Advertisement

Advertisement


Home > Movies - Reviews

Jigarthanda Double X Review: మూవీ రివ్యూ: జిగర్ తాండ డబుల్ ఎక్స్

Jigarthanda Double X Review: మూవీ రివ్యూ: జిగర్ తాండ డబుల్ ఎక్స్

చిత్రం: జిగర్ తాండ డబుల్ ఎక్స్
రేటింగ్: 1.75/5
నటీనటులు:
రాఘవ లారెన్స్, ఎస్.జె.సూర్య, షైన్ టాం చక్కో, నిమిష సజయన్, నవీన్ చంద్ర, సత్యన్, అరవింద్ ఆకాశ్, ఇలవరసు, చెల్లదురై తదితరులు
సంగీతం: సంతోష్ నారాయణన్
కెమెరా: తిరునవక్కరుసు
ఎడిటింగ్: షఫీక్ అలి
నిర్మాతలు: కార్తికేయన్ సంతానం, ఎస్ కదిరేశన్
దర్శకత్వం: కార్తిక్ సుబ్బరాజు
విడుదల: నవంబర్ 10, 2023

కార్తిక్ సుబ్బరాజు సినిమా అనగానే ఒక అంచనా ఉంటుంది. దానికి కారణం అతను తీసిన గత చిత్రాలు. ఆ లిస్టులో జిగర్ తాండ అనే హిట్ చిత్రానికి ఇది సీక్వెల్. దానివల్ల అంచనా ఇంకాస్త పెరగడం సహజం. మరి అంచనాని అందుకుందా? ఇంతకీ విషయమేంటో చూద్దాం. 

1973 నేపథ్యంలో సీజర్ (లారెన్స్) కర్నూల్ కి చెందిన ఒక రౌడీ. అతనికి సినిమా హీరో అవ్వాలని కోరిక. రే దాసన్ (ఎస్ జె సూర్య) కొన్ని కారణాల చేత తనని తాను సినిమా దర్శకుడిగా పరిచయం చేసుకుంటాడు సీజర్ కి. మొత్తానికి ఒక కౌబాయ్ సినిమా ప్లాన్ చేస్తారు ఇద్దరూ కలిసి. ఫిక్షన్ కాకుండా తన సహజసిద్ధమైన జీవితకథనే రియాలిటీ షో మాదిరిగా చిత్రీకరిస్తుంటాడు రే దాసన్. అసలు దాసన్ ఎత్తుగడ ఏవిటి? దాసన్ ట్రాపులో పడ్డ లారెన్స్ భవిష్యత్తు ఎలా మారుతుంది? ఇదే కథ. 

"జిగర్తాండ" ని తెలుగులో హరీష్ శంకర్ "గద్దలకొండ గణేష్" గా తీసాడు. అది సింగిల్ ట్రాకులో గందరగోళాలు లేకుండా సాగుతుంది. కానీ ఈ "డబుల్ ఎక్స్" అలా కాదు. పోలీసుల అకృత్యాలు, రాజకీయనాయకుల కుట్రల మధ్య నలిగిపోయే అడవుల్లో గిరిజనుల జీవితాలు..వాళ్లని కాపాడే యోధుడిగా మన హీరో...! ఈ నేపథ్యంలో సాగుతుంది. 

బడుగు బలహీన వర్గాల్ని ఉద్ధరించిన లాయర్ చంద్రు జీవితం "జై భీం" గా తెరకెక్కింది ఆ మధ్య. అందులో చదువుకున్న విలువ తెలిపి, అక్షరాస్యతే అణచివేతకి మందు అని చెప్పడం జరిగింది. అది అందరినీ హత్తుకుంది. కానీ ఇందులో చేసిన సూచన ఏంటంటే...అణచివేతకు, అన్యాయాలకు గురౌతున్నవారి జీవితాలపై సినిమాలు తీయమని. వినడానికి వింతగా ఉన్నా తీసిన విధానం గొప్పగా ఉంటే మెచ్చుకోవచ్చు. ఎందుకంటే "కాశ్మీర్ ఫైల్స్" "కేరళ స్టోరీ" లాంటి సినిమాలు ఆ రకంగా వచ్చినవే కదా అని అనుకోవచ్చు. 

కానీ ఇక్కడ దర్శకుడు తీసిన విధానం సహజత్వానికి చాలా దూరంగా ఉంది. అయినప్పటికీ ఏదో ఒకలా మనసుని సర్దిపుచుకుని చూడాలనుకుంటే ఇంటర్వెల్ అయ్యేవరకు సహన పరీక్షే. 

ఆ తర్వాత సెకండాఫులో చట్టాని అనే పాత్ర ఎంటరైనప్పటి నుంచి కాస్త ఆసక్తికరంగా మారుతుంది. 

కానీ అక్కడనుంచి కథనాన్ని డ్రాగ్ చేసిన తీరు చూస్తే ఇది జిగర్ తాండ కాదు కుళ్లిపోయిన "జిగురు తాండ్ర" అనిపిస్తుంది. ఎంతకీ తెగని కథ. 

క్లైమాక్స్ అయిపోయిందనుకుని లేచిన జనాన్ని మరో 10 నిమిషాలు ఎక్జిట్ డోర్ దగ్గర నిలబడేలా చేసిన చిత్రమిది. ఆ నిలబడడం కూడా దేనికంటే కనీసం చివారాఖరిలో అయినా ఒక చిన్న మెరుపు మెరిపించి వదుల్తాడేమో అని. కానీ ఆ చిన్నపాటి ఆశని కూడా వమ్ము చెసాడు దర్శకుడు. 

సినిమా అన్నాక మంచీ, చెడు రెండీ చెప్పుకోవాలి కాబట్టి...నాలుగు మంచి విషయాలు కూడా చెప్పుకుందాం. గ్రాఫిక్స్ లో చూపించిన కొన్ని ఏనుగుల సన్నివేశాలు బాగున్నాయి. నేపథ్య సంగీతం ఈ బరువైన సినిమాని భరించేలా చేసింది. కెమెరా వర్క్, లోకేషన్స్, నిర్మాణ విలువలు మెచ్చుకునేలా ఉన్నాయి. 

లారెన్స్, ఎస్.జె.సూర్యలు బాగా చేసారు. చెడ్డ పోలీస్ పాత్రలో నవీన్ చంద్ర బాగున్నాడు. ముఖ్యమంత్రి పాత్రలో కనిపించినావిడలో సహజత్వం లేదు. గిరిజనుల పాత్రల్లో కనిపించిన వాళ్లంతా పర్ఫెక్ట్ గా సరిపోయారు. 

ఇక మళ్లీ మైనస్సులకొస్తే.. ఈ చిత్రానికి ప్రధానమైన శాపం నిడివి. ప్రతి పాత్రకి బిల్డప్, డీటైలింగ్ చేసి జీడిపాకంలా సాగదీసాడు. 

అలాగే 1973లో చిన్న పోర్టబుల్ వీడియో కెమెరా ఎక్కడుందో? పైగా దాంతో సినిమా తీసేయడమేంటో? ఇలాంటి లాజిక్కులు కూడా చూస్తున్నంతసేపూ డిష్టర్బ్ చేస్తూ ఉంటాయి. 

ఎలా చూసుకున్న ఇదొక తలభారం సినిమా. 

ఈ అంతులేని కథ చివర్లో ప్రేక్షకుల వైపు చూస్తూ "ప్రభుత్వమా! ఎందుకిలా?" అని ప్రశ్నించమంటారు లారెన్స్. ఆడియన్స్ కి మాత్రం వెంటనే ఒక ఎదురు ప్రశ్న వేయాలనిపిస్తుంది. ఆ ప్రశ్నే ఈ క్రింది బాటం లైన్. 

బాటం లైన్: దర్శకుడా! ఎందుకిలా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?