cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: నాంది

సినిమా రివ్యూ: నాంది

చిత్రం: నాంది
రేటింగ్: 2.5/5
తారాగణం:అల్లరి నరేష్, నవమి గాయక్, వరలక్ష్మి శరత్ కుమార్, ప్రియదర్శి, ప్రవీణ్, దేవీప్రసాద్, వినయ్ వర్మ, శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు
మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల
ఛాయాగ్రహణం: సిద్
నిర్మాత: సతీష్ వేగేశ్న
దర్శకత్వం: విజయ్ కనకమేడల
విడుదల తేదీ: ఫిబ్రవరి 19, 2021

కరోనా నామ సంవత్సరం అయిన 2020 జనవరిలో నాంది పలికిన ఈ "నాంది" ని 2020 ఏప్రిల్ కి విడుదల చెయ్యాలనుకున్నారు. కానీ లాక్డౌన్ కారణంగా చాలాకాలంగా ఎక్కడ పలికిన నాంది అక్కడే పడి ఉంది. మొత్తానికి పూర్తి అయ్యి ఈ రోజు మన ముందుకొచ్చింది.

చాలాకాలం తర్వాత అల్లరి నరేష్ మళ్లీ తెరమీద కనపడడం, అది కూడా తన కంచుకోట అయిన కామెడీకి దూరంగా ఒక క్రైం థ్రిల్లర్లో నటించడం, ఫస్ట్ లుక్ గా నగ్నంగా ఉన్న ఒక విచారణ ఖైదీగా నరేష్ కనిపించడం..అన్నీ కొత్తగా అనిపించడంతో కొన్ని వర్గాల ప్రేక్షకులకి ఈ చిత్రం పట్ల ఆసక్తి కలిగింది. నిర్మాతగా సతీష్ వేగేశ్న పేరు కనపడడంతో కొంత చర్చ జరిగింది.చాలామంది అదే పేరుతో ఉన్న సుప్రసిద్ధ దర్శకుడే నిర్మాతగా మారారనుకున్నారు. కానీ వారిద్దరూ ఒకటి కాదని "నాంది" కి నాంది పలికిన రోజునే అల్లరి నరేష్ వివరణ కూడా ఇచ్చాడు.

ఇక ఈ చిత్రంలోని విశేషాలు చెప్పుకుందాం.

ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సూర్య (అల్లరి నరేష్). అతనికి ఒక అమ్మాయి (నవమి గాయక్) పరిచయం అవడం, అనుకోకుండా ఆమెతోనే పెళ్లి కుదరడం జరుగుతాయి. కానీ అనూహ్యంగా సూర్య పెళ్లికి ముందు ఒక హత్య కేసులో అరెస్ట్ అవుతాడు. తాను చేయని ఒక హై ప్రొఫైల్ హత్యలో బలవంతంగా ఇరికించబడతాడు. దాని వల్ల అతను జీవితంలో ఏం నష్టపోతాడు, ఎన్ని కష్టాలు పడతాడు, అక్కడి నుంచి ఎలా బయటపడతాడు అనేది మిగతా కథ.

అన్యాయంగా కేసుల్లో ఇరుక్కున్న వాళ్లు చాలామంది జైళ్లలో రిమాండ్ ఖైదీలుగా మగ్గుతుంటారు. కొన్ని జీవితాలు అక్కడే ముగిసిపోతుంటాయి కూడా. ఇది ఒక్క మన దేశానికే సంబంధించిన విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నదే. న్యాయవ్యవస్థ పని చేసేది సాక్ష్యం మీదే తప్ప మనస్సాక్షి మీద కాదనేది అందరికీ తెలిసిందే.

ఈ నేపథ్యంలో కొన్నేళ్ల క్రితం వచ్చిన హిందీ సినిమా "సరబ్జిత్" కంటే గొప్ప కథ ఉండదు. ఎందుకంటే అది ఫిక్షన్ కాదు..బయోపిక్. థియేటర్లో జనం కన్నీళ్లు కురిపించారు తప్ప బాక్సాఫీసు వద్ద కాసులు కురిపించలేదు. అదలా ఉంచితే ఈ "నాంది" ఒక కాల్పనిక కథ. చాలామందికి జరుగుతున్న కథే అనిపించినా ఇందులో సినిమాటిక్ లిబర్టీస్ కావాల్సినన్ని తీసేసుకోవడం వల్ల ఇది పక్కా సినిమ్యాటిక్ గానే అనిపిస్తుంది.

ముందుగా ఈ సినిమాకి అల్లరి నరేష్ ఎంపిక సరైనదే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ మీద జాలి కలగాలి. ఎప్పుడూ నవ్వించే సినిమాల్లో చేసిన అల్లరి నరేష్ తెర మీద ఎవరి కారణంగానో కష్టాలు పడుతుంటే జాలి వేయడం సహజం. కానీ అంతలోనే అతనిలో హీరోయిజాన్ని కూడా చూపించారు. ముఖ్యంగా జైల్లో ఫైటింగు..అలాగే మరో సన్నివేశంలో కత్తి పోట్ల తర్వాత కూడా తప్పించుకోగలగడం..అవి చూసాక జాలి పోయి 'ఓహో..ఇతను కూడా సగటు మనిషిలా కనిపించే సినిమా హీరోయే' అనిపిస్తుంది. నవమి గాయక్ చూడడానికి బాగుంది. అంతకు మించి ఆమె పాత్రకి తగినంత నిడివి కానీ, నటించడానికి పెద్ద స్కోప్ గానీ లేవు.

వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాకి మెయిన్ హీరో అని చెప్పాలి. ఎందుకంటే ఈమె పాత్రే లేకపోతే ఈ కథలో హీరో పడే వేదనకి ముగింపే లేదు. హరీష్ ఉత్తమన్ విలనీ బానే పండించాడు. హీరో తండ్రిగా దేవీ ప్రసాద్ ఉన్నంత టైములోనే తన ఉనికి చాటుకునేలా నటించాడు.

ప్రియదర్శి, ప్రవీణ్ లు హీరో ఫ్రెండ్స్ గా ఓకే. లాయర్ గా శ్రీకాంత్ అయ్యంగర్ చిన్న పాత్రే అయినా పర్వాలేదనిపించాడు. నేపథ్య సంగీతం గానీ, పాటలు గానీ ఏవరేజ్ గా ఉన్నాయి. చెప్పుకునే విధంగా లేవు. ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో నేపథ్య సంగీతం హైలైట్ అనిపించుకున్నవే కాస్త పాజిటివ్ టాక్ తెచ్చుకుంటున్నాయి. ఈ చిత్రంలో అటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్టు అనిపించలేదు.

సెక్షన్ 211 ని జనానికి పరిచయం చేయడం ఈ సినిమా ముఖ్యోద్దేశం. అన్యాయంగా జైళ్లలో మగ్గుతున్న రిమాండ్ ఖైదీలు విడులయ్యాక తమను కేసుల్లో ఇరికించిన వారిపై పెట్టే రివర్స్ కేస్ కి సంబంధించిన సెక్షన్ అన్నమాట. దీనిని సక్రమంగా వాడుకోకపోవడం మూలంగానే జైళ్లల్లో అన్యాయంగా పెట్టబడ్డ ఖైదీలున్నారనే సామాజిక అంశం ఎత్తుకోవడం బాగానే ఉంది. అందుకు దర్శక నిర్మాతలను అభినందించాలి. అయితే ఇటువంటి కథలను ఎత్తుకున్నప్పుడు ఉత్కంఠభరితంగా నడపగలగాలి..."దృశ్యం" లాగ. అదిక్కడ జరగలేదు. కనుక ఈ చిత్రం ఓ.టీ.టీల్లో పర్వాలేదనిపిస్తుంది తప్ప థియేటర్స్ లో కష్టం.

బాటం లైన్: కథన బలం తగ్గిన బలమున్న కథ

 


×