కరోనా సెకెండ్ వేవ్‌తో అల్లాడుతున్న మనకు అమెరికన్లను చూస్తుంటే అసూయ కలగకుండా ఉండదు. కరోనా ఫస్ట్ వేవ్‌లో అమెరికా చిగురుటాకులా వణికి పోయిన సంగతి తెలిసిందే. ఒక దశలో అసలు అమెరికా ఏమవుతుందోననే ఆందోళన కూడా కలిగింది. అలాంటి అమెరికా ఫస్ట్ వేవ్ నుంచి గుణపాఠం నేర్చుకుని, అప్రమత్తమైంది.
దేశమంతా వ్యాక్సినేషన్ ప్రక్రియను పకడ్బందీగా అమలు చేసింది. దీంతో ఇప్పుడా దేశం కరోనా నుంచి దాదాపు సంపూర్ణంగా బయట పడింది. ఒక వైపు మన దేశంలో కరోనా సెకెండ్ వేవ్ విలయతాండం చేస్తుంటే, అమెరికాలో నవ్వులు వెల్లివిరియడం ఆనందాన్ని కలిగిస్తోంది.
మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండానే కలియతిరుగుతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అలాగే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ పలువురు ప్రముఖులతో చేతులు కలపడం, అలింగనాలు చేసుకుంటూ ఎంతో ఆనందంగా గడుపుతుండడం గమనార్హం.
టీకాలతోనే కరోనా నుంచి ఉపశమనం పొందుతామనే సంకేతాల్ని అమెరికాలోని సాధారణ పరిస్థితులు ఇస్తున్నాయి. గతంలో మాదిరిగా సాధారణ పరిస్థితులకు మళ్లీ చేరుకున్నామని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ ప్రకటించడం విశేషం. శ్వేత సౌధంలో గత వారం రోజుల్లో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పుకొచ్చారు. సందర్శకులు, అధికారులు ఆరు గజాల దూరం పాటించే అవసరం లేకుండా పోయిందని శ్వేత సౌధం ప్రెస్ సెక్రటరీ వెల్లడించారు.
అమెరికా పాలకుల మాదిరిగా మనవాళ్లు ఫస్ట్ వేవ్ నుంచి గుణపాఠం నేర్చుకుని అప్రమత్తమై ఉంటే, నేడు సెకెండ్ వేవ్‌ను ఎదుర్కోవాల్సిన దుర్భర పరిస్థితులు ఎదురయ్యేవి కావనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మోదీ ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత కారణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పాలకుల్లో ముందు చూపు కరువైతే, దేశం ఎలాంటి ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టవేయబడుతుందో… మన దేశం నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి కరోనా ఫస్ట్ వేవ్‌తో ఇబ్బంది పడినా, ఆ తర్వాత అమెరికా వేగంగా కోలుకుని నిలదొక్కుకుని స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆ దేశ ప్రజానీకం కరచాలనాలు, ఆలింగనాలను చూస్తుంటే జెలసీగా ఉందని నెటిజన్లు సరదా కామెంట్స్ పెడుతున్నారు.