ బాధ్యతలను సోమశేఖర్ చూసుకున్నాడు. అంతేకాదు, బాలీవుడ్‌లో ఎంటర్ అయ్యాడు. 'ముస్కురాకే దేఖ్ జర' అనే హిందీ సినిమా దర్శకుడిగానూ పని చేశాడు. కరోనా బారిన పడిన సోమశేఖర్ హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందడంపై ఆర్జీవీ ఎమోషనల్ అయ్యాడు. సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వర్మ వ్యక్తం చేశాడు.
“కొన్నేళ్లుగా అతడు మాతో లేడు. ఇతర వ్యాపారాల్లోకి వెళ్లడంతో చాలా కాలంగా మాకు దూరంగా ఉంటున్నాడు. నా జీవితంలో సోమశేఖర్ చాలా కీలకమైన వ్యక్తి. అతడిని చాలా మిస్ అవుతున్నాను” అని పేర్కొన్నాడు.
సోమశేఖర్ మృతిపై బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కూడా విచారం వ్యక్తం చేశాడు. ఆయన ఏమన్నారంటే…
“తల్లి కోసం ఎంతో శ్రద్ధ తీసుకున్న శేఖర్, కరోనా సోకిన తర్వాత కూడా ఆమె కోసం పరితపించాడు. ఈ క్రమంలో అతడూ కరోనా బారిన పడ్డాడు. అయినప్పటికీ తల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ ఆమెను కాపాడుకోగలిగాడు. కానీ తను మాత్రం ప్రాణాలు కోల్పోయాడు'' అని బోనీ కపూర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
మొదట సోమశేఖర్ తల్లి కరోనా బారిన పడడం, ఆమె యోగక్షేమాలు చూసుకునే క్రమంలో అతను మహమ్మారికి చిక్కాడు. చివరికి మహమ్మారి అతని ప్రాణాలు బలిగొంది.