సిటీలో సినిమా ఫంక్షన్ లు వుంటాయా?

కాస్త జనం ఎక్కువ వచ్చే ఫంక్షన్ లు ఇకపై వరంగల్, ఖమ్మం, కర్నూలు ఇలా ఇతర ప్రాంతాలకు మారిపోవచ్చు.

అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో ఇకపై టాలీవుడ్ ఈవెంట్లు, ప్రీమియర్లు ఎలా వుండబోతున్నాయి? ఫంక్షన్ లు సజావుగా జరుగుతాయా? ఇదే అతి పెద్ద ప్రశ్న. బేసిక్ గా సినిమా ఈవెంట్ అంటే భారీగా జనాలు రావడం. వీలయినంత వరకు సజావుగా జరుగుతూనే వున్నాయి. అపశృతి సంఘటనలు అన్నది రేర్. సంధ్య థియేటర్ దగ్గర పుష్ప 2 సినిమా ప్రీమియర్ సందర్భంగా జరిగిన దుర్ఘటనతో సినిమా ఫంక్షన్ లు, సినిమా సెలబ్రిటీ ల ఫంక్షన్ లు ఎలా జరుగుతాయి అన్నది కీలకం.

ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ అంటే హీరోయిన్లు వెళ్తారు. లక్షల్లో రెమ్యూనిరేషన్ ఇచ్చి మరీ రిబ్బన్ కటింగ్ కు తీసుకెళ్తారు. లక్షల్లో జనం మూగుతారు. అనుకోనిది ఏమైనా జరిగితే… ఎవరైనా సదరు సెలబ్రిటీ మీద ఫిర్యాదు చేస్తే… ఈ ఊహే భయపెడుతుంది సెలబ్రిటీలను.

హైదరాబాద్ సిటీలో ప్రీ రిలీజ్ లు. వేలల్లో పాస్ లు, జనాలు. అనుకోనిది జరిగితే, మళ్లీ సెలబ్రిటీ మీదకే కేసు వస్తే…

సరే, సెలబ్రిటీల సంగతి అలా వుంచుదాం. సంధ్య థియేటర్ కేసులో పోలీసులు విఫలమయ్యారు అనే మాట వచ్చింది. ఇకపై పోలీసులను అనుమతి అడిగితే ఎందుకు ఇస్తారు. పోలీసులు అనుమతి ఇచ్చారు కాబట్టి వారిదే బాధ్యత అంటున్నారు. అందువల్ల అనుమతి ఇచ్చి ఎందుకు బాధ్యత తీసుకోవాలి పోలీసులు? తప్పు జరిగితే తాము ఎందుకు ఇబ్బంది పడాలి? అందువల్ల ఇటు పోలీసులు అనుమతి ఇవ్వడానికి జంకుతారు.

సెలబ్రిటీలు రావడానికి జంకుతారు. ఈవెంట్లు ప్లాన్ చేయడానికి భయపడతారు. అందువల్ల ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో సినిమా ఈవెంట్లు, భారీ ఈవెంట్లు జరగడం ఇకపై నిర్వహించడం జరగకపోవచ్చు. నిర్వహించినా పెద్ద హీరోలు వీటికి దూరంగానే వుంటారు. ఎందుకంటే ప్రభాస్, పవన్, ఎన్టీఆర్, బన్నీ లాంటి వాళ్లు పబ్లిక్ లోకి వస్తే జనాల తాకిడి మామూలుగా వుండదు.

ముందుగా అసలు పోలీసులే అనుమతి ఇవ్వరు. ఇచ్చినా ఇండస్ట్రీ జనాలు రావడానికి జంకుతారు. ప్రీమియర్ షో లు ఇకపై వుండకపోవచ్చు. ముందు రోజు సెకెండ్ షో నే ప్రీమియర్ షో అవుతుంది. అంతే తప్ప తెల్లవారుజాము ప్రీమియర్లు ఇక వుండవనే అనుకోవాలి.

కాస్త జనం ఎక్కువ వచ్చే ఫంక్షన్ లు ఇకపై వరంగల్, ఖమ్మం, కర్నూలు ఇలా ఇతర ప్రాంతాలకు మారిపోవచ్చు. కానీ అక్కడకు కూడా వెళ్లడానికి సెలబ్రిటీలకు భయమే. నిర్వాహకులకు భయమే. బన్నీకి బెయిల్ వచ్చింది కనుక సరిపోయింది. అదే ఏమాత్రం తేడా జరిగినా. ఈ ఆలోచనే ఇప్పుడు ఇండస్ట్రీ జనాలను భయపెడుతోంది.

5 Replies to “సిటీలో సినిమా ఫంక్షన్ లు వుంటాయా?”

Comments are closed.