చాలా మంది ఒప్పుకోకున్నా.. కొన్ని అలవాట్లే మనిషికి మనఃశాంతి లేకుండా చేస్తాయి! తమ అలవాట్లే తమను ఇబ్బంది పెడుతున్నాయనే విషయాన్ని గుర్తించిన వాళ్లు ధన్యులు! ఎందుకంటే వారు ఆ అలవాట్లను మానుకుని మనఃశాంతిగా బతకగలరు. అయితే తాము చేస్తున్న పనులే తమకు మనఃశాంతిని దూరం చేస్తున్నాయనే విషయాన్ని గ్రహించలేక కొందరు మళ్లీ మనఃశాంతి లేకుండా పోతోందని వాపోతూ ఉంటారు! మనస్సుకు శాంతి ఎక్కడో లేదు.. పాటించే అలవాట్లలో, ఆలోచించే తీరులోనే ఉందనేది ఎరిగిన వారు చెప్పే మాట!
అతిగా ఫోన్, సోషల్ మీడియా!
ఫోన్లో అతిగా సోషల్ మీడియాతో టచ్ లో ఉండే వారిలో కొందరు అక్కడ చూసే చెత్తనంతా మనసు నిండా నింపుకుంటూ ఉంటారు! సోషల్ మీడియాలో పోస్టు అయ్యే దాన్నంతా ఫాలో అయ్యి.. ఎక్కడ లేని నెగిటివిటీని అంతా పరిశీలిస్తూ వాటి గురించినే ఆలోచిస్తూ తమకు తెలియకుండానే వారు ఒక ఊబిలో కూరుకుపోతూ ఉంటారు! సోషల్ మీడియాలో డిజిటల్ ట్రెండ్స్ ను అతిగా ఫాలో కావడానికి మించిన మనఃశాంతి లేని పని ఇంకోటి ఉండదు! సోషల్ మీడియాను అతిగా పట్టించుకుని.. తమకు తామే మనఃశాంతి లేకుండా చేసుకునే వాళ్లు బోలెడు మంది ఉంటారు. అయితే ఎంత వరకూ వాడాలో అంత వరకూ వాడి, అందునా నెగిటివిటీకి దూరంగా ఉండటం చాలా ముఖ్యం! సోషల్ మీడియాను వాడటం తప్పు కాదు కానీ, వాడకం విషయంలో హద్దులను ఎరగడం, ప్రత్యేకించి నెగిటివిటీకి దూరంగా ఉండటం చాలా ముఖ్యం! నెగిటివ్ కామెంట్లు, వాటికి కౌంటర్లు.. హద్దుల్లేని ట్రోలింగ్ ఇదే ఉంటుంది సోషల్ మీడియాలో!
వాట్సాప్ గ్రూపులు!
వీలైనంత తక్కువ వాట్సాప్ గ్రూపుల్లో సభ్యులుగా ఉండటం కూడా ఈ రోజుల్లో మనఃశాంతికి చాలా ముఖ్యం! స్కూళ్లూ, కాలేజీలు, ఫ్రెండ్స్ , ఫ్యామిలీ పేర్లతో ఏర్పడే గ్రూపుల్లో కూడా రకరకాల తగాదాలు కొనసాగుతూ ఉంటాయి. రాజకీయం, సినిమాల గురించి విపరీతమైన వాదోపవాదాలు, కామెంట్లు, ఒకరినొకరు తిట్టుకోవడాల వరకూ వెళ్లిపోతూ ఉంటారు. ఒక్కసారి వాదనలు మొదలయ్యాయంటే అవి ఎడతెగవు! వాటిల్లో అవతలి వారి నోరు మూయించడానికి అనుకుని ఇవతల వారు తెగ కష్టపడుతూ ఉంటారు. వాటి వల్ల ప్రయోజనం అయితే శూన్యం! అలాంటి ప్రయోజనం లేని పని వాట్సాప్ గ్రూపుల్లో చర్చలు సాగించడం. వీటి వల్ల డిస్ట్రబెన్సే కానీ, ఉపయోగం శూన్యం అని తెలిసినా.. దాని చుట్టూరానే తిరగుతూ అక్కడ పోస్టులు పెట్టుకుంటూ కూర్చోవడానికి మించిన వ్యర్థమైన పని ఇంకోటి ఉండదు. ఇలాంటి వాటికి దూరంగా ఉంటే మరీ మంచిది!
మనుషులను ప్రసన్నం చేసుకోవడం!
ఆఫీసులోనో, లేదా బయటో.. వ్యక్తులను ప్రసన్నం చేసుకోవడానికి పాట్లు పడటం మరో మనఃశాంతి లేని పని. అవసరం మేరకే అయినా, లేదా అతిగా మంచి వాళ్లు అనిపించుకోవడానికి అయినా.. మనుషులను ప్రసన్నం చేసుకోవడమే కొందరు పనిగా పెట్టుకుంటూ ఉంటారు. ఇది మొదలుపెడితే ఇక వ్యక్తిగత జీవితం అనేది శూన్యం అయినట్టే. ఆఫీసులో మేనేజర్ నో, మరెక్కడో మరెవరినో ప్రసన్నం చేసుకోవడమే పనిగా పెట్టుకుంటే.. అది కూడా ఎడతెగే అంశం కాదు. అవసరం మేరకు ఇలాంటి పనులు చేస్తూ ఉన్నా.. హద్దులైతే పెట్టుకోవాలి. అవతలి వాళ్లను ప్రసన్నం చేసుకుని పని జరుపుకోవాలంటే.. ఇక అదే పని అవుతుంది. మరో పనికి అవకాశం కూడా ఉండదు. ఎప్పటికప్పుడు కొత్త ఐడియాలతో వెళ్లాల్సి ఉంటుంది ప్రసన్నం చేసుకునే పనికి!
దేన్నైనా అతిగా చేయడం!
కొందరికి షాపింగ్, మరికొందిరకి ఈటింగ్ పిచ్చి వంటి ఉంటాయి. అలాగే అర్థం లేని టీవీ షోలను వీక్షించడానికి కూడా కొందరు రోజులకు రోజులైనా వెచ్చిస్తూ ఉంటారు. బిగ్ బాస్ షోలు, ఇతర చెత్త రియాలిటీ షోలు, ఇంకా టీవీ సీరియళ్లు.. ఇలాంటి వాటికి అతిగా అడిక్ట్ కావడం కూడా క్రమంగా మానసిక శాంతికి దూరం అవుతూ ఉండటమే అని వేరే చెప్పనక్కర్లేదు!
ప్రొడక్టివ్ హ్యాబిట్స్ ను కలిగి ఉండటం, ఎంటర్ టైన్ మెంట్ అంటే వీడియోలు చూడటం కాదు, మంచి పుస్తకాలను చదవడం కూడా అనే విషయాలను గుర్తెరగడం, హెల్దీ ఫ్రెండ్షిప్ లను కలిగి ఉండటం.. ఇలాంటి అలవాట్లకు విరుగుడులు!
v well said