నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా మహమ్మారి కట్టడికి పంపిణీ చేస్తున్న ఆయుర్వేద మందుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీరియస్‌గా దృష్టి సారించారు. ఈ మందు శాస్త్రీయతపై నిగ్గుతేల్చి మందు పంపిణీపై కీలక నిర్ణయం తీసుకునేందుకు అడుగులు వేస్తున్నట్టు సమాచారం.
ఇదే విషయమై వైద్య నిపుణులు, అధికారులతో జగన్ సమీక్షించనున్నారు. ఒక వైపు మందు చాలా బాగా పనిచేస్తోందనే విస్తృత ప్రచారం నేపథ్యంలో , దాని శాస్త్రీయత, పనిచేసే విధానం తదితర అంశాలపై జగన్ పూర్తి వివరాలు తెలుసుకునేందుకు నిర్ణయించుకున్నారు.
ఈ మందుకు సంబంధించి ఇప్పటికే జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని తేలినట్టు అధికారులు నివేదిక సమర్పించారు.
మరింత లోతుగా చర్చించి , మందు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మందు పంపిణీ ప్రక్రియను శుక్రవారం స్థానిక సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రారంభించారు.
తన నియోజకవర్గ పరిధిలో పంపిణీ చేస్తున్న ఆయుర్వేద మందు కరోనాను అరికడుతోందనే నమ్మకం, విశ్వాసాలను ప్రజలు వ్యక్తపరుస్తుండడంతో అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఏంటనేది ఆయన వాదన.
ఈ పరిణామాల నేపథ్యంలో కృష్ణపట్నం ఆయుర్వేదం మందుకు సంబంధించి ముఖ్యమంత్రి నిర్ణయమే ఫైనల్. దీంతో కరోనా బాధితుల దృష్టంతా జగన్ నిర్ణయంపైన్నే ఉంది. సీఎం సానుకూలంగా స్పందిస్తే , ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పకడ్బందీగా మందు పంపిణీకి శ్రీకారం చుట్టే అవకాశాలున్నాయి.