సినిమా రివ్యూ: ఆక్సిజన్‌

రివ్యూ: ఆక్సిజన్‌ రేటింగ్‌: 1.5/5 బ్యానర్‌: శ్రీ సాయిరామ్‌ క్రియేషన్స్‌ తారాగణం: గోపిచంద్‌, జగపతిబాబు, రాశి ఖన్నా, అను ఎమాన్యుయేల్‌, అలీ, శ్యామ్‌, అభిమన్యుసింగ్‌, బ్రహ్మాజీ, సయాజీ షిండే, వెన్నెల కిషోర్‌, చంద్రమోహన్‌, సుధ,…

రివ్యూ: ఆక్సిజన్‌
రేటింగ్‌: 1.5/5
బ్యానర్‌: శ్రీ సాయిరామ్‌ క్రియేషన్స్‌
తారాగణం: గోపిచంద్‌, జగపతిబాబు, రాశి ఖన్నా, అను ఎమాన్యుయేల్‌, అలీ, శ్యామ్‌, అభిమన్యుసింగ్‌, బ్రహ్మాజీ, సయాజీ షిండే, వెన్నెల కిషోర్‌, చంద్రమోహన్‌, సుధ, సితార తదితరులు
కూర్పు: ఉద్ధవ్‌
సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా
ఛాయాగ్రహణం: వెట్రి
సమర్పణ: ఎ.ఎం. రత్నం
నిర్మాత: ఎస్‌. ఐశ్వర్య
రచన, దర్శకత్వం: ఎ.ఎం. జోతికృష్ణ
విడుదల తేదీ: నవంబర్‌ 30, 2017

ప్రథమార్ధం అగమ్యగోచరంగా, ద్వితీయార్ధం ఏదోలా ముగించేద్దామన్నట్టుగా సాగే 'ఆక్సిజన్‌' ఇంటర్వెల్‌కి ముందొక సినిమాలా, ఇంటర్వెల్‌ తర్వాత మరొక సినిమాలా అనిపిస్తే మీ తప్పు కాదు. ఇంటర్వెల్‌లో, క్లయిమాక్స్‌లో ఒక ట్విస్ట్‌ వుంటే చాలు… మిగతా కథ అవలీలగా అల్లేసుకోవచ్చు, లేదా ఆ ట్విస్టుల మధ్యన ఏం చూపించినా చూసేస్తారు అనే మైండ్‌సెట్‌ నుంచే ఇలాంటి సినిమాలు పుట్టుకొస్తాయేమో తెలీదు.

ఫస్ట్‌ హాఫ్‌ మొత్తం 'ఇంటర్వెల్‌ సీన్‌ చూసాక ఇదంతా మర్చిపోయి విజిల్స్‌ వేస్తారు' అనే నమ్మకంతో తోచింది తీసుకుంటూ పోయిన భావన కలుగుతుంది. అన్నీ మంచి లక్షణాలున్న అబ్బాయి అమెరికానుంచి వస్తే, తన కుటుంబాన్ని వదిలి వెళ్లడం ఇష్టం లేని ఆ అమ్మాయి అతడిని ఎలాగైనా వదిలించేసుకోవాలని చూస్తుంది. ఇందుకోసం అలీతో కలిసి రాశి ఖన్నా చేస్తున్నదంతా కామెడీ అని మనం అనుకోవాలని దర్శకుడు అనుకున్నట్టున్నాడు. మొదట్లో ఒక పది నిమిషాలు చూపిస్తే ఫర్వాలేదు కానీ హీరో అతి మంచితనం అంత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నా కానీ ఇంకా అతడిని కాదనడానికి హీరోయిన్‌ తపన పడుతుంటే చెప్పడానికి మేటర్‌ లేకే దర్శకుడు నానుస్తున్నాడని అర్థమైపోతుంది.

అతి మంచివాడు, గుణంలో రాముడు, అసహాయ శూరుడు అని చూపించిన కథానాయకుడే సగంలోకి వచ్చేసరికి రాక్షసుడైపోతాడు. రక్తపాతం సృష్టిస్తాడు. ఇదొక రివెంజ్‌ కథ అనేది ఆ పాయింట్‌కి వచ్చాక కానీ తెలిసిరాదు. ఈ ట్విస్టు కోసమని అంత పాయింట్‌లెస్‌ ఫస్ట్‌ హాఫ్‌ ఎందుకు తీసాడో జోతికృష్ణకైనా తెలుసో, లేదో? ఇంటర్వెల్‌ దగ్గర ట్విస్టు బాగానే వుంది కానీ ఆ సీన్‌ పండడానికి కావాల్సిన బిల్డప్‌ కుదర్లేదు. దానికి తోడు యువన్‌ శంకర్‌ రాజా కూడా ఆ సీన్‌ ఇంపాక్ట్‌ని ఇంకాస్త తగ్గించేస్తూ విచిత్రమైన నేపథ్య సంగీతాన్ని అందించాడు.

ద్వితియార్ధంలో అసలు హీరో పగ పట్టడానికి కారణమేంటనేది వివరంగా చూపిస్తారు. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌తో మొదలు పెట్టి, 'సిగరెట్‌ పెట్టె' వైపు టర్న్‌ తీసుకున్న దగ్గర్నుంచి ఆరంభంలో వచ్చే యాంటీ స్మోకింగ్‌ యాడ్‌కి ఎక్స్‌టెన్షన్‌లా తయారవుతుంది. హీరో తమ్ముడి పేరు అజయ్‌ అయినా కానీ మీకతను ముఖేష్‌లా కనిపించే అవకాశం లేకపోలేదు.

కథానాయకుడికి ఎంతటి పర్సనల్‌ లాస్‌ జరిగినా కానీ అతడి పట్ల జాలి కలగడానికి తగ్గ ఎమోషనల్‌ కనక్ట్‌ ఏర్పరచడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. కనీసం అతనికి జరిగిన లాస్‌కి సంబంధించిన సీన్లని కూడా ఎఫెక్టివ్‌గా చూపించకపోవడంతో ఇక అతని పగ, ప్రతీకారాలతో ట్రావెల్‌ అవడానికి కూడా స్కోప్‌ లేకుండా చేసాడు. అసలు ఒక పాయింట్‌కి చేరిన తర్వాత ఈ చిత్రాన్ని ఏదో ఒక విధంగా ముగించేయాలనే ఆరాటం కనిపిస్తుందే తప్ప ఆకట్టుకోవాలనే ప్రయత్నం మచ్చుకైనా కానరాదు.

విలన్ల దగ్గర్నుంచి అయిదు వేల కోట్లు చేజిక్కించుకున్నాక ర్యాండమ్‌గా పబ్లిక్‌కి అయిదేసి వేల చొప్పున పంచేస్తూ పోతాడు హీరో. అయిదు వేలు అకౌంట్లో పడడం వల్ల ఎవరి లైఫ్‌లో పెను మార్పులు చోటు చేసుకుంటాయనేది దర్శకుడికే తెలియాలి. పైగా అదేదో నేషనల్‌ కెలామిటీ అయినట్టు ఆశిష్‌ విద్యార్థి తదితర పోలీస్‌ బృందం చేసే హడావిడికి నవ్వాలో, ఏడ్వాలో తెలియని పరిస్థితికి నెట్టేస్తుంది. రివెంజ్‌ డ్రామా అనేది రొటీన్‌ అంశం అయినా కానీ కనీసం మాస్‌ ప్రేక్షకులని అయినా ఆకట్టుకునే రీతిన రూపొందించే వీలుంది. కానీ జోతికృష్ణ మాత్రం ఎలా తీస్తే ఎవరికీ నచ్చదో అలా తీద్దామని పట్టుబట్టి తీసాడా అనే ఫీలింగొస్తుంది.

గోపిచంద్‌కి ఈ చిత్రంపై ఎంత నమ్మకముందో తెలియడానికి అతడిని ఇంటర్వ్యూ చేయనక్కర్లేదు. కొన్ని సీన్స్‌కి తను డబ్బింగ్‌ చెప్పకపోతే వాయిస్‌ ఆర్టిస్ట్‌తో కవర్‌ చేసారంటేనే అతనికి దీనిపై వున్న హోప్స్‌ ఏమిటనేది తెలిసిపోతుంది. దీనికంటే షాకింగ్‌ సంగతి ఏమిటంటే ఎండింగ్‌ సీన్‌ గోపిచంద్‌ చేయకపోతే ఎవరికో హుడ్‌ వేసేసి లాగించేసారు! జగపతిబాబు, రాశి ఖన్నా క్లూలెస్‌ ఎక్స్‌ప్రెషన్లు ఇచ్చినా, అను ఎమాన్యుయేల్‌ డైలాగ్‌కి సంబంధం లేని ఎక్స్‌ప్రెషన్స్‌ పెట్టినా దర్శకుడినే బ్లేమ్‌ చేయాలి. దర్శకుడు ఏం చేయమంటున్నాడనేది యాక్టర్లకి కూడా బోధ పడనపుడు వారి నుంచి ఎక్స్‌ప్రెషన్స్‌ ఎలా వస్తాయి.

సాంకేతికంగా కూడా ఒక్క అంశమైనా ఆకట్టుకునేలా లేదు. యువన్‌ శంకర్‌ రాజా రిజెక్టెడ్‌ ట్యూన్స్‌ అన్నీ వాడేసాడనిపిస్తుంది. రత్నం సినిమాల్లో నిర్మాణ విలువలు గొప్పగా వుంటాయి. కానీ ఈ చిత్రానికి సగంలోనే బడ్జెట్‌ అయిపోయిందా అన్నట్టు చాలా సందర్భాల్లో టెలివిజన్‌ డాక్యుమెంటరీలా కనిపించింది. కష్టపడి ప్రయత్నం చేసినా కూడా కొన్నిసార్లు సినిమాలు మిస్‌ఫైర్‌ అవుతాయి. చాలా కాలం తర్వాత మెగాఫోన్‌ చేపట్టిన జోతికృష్ణ కష్టపడడం కంటే కూడా ఇంకా ఫీల్డులోనే వున్నా అని చూపించుకోవడం కోసం ఈ సినిమా తీసాడేమో అనే అనుమానం కలుగుతుంది.

మరీ రొటీన్‌గా వుండడం వలన, చెప్పదలచుకున్న పాయింట్‌ని సరిగ్గా తెరకెక్కించలేక పోవడం వలన, స్క్రీన్‌ప్లేలో జరిగిన లోపాల వలన… ఇలా ఏదో ఒక కారణంతో సినిమాలు ఫ్లాప్‌ అవుతుంటాయి. ఆక్సిజన్‌ మాత్రం రైటింగ్‌ టేబుల్‌ నుంచి ఎడిటింగ్‌ టేబుల్‌ వరకు అన్ని చోట్లా శ్రమ లేమి కారణంగానే బోల్తా కొట్టింది.

ఫలానా మార్పులు చేసినట్టయితే, ఇక్కడ తప్పులు దిద్దుకున్నట్టయితే ఈ చిత్రానికి ప్రాణవాయువు అందేదని విశ్లేషించుకునే వీలు కూడా లేకుండా టోటల్‌గా స్క్రాప్‌ చేసి మళ్లీ ఇంకో ఫ్రెష్‌ సినిమా తీయాల్సిందే తప్ప ఇంకో దారి లేదన్నట్టుందిది. ఫస్ట్‌ డ్రాఫ్ట్‌ స్క్రిప్ట్‌ బాగా రానప్పుడు ఆ పేపర్లని నలిపి డస్ట్‌బిన్‌లో వేసేయాలి కానీ అది సినిమాగా తీస్తే ఎలాగుంటుందో అని ట్రయల్‌ వేసి చూడకూడదు. వేస్తే ఇదిగో ఇలాగే కోట్లు హరించేసే స్క్రాప్‌ స్క్రీనెక్కుతుంది.

బాటమ్‌ లైన్‌: ఆక్సిజన్‌ అందలేదు!
– గణేష్‌ రావూరి