టైటిల్: భళా తందనాన
రేటింగ్: 2/5
తారాగణం: శ్రీవిష్ణు, కేథరీన్, సత్య, గరుడ రాం, చైతన్య కృష్ణ, రవి వర్మ, భూపాల్ రాజు, ఆదర్శ్, పోసాని, శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు
కెమెరా: సురేష్ రగుతు
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
సంగీతం: మణిశర్మ
నిర్మాత: రజని కొర్రపాటి
దర్శకత్వం: చైతన్య దంతులూరి
విడుదల తేదీ: 6 మార్చ్ 2022
ఐదు రోజుల క్రితం ట్రైలర్ విడుదలయ్యే వరకు ఇలాంటి సినిమా ఒకటుందని తెలియని విధంగా ఏ మాత్రం ప్రచారం జరుపుకోని చిత్రమిది.
పాటలు గానీ ఇతర ఏ అంశాలు గానీ జనాన్ని చేరలేదు. విడుదలకు ముందు ఈ సినిమా చూసిన రాజమౌళి ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడి ప్రతిభని, శ్రీవిష్ణులోని నటుడిని పొగడడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
2009లో “బాణం” లాంటి మెచ్చుకోదగ్గ సినిమా తీసిన దర్శకుడు చైతన్య దంతులూరి 2016 లో “బసంతి” తర్వాత దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత తీసుకొచ్చిన చిత్రమిది.
అదలా ఉంచితే…శ్రీవిష్ణు ప్రతిభగల నటుడు. సరైన సినిమా పడకపోయినా తాను మాత్రం ఎప్పుడూ నిరాశపరచలేదు. పైగా బాక్సాఫీసు ఫలితమెలా ఉన్నా తన సినిమాలన్నీ ఏదో ఒక ప్రత్యేకత కలిగుంటాయి. మరి ఈ చిత్రం సంగతేంటో చూద్దాం.
ట్రైలర్లో చెప్పినట్టు ఇదొక క్రైం థ్రిల్లర్. 2000 కోట్ల రూపాయల చుట్టూ తిరిగే కథ. శ్రీవిష్ణు ఒక అనాధ శరణాలయంలో అకౌంటెంట్ గా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయిన హీరోయిన్ కి పరిచయమౌతాడు.
సాదా సీదాగా గతంలో చాలా సినిమాల్లో కనిపించిన తీరుగానే కనిపిస్తాడు తొలిసగమంతా. తన మార్క్ టైమింగ్, హావభావాలు ఆకట్టుకుంటాయి. ప్రధమార్థంలో సత్య-శ్రీవిష్ణు మధ్యలో రాసిన ట్రాక్ సింపుల్ గానే ఉంటూ బాగా పేలింది. “ఆమె నీకు పడదు” అంటూ సత్య చేసిన కామెడీ నవ్విస్తుంది.
కానీ ఇంటర్వెల్ కి ముందు ఒక సడెన్ ట్విస్ట్.
కామెడీతో స్మూత్ గా జరిగిపోతున్న కథకి యాక్షన్ కలుస్తుంది. క్లాస్ కామెడీ చేస్తూ చేస్తూ శ్రీవిష్ణు ఒక మాస్ యాక్షన్ హీరోగా పరివర్తనం చెందిపోతాడు. సెకండాఫులో ఏముందా అని ఉత్సుకత పెంచేలా ఇంటర్వెల్ కొడుతుంది.
కానీ ద్వితీయార్థంలో అగ్రభాగం బోరింగ్ గా సాగే కథనం. ముందు నుంచీ కొన్ని చోట్ల సడెన్ డ్రాపులు అంతలోనే మళ్లీ లేవడాలు ఉన్నాయి స్క్రీన్ ప్లేలో.
కథ అటూ ఇటుగా ఉంటూ కథనం కూడా ప్రెడిక్టిబుల్ గా నడిచింది. పాటలు మాత్రం కథాగమనానికి అడ్డొచ్చేలాగున్నాయి. టాకీ పార్టులో ఉన్న పేస్ పాటల స్వరకల్పనలో గానీ, చిత్రీకరణలో కానీ లేదు. పాటల్లేకుండా ఈ సినిమా చూసుంటే మరింత మెరుగైన అనుభూతి కలిగేదేమో.
ఎంత కొత్తదనం తీసుకొద్దామని ఉబలాట పడినా అప్పుడప్పుడూ కొన్ని చిన్న తప్పులు జరిగి ఫార్ములా మాయలో పడి రొటీన్ సన్నివేశాలు తెరకెక్కేస్తుంటాయి. అలాంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది.
శ్రీవిష్ణు గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇన్నాళ్లూ తనలో కామెడీ యాంగిలే తప్ప సీరియస్ యాక్షన్ కోణం చూడలేదు. యాక్షన్ సీన్స్ లో కూడా చాలా కన్విన్సింగ్ గా ఒదిగిపోగలడని నిరూపించాడు. తన నటనలోని ఈజ్, క్లారిటీ ఇక్కడ బాగా ఉపయోగపడ్డాయి.
చాలానాళ్ల తర్వాత కేథరీన్ కనిపించింది. పాత్రకు తగ్గట్టుగా “నిండుగా” ఉంది. అనవసరపు గ్లామర్ షోలేవీ పెట్టుకోలేదు.
శ్రీకాంత్ అయ్యంగర్ ది గెస్ట్ రోల్ లాంటి పాత్రే. పోసాని, గరుడ రాం తమ తమ పాత్రల పరిథిలో న్యాయం చేసారు.
కానీ ఏం లాభం? ట్విస్టుల పేరుతో “ఖిలాడి” తరహా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ఎక్కడా అశ్లీలత లేకుండా బోర్ కొట్టని క్రైం డ్రామాగా తెరకెక్కినా సెకండఫులో కొన్ని సీక్వెన్సులు రొటీన్ గా అనిపిస్తాయి.
మరీ ముఖ్యంగా స్క్విడ్ గేం నుంచి స్ఫూర్తి పొందినట్టుగా అనిపించిన క్లైమాక్స్ కన్విన్సింగ్ గా లేదు.
ఎలా చూసుకున్నా ఇది ఫార్ములాకి “తందనానా” అంటూ తీసిన సినిమాయే తప్ప “భళా” అనిపించే రేంజులో అయితే లేదు.
బాటం లైన్: “భళా” అనలేం