తెలుగు నాట మీడియా పార్టీల వారీగా డివైడ్ అయ్యింది. ఇది రోజురోజుకూ మరింత పెరుగుతోంది. తెలుగు మీడియాలో పారదర్శకత గురించి చెప్పుకోవాలంటే. నేతిబీర కాయలో నెయ్యి సామెత గుర్తు చేసుకోవాల్సిందే. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈటీవీ, ఏబీఎన్, సాక్షి టీవీ, టీవీ5 …తదితర పత్రికలు, చానళ్లు పార్టీల కండువాల కప్పుకుని, రంగులేసుకుని మరీ వార్తల ప్రచురణ, ప్రసారం చేస్తున్నాయనే విమర్శలు లేకపోలేదు.
ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాక ముందే ఏబీఎన్, టీవీ5 చానళ్లను బహిష్కరించి, వాటి చర్చలకు తమ పార్టీ ప్రతినిధులను పంపడం నిలిపివేసింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏకపక్షంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలలో వార్తా కథనాల ప్రచురణ, అలాగే సంబంధిత చానళ్లలో ఇష్టానుసారం ప్రసారం చేసిన కథనాల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. అందుకే ఆయా పత్రికలు, చానళ్లు ఎల్లో మీడియాగా ప్రసిద్ధి చెందాయి.
ఇక ప్రస్తుతానికి వస్తే టీడీపీ కూడా మీడియా బహిష్కరణలో వైసీపీ బాటే పట్టింది. వైసీపీ రెండు చానళ్లనే బహిష్కరిస్తే, టీడీపీ ఏకంగా మూడింటిని బాయ్‌కాట్ చేయడం గమనార్హం. తెలుగు నాట మోస్ట్ పాపులర్ చానళ్లగా పేరున్న TV9, Ntvతో పాటు వాటి తర్వాత కొత్తగా వచ్చిన Prime 9 news చానల్‌ను టీడీపీ బహిష్కరించడం గమనార్హం.
గత వారం రోజులుగా ఈ చానళ్ల చర్చలకు టీడీపీ అధికార ప్రతినిధులెవరూ వెళ్లడం లేదు. మీడియా స్వేచ్ఛ అంటూ రంకెలేసే టీడీపీ నేతలు ….తమ విషయానికి వచ్చే సరికి ఆ బాధ ఏంటో అర్థమైంది. నిజానికి జగన్ లేదా వైసీపీపై చేస్తున్న దుష్ప్రచారంతో పోలిస్తే ఐదు శాతం కూడా టీడీపీపై మీడియా తప్పుడు కథనాలు ప్రసారం లేదా ప్రచురించడం లేదు.
ఇటీవల పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏఏ పార్టీ మద్దతుదారులకు ఎన్నెన్ని సీట్లు వస్తున్నాయనే అంశాలకు సంబంధించి వాస్తవాలను ప్రసారం చేయడంతో పాటు చర్చల్లో ప్రతిపక్ష పార్టీ అయిన తమను ప్రశ్నించడంపై టీడీపీ అలిగినట్టు తెలుస్తోంది.
మీడియా మేనేజ్మెంట్లో ఆరితేరిన టీడీపీ … ప్రతిపక్షానికి పరిమితం కావడంతో ఎత్తులేవీ పారడం లేదని తెలుస్తోంది. నిజానికి టీడీపీ బహిష్కరించిన చానళ్లలో TV9, Ntv … ఆ పార్టీ వ్యతిరేకించేంత స్థాయిలో నెగెటివ్ కథనాలు ప్రసారం చేయడం లేదు. ఇంకా చెప్పాలంటే ఆయా చానళ్లలో యాంకర్లను బట్టి కూడా ఒక్కోసారి టీడీపీకి అనుకూలంగా అధికార పార్టీ వైసీపీని, ముఖ్యమంత్రి జగన్‌ను తిట్టించిన సందర్భాలు కోకొల్లలు.
ముఖ్యంగా ఒక చానల్లో రుషి పుంగవుడైన ప్రజెంటర్ డిబేట్ నిర్వహిస్తే …ముఖ్యమంత్రిపై అవాకులు చెవాకులు మాట్లాడించేంత వరకూ నిద్రపోరని ఆ చానల్ ప్రతినిధులే చెబుతున్నారు. మరెందుకు బహిష్కరించాలనేంత పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చిందో అర్థం కాదు.