ఒకవైపు దక్షిణాది రాష్ట్రాలే భారతీయ జనతా పార్టీకి కొరకరాని కొయ్యలుగా తయారయ్యాయి. ఉత్తరాదిన తమ మార్కు పాలిటిక్స్ తో బీజేపీ జాతీయ రాజకీయాలను దున్నేస్తోంది. యూపీ, బిహార్ వంటి రాష్ట్రాలతో పాటు.. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆఖరికి వెస్ట్ బెంగాల్ లో కూడా లోక్ సభ ఎన్నికల్లో క్రితం పర్యాయం బీజేపీ స్వీప్ చేసినంత పని చేసింది. ఈ సారి కూడా కమలం పార్టీ అదే కాన్ఫిడెన్స్ తో ఉంది. మరోసారి ఈ రాష్ట్రాల్లోనే భారీ స్థాయిలో సీట్లను సంపాదించి.. 400 లోక్ సభ సీట్లే లక్ష్యమంటూ కమలం పార్టీ హైకమాండ్ ప్రకటిస్తూ ఉంది.
అయితే ఉత్తరాది సంగతేమో కానీ.. దక్షిణాదిన ఈ సారి కూడా కమలం పార్టీకి భంగపాటే అనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో కమలం పార్టీకి అనుకూలత పెద్దగా ఏమీ లేదు!
కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలోనే కమలం పార్టీ సత్తా చూపించలేకపోయింది. అధికారమే టార్గెట్ గా బరిలోకి దిగి ఆ రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి పాలయ్యింది. ఆ ప్రభావాన్ని తక్కువ చేసి ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో సత్తా చూపించాలనే లక్ష్యంతో బీజేపీ ఉంది. అయితే అదేమంత తేలిక కాదు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్నాయి. ఇక తమిళనాడులో అన్నామలై పేరుతో బీజేపీ చాలా హంగామా చేసినా.. కనీసం ఆయన అయినా ఎంపీగా నెగ్గుతారో లేదో తేలాలంటే జూన్ నాలుగో తేదీ వరకూ వేచి చూడాల్సిందే!
ఇక ఏపీలో టీడీపీ-జనసేనలతో బీజేపీ పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతోంది. ఏదో ఒకటో రెండు సీట్లు రాకపోవా.. అనే ఆశతో పెట్టుకున్న పొత్తే తప్ప దీనికి ఎలాంటి విలువ లేదు! కేరళలో కమలం పార్టీ ఖాతా తెరిచే అవకాశాలు కూడా లేనట్టేనని అనే అభిప్రాయాలే వినిపించాయి.
ఆ సంగతంతా అలా ఉంటే.. బీజేపీకి సౌత్ లో మంచి పట్టున్న రాష్ట్రంగా కర్ణాటకకు పేరు. దాన్ని అవకాశంగా తీసుకుని.. బీజేపీ హైకమాండ్ కర్ణాటక రాజకీయ వ్యవహారాలపై పూర్తిగా తమ పట్టును పెంచుకుంది. కర్ణాటకలో బీజేపీ హైకమాండ్ ఎవరు చెబితే వారే సీఎం అనే తరహా రాజకీయం నడించింది అధికారం ఉన్నంత సేపూ. అయితే అలా బీజేపీ ఢిల్లీ కేంద్రంగా కర్ణాటక రాజకీయం నడిపింది.
ఇక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయానికి అయితే.. స్టేట్ లీడర్లందరినీ బీజేపీ పక్కన పెట్టేసింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ అక్కడ ఎన్నికల ప్రచారం చేశారు! వారాలకు వారాలు సమయం కేటాయించి మోడీ అక్కడ ప్రచారం చేశారు. తనే సీఎం క్యాండిడేట్ అన్నట్టుగా మోడీ ప్రచార పర్వం సాగింది. సీఎం ఎవరనేది అవసరం లేకుండా తనను చూసి ఓటేయాలన్నట్టుగా మోడీ అప్పుడు ప్రచారం చేశారు. అయితే ఆ ప్రయోగం ఫలించలేదు. అలాంటివి ఉత్తరాదిన చెల్లుతాయేమో కానీ బీజేపీకి పట్టున్నా కర్ణాటకలో అయితే చెల్లలేదు! దీంతో అక్కడ నుంచి బీజేపీ తీరులో స్పష్టమైన మార్పు!
లోక్ సభ ఎన్నికల విషయంలో ఇప్పుడు హైకమాండ్ జోక్యం పెద్దగా కనిపించడం లేదు! మళ్లీ యడియూరప్ప చుట్టూరా రాజకీయం తిరుగుతోంది. జేడీఎస్ తో పొత్తును సెట్ చేసి ఆ తర్వాత భారాన్ని స్టేట్ లీడర్ల మీదకు వదిలేసింది. దీంతో వారు మళ్లీ పాత రాజకీయం చేస్తున్నారు. యడియూరప్ప ఈ వయసులో పార్టీకి మళ్లీ పెద్దదిక్కయ్యారు. గాలి జనార్ధన్ రెడ్డితో బీజేపీకి రాజీని చేశారు యడియూరప్ప. అవినీతి పరుడు అంటూ గతంలో గాలిని బీజేపీనే పక్కన పెట్టింది. రాజకీయంగా అవకాశాలు ఇవ్వలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గాలి వేరుకుంపటి పెట్టి ఝలక్ ఇచ్చాడు. దీంతో ఇప్పుడు లోక్ సభ ఎన్నికలకు ఆయనతో కూడా బీజేపీ రాజీ పడింది.
ఇక వారసత్వ రాజకీయాలకు పెద్ద పీట వేసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీని వీడిన వారిని మళ్లీ బీజేపీ చేర్చుకుని ప్రాధాన్యతను ఇస్తోంది. స్థూలంగా కర్ణాటక రాజకీయంలో స్పష్టమైన మార్పు అయితే కనిపిస్తోంది. హైకమాండ్ కనుసన్నల్లో రాజకీయ వ్యవహారాలు నడిచిన రోజులు పోయి.. మళ్లీ కన్నడీగ రాజకీయ నేతలే అక్కడ చక్రం తిప్పుతున్నారు!