Janaka Aithe Ganaka Review: మూవీ రివ్యూ: జనక అయితే గనక

రొటీన్ సన్నివేశాలు, ఊహించగలిగే క్లయిమాక్స్, చిన్న చిన్న జోకులతో గంటలో చెప్పాల్సిన సినిమాను, 2 గంటల 18 నిమిషాల పాటు కొనసాగించాడు.

చిత్రం: జనక అయితే గనక
రేటింగ్: 2.25/5
నటీనటులు: సుహాస్, సంగీర్తన విపిన్, వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్, మురళీశర్మ, గోపరాజు రమణ, ప్రభాస్ శీను తదితరులు..
కెమెరా: సాయిశ్రీరామ్
సంగీతం: విజయ్ బుల్గానిన్
నిర్మాత: హర్షిత్, హన్షిత
బ్యానర్: దిల్ రాజు ప్రొడక్షన్స్
రచన-దర్శకత్వం: సందీప్ రెడ్డి బండ్ల
విడుదల తేదీ: అక్టోబర్ 12, 2024

మంచి కాన్సెప్ట్ సినిమాలు ఎంచుకుంటూ మెల్లమెల్లగా ఎదుగుతున్న హీరో సుహాస్ కు, దిల్ రాజు లాంటి నిర్మాత తోడయ్యాడు. ఇద్దరూ కలిసి ‘జనక అయితే గనక’ అనే సినిమా చేశారు. ఈ సినిమాతో తనకు మరో బలగం దక్కుతుందని దిల్ రాజు నమ్మకం. దిల్ రాజు అండతో తన మార్కెట్ మరింత పెంచుకోవచ్చని సుహాస్ ఆశ. మరి ఆయన నమ్మకం, ఈయన ఆశ నెరవేరాయా? ‘జనక అయితే గనక’ దసరా సినిమా అనిపించుకుంటుందా? చూద్దాం..

ఈకాలం వస్తున్న సినిమాల్లో ఏది ఓటీటీ సినిమా, ఏది థియేటర్ సినిమా అనే విషయాన్ని ప్రేక్షకుడు ఇట్టే విభజిస్తున్నాడు. అలా చూసుకుంటే, ‘జనక అయితే గనక’ ఓటీటీ సినిమా అనే విషయాన్ని ఎవరైనా చెప్పేస్తారు.. ఈ 138 నిమిషాల సినిమాను థియేటర్లలో చూడడం ఇబ్బందిగా అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఫస్టాప్ లో కంప్లయింట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.

పిల్లల విషయంలో హీరో తన వెర్షన్ ను బీర్ కొడుతూ ఫ్రెండ్ కు చెబుతాడు. అదే విషయాన్ని ఇంటికొచ్చి తండ్రికి మరింత వివరంగా చెబుతాడు. ఆ తర్వాత ఇంకో సీన్ లో హీరో తన ఇంకో వెర్షన్ ను ఫ్రెండ్ కు బీర్ కొడుతూ చెబుతాడు. తర్వాత అదే విషయాన్ని తండ్రికి మరింత వివరంగా చెబుతాడు. ఇక్కడ రాస్తున్నప్పుడే, రాసింది మళ్లీ రాసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే దర్శకుడు మాత్రం ఇలా చెప్పిందే చెప్పడానికి సినిమా తొలి భాగం మొత్తం తీసుకున్నాడు.

సెకెండాఫ్ కూడా దాదాపు అదే టెంపోలో సాగుతుంది. మురళీ శర్మ సీన్ లోకి వచ్చిన తర్వాత మాత్రమే, సినిమాలో కాస్త వేగం పెరుగుతుంది, కొత్తదనం కనిపిస్తుంది. ఈ మొత్తం ప్రహసనంలో సిల్లీ జోక్స్ కనిపిస్తాయి. అందులో కొన్ని నిజంగానే నవ్విస్తాయి, కొన్ని మాత్రం విసిగిస్తాయి. అయితే ఈ పాయింట్ తీసుకొని, దీన్ని కుటుంబకథా చిత్రంగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం మాత్రం అభ్యంతరకరం.

సినిమా మొత్తం కండోమ్ చుట్టూ తిరుగుతుంది. పిల్లలు వద్దనుకునే హీరో దాన్ని రోజూ వాడుతుంటాడు. పిల్లల విషయంలో తన భార్యను కూడా ఒప్పించినట్టు అతడు చెబుతాడు. ఎలా ఒప్పించాడనే విషయాన్ని మాత్రం సినిమాలో చూపించరు. ఆ సంగతి పక్కనపెడితే, ఓ శుభదినాన కండోమ్ వికటించి భార్య గర్భవతి అవుతుంది. దీంతో హీరో, సదరు కండోమ్ కంపెనీపై కేసు వేస్తాడు. ఆ కేసు ఏమైంది.. హీరో కేసులో గెలిచాడా లేదా అనేది కథ. ప్రస్తుత కాలంలో ఖర్చులు, పిల్లల పెంపకం, హాస్పిటల్ ఖర్చు, స్కూల్ ఫీజులు లాంటి అంశాల్ని ఈ పాయింట్ కు యాడ్ చేశారు.

ప్రతి సారి కండోమ్ అనే పదం వాడితే బాగోదు కాబట్టి, పైగా కుటుంబకథా చిత్రం కలరింగ్ ఇస్తున్నారు కాబట్టి దానికి ‘ప్రాడక్ట్’ అనే ముద్దుపేరు పెట్టారు. సినిమా అంతా మనకు ఆ ప్రాడెక్ట్ పేరు వినిపిస్తుంది. ప్రాడక్ట్ వాడాను కానీ పనిచేయలేదు అనే డైలాగ్స్ వినిపిస్తాయి. ఇలాంటి సెటప్ ను నిజంగా ఫ్యామిలీ ప్రేక్షకులు ఆదరిస్తారా అనేది కొన్ని రోజులు గడిస్తే తెలిసిపోతుంది. అయితే ఈ అంశం చుట్టూ అల్లుకున్న కామెడీ మాత్రం అక్కడక్కడే పండింది. మరీ ముఖ్యంగా ప్రభాస్ శీనుకు, అతడి అసిస్టెంట్ కు మధ్య ఎఫైర్ ఉన్నట్టు చూపించడం, అయ్యో రూమ్స్ వ్యవహారం, అతడితో చెప్పించిన డైలాగ్స్ జుగుప్సాకరంగా ఉన్నాయి.

ఇక సినిమాలో మరో పెద్ద కంప్లయింట్ హీరోయిన్ తల్లి పాత్ర ఠపీమని మారిపోవడం. అప్పటివరకు హీరోపై వ్యతిరేక భావనలతో ఉన్న హీరోయిన్ తల్లి, ఒకే ఒక్క సీన్ తో హడావుడిగా మారిపోయి, తనే స్వయంగా కూతుర్ని కోర్టుకు తీసుకురావడం. హీరో వెర్షన్ ఏంటనేది చెప్పడానికి ఫస్టాఫ్ మొత్తం వాడుకున్న దర్శకుడు, హీరోయిన్ తల్లి పాత్రను కన్విన్స్ చేయడానికి మరో 2 సీన్లు అదనంగా పెట్టి, మరింత ఎఫెక్టివ్ గా రాసుకుంటే బాగుండేది.

మురళీశర్మ పాత్ర విషయంలో కూడా ఇదే లోపం కనిపిస్తుంది. చివర్లో అతిడి పాత్రను ప్రవేశపెట్టి, సినిమాలోకి సీరియస్ నెస్ తీసుకొచ్చిన దర్శకుడు, అదే పనిని ఇంకాస్త ముందు చేసుంటే, ప్రథమార్థంలో రిపీట్ సన్నివేశాల బాధ తప్పేది.

లాజిక్ లేకుండా సాగే ఇలాంటి కథనం, కామెడీ కోసం తీసిన కొన్ని సన్నివేశాల్లాంటివి ఇబ్బంది పెట్టినా.. నటనపరంగా సుహాస్ ను వంక పెట్టడానికేం లేదు. ఎప్పట్లానే అతడు తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. హీరోయిన్ సంగీర్తన విపిన్ మధ్యతరగతి భార్య పాత్రలో లుక్స్ పరంగా ఒదిగిపోయింది. లాయర్ కిషోర్ పాత్రలో వెన్నెల కిషోర్, తండ్రి పాత్రలో గోపరాజు రమణ, జడ్దిగా రాజేంద్రప్రసాద్, సీనియర్ లాయర్ గా మురళీశర్మ, తమ పాత్రల పరిథి మేరకు నటించారు. చాన్నాళ్ల తర్వాత వెన్నెల కిషోర్ కు హీరోతో సమానంగా ఫుల్ లెంగ్త్ రోల్ దొరికింది. సుహాస్-వెన్నెల కిషోర్ కలిసి కొన్ని ఎపిసోడ్స్ ను రక్తి కట్టించారు.

టెక్నికల్ గా సినిమాలో మెచ్చుకోదగ్గ అంశాల్లేవ్. ‘నా ఫేవరెట్ నా పెళ్లామే’ అనే సాంగ్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. ఎడిటింగ్ బాగాలేదు, సినిమాను ఇంకా తగ్గించొచ్చు. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ కథకు తగ్గట్టున్నాయి. మినిమం బడ్జెట్ లో కాన్సెప్ట్ సినిమాలు తీసే దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ నుంచి ఇంతకంటే ఎక్కువ ప్రొడక్షన్ వాల్యూస్ ఆశించలేం.

ఇలా లో-బడ్జెట్ లో పెద్దగా హంగులేవీ లేకుండా తీసిన ఈ సినిమా ప్రథమార్థం మొత్తం బోర్ కొట్టిస్తుంది. పాత టెంప్లేట్ తరహాలోనే నడుస్తుంది. సెకెండాఫ్ లో మెయిన్ పాయింట్ ను ఎత్తుకున్నప్పటికీ, దాన్ని త్వరత్వరగా ముగించేస్తారు. ప్రస్తుతం సొసైటీలో ఉన్న స్కూల్ ఫీజుల దందా, హాస్పిటల్ ఖర్చుల వ్యవహారాన్ని వినోదాత్మకంగా, ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. దాన్ని అతడు ఎంగేజింగ్ గా చెప్పలేకపోయాడు.

రొటీన్ సన్నివేశాలు, ఊహించగలిగే క్లయిమాక్స్, చిన్న చిన్న జోకులతో గంటలో చెప్పాల్సిన సినిమాను, 2 గంటల 18 నిమిషాల పాటు కొనసాగించాడు. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేశానని చెప్పి, ఇలాంటి కథను రాసుకోవడం, క్లయిమాక్స్ లో బామ్మతో ఎబ్బెట్టుగా ఉండే ఓ సీన్ ను పెట్టడం కుటుంబ ప్రేక్షకులకు ఏ మేరకు నచ్చుతుందో చూడాలి.

బాటమ్ లైన్: ఇక చాలు జనక

5 Replies to “Janaka Aithe Ganaka Review: మూవీ రివ్యూ: జనక అయితే గనక”

  1. రివ్యూ మొత్తం బాగాలేదని వ్రాశారు. మరి రేటింగ్ 2.25 ఎలా ఇచ్చారు?

Comments are closed.