థ‌ర్డ్ వేవ్… అతిపెద్ద స‌వాల్‌!

క‌నీసం క‌రోనా థ‌ర్డ్ వేవ్ ముప్పు నుంచైనా మ‌న‌ల్ని పాల‌కులు త‌ప్పిస్తారా? అనేది ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌క‌మైంది. మ‌రీ ముఖ్యంగా థ‌ర్డ్ వేవ్ పంజా పిల్ల‌ల‌పై ప‌డుతుంద‌నే వైద్య నిపుణుల హెచ్చ‌రిక‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఈ…

క‌నీసం క‌రోనా థ‌ర్డ్ వేవ్ ముప్పు నుంచైనా మ‌న‌ల్ని పాల‌కులు త‌ప్పిస్తారా? అనేది ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌క‌మైంది. మ‌రీ ముఖ్యంగా థ‌ర్డ్ వేవ్ పంజా పిల్ల‌ల‌పై ప‌డుతుంద‌నే వైద్య నిపుణుల హెచ్చ‌రిక‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఈ లోకం పోక‌డ‌లు, అభం శుభం తెలియ‌ని చిన్నారులపై పంజా విసురుతుందంటే… ఊహించుకోడానికే భ‌యంగా ఉంద‌ని త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చెందు తున్నారు. క‌రోనా ఫ‌స్ట్ వేవ్‌తోనే పీడ విర‌గ‌డ అయ్యింద‌నుకుంటే సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుప‌డింది. దాని మూల్యాన్ని ప్ర‌స్తుతం అనుభ‌విస్తున్నారు.

క‌రోనా సెకెండ్ వేవ్ ఎప్ప‌టికి అంత‌మ‌వుతుందో తెలియ‌ని అయోమ‌య ప‌రిస్థితి. సెకెండ్ వేవ్ మ‌హ‌మ్మారి నుంచి ఎప్పుడు బ‌య‌టప‌డ‌తామో తెలియ‌ని దుస్థితి. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో మూలిగే న‌క్క‌పై తాటికాయ ప‌డ్డ చందంగా మూడో వేవ్ ముప్పు పొంచి ఉంద‌ని శాస్త్ర‌వేత్త‌ల హెచ్చ‌రిక‌లున్నాయి. ఈ వేవ్‌లో చిన్నారులు ఎక్కువ‌గా బాధితుల‌వుతార‌నే హెచ్చ‌రిక‌లు వెన్నులో వ‌ణుకు పుట్టిస్తున్నాయి.

వైరస్‌లో మార్పులు, రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకుంటున్న మ్యుటేషన్లపై సమర్థంగా పనిచేసేలా వ్యాక్సిన్ల ఫార్ములాలో అప్‌డేట్లు తీసుకురావడం అవసరమని శాస్త్ర‌వేత్త‌లు గ‌ట్టిగా చెబుతున్నారు. క‌రోనా పాజిటివిటీ కేసులు ఎక్కువగా ఉన్న 10 రాష్ట్ర‌ల్లోని ప్రభావిత జిల్లాల్లో వైరస్‌ వ్యాప్తి, పిల్లల్లో నమోదవుతున్న కేసుల సమాచారాన్ని కేంద్రం ప్రత్యేకంగా సేకరిస్తోంది.

సెప్టెంబర్‌-అక్టోబర్‌ నాటికి మూడోవేవ్‌ విరుచుకుపడే ప్రమాదం ఉంద‌ని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆలోగా పిల్లలకు టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశంలేదని, కొవిడ్‌-19 నిబంధనలే చిన్నారుల‌కు రక్షణ అని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు, పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపబోతున్న మూడోవేవ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు కేంద్రం, రాష్ర్టాలు సిద్ధంగా ఉండాలని నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌ విజ్ఞప్తి చేసింది.  

ఏప్రిల్‌, మే నెలల్లో కొవిడ్‌ ఇబ్బందులతో 1-12 ఏళ్లలోపు పిల్లలు 274 మంది హైద‌రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేరారు. మరో నలుగురు నవజాత శిశువులు సైతం దాని బారిన పడ్డారు. కరోనా నుంచి కోలుకున్నాక వారిలో ఎంఐఎస్‌ (మల్టీసిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌) లక్షణాలు నెమ్మదిగా బయట పడుతున్నాయి. 

ఇప్పటికే గాంధీలో ఇద్దరు చిన్నారులు ఆయా లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. నిలోఫర్‌లోనూ అయిదుగురు నవజాత శిశువుల్లో ఎంఐఎస్‌ లక్షణాలు కన్పించినట్లు వైద్యులు తెలిపారు. జూన్‌ తర్వాత ఇలాంటి కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉందని గాంధీ, నిలోఫర్‌ వైద్యులు అంచనా వేస్తున్నారు.  

ప్రస్తుతం కేసుల సంఖ్య పెరుగుతున్నందున తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, ఎంఐఎస్‌ పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరిం చాలని గాంధీ ఆసుపత్రి చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్‌ సుచిత్ర సూచిస్తున్నారు. పిల్లల్లో జ్వరం, జలుబు వంటి స్వల్ప లక్షణాలే ఉండి, ఇతర ఆరోగ సమస్యలేమీ లేకపోతే ఇంట్లోనే చికిత్స తీసుకోవ‌చ్చ‌ని ఆమె చెప్పారు. 

ఆయాసం, వేగంగా శ్వాస తీసుకోవాల్సి రావడం, ఆహారం సరిగ్గా తినలేకపోవడం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలుంటే మాత్రం త‌ప్ప‌కుండా స‌మీ పంలోని ఆస్ప‌త్రిలో చేర్పించాల‌ని డాక్ట‌ర్ సుచిత్ర స్ప‌ష్టం చేశారు. ఇలాంటి వారిలో కొందరికి ఆక్సిజన్‌ ఇవ్వాల్సి ఉంటుంద‌న్నారు. క‌నీసం చిన్న పిల్ల‌ల ప్రాణ‌లైనా కాపాడ‌డానికి మూడో వేవ్‌ను క‌ట్ట‌డి చేయ‌డ‌మే మ‌న పాల‌కుల ముందున్న‌ అతిపెద్ద స‌వాల్‌.