జీవితం ఒక సుదీర్ఘ ప్రయాణం. టిక్కెట్ అడగరు. ఎక్కడ ఆపేస్తారో తెలియదు. నడిచినంత కాలం నడవాలి. శిఖరం వుందనుకుంటే లోయ కనిపిస్తుంది. లోయల్లోకి జారిపోతున్నపుడు ఎక్కన్నుంచో చేయూత దొరుకుతుంది.
చిక్కుముడుల వెంట పరిగెత్తుతున్నపుడు సరళరేఖ సాక్షాత్కరిస్తుంది. కర్రపేడు కూడా ఒకప్పుడు వృక్షమే. దానికో పచ్చటి కల వుంటుంది. కల వున్నపుడు దాన్ని నరికేసే గొడ్డలి కూడా వుంటుంది. దానికి కూడా కర్రే ఆసరా.
మనుషులంతా ఎదురు చూస్తూ వుంటారు. ఎవరి కోసమో తెలియదు. నిరీక్షణ నిరంతర ప్రక్రియ. కాలాన్ని వెనక్కి తిప్పేవాడు ఎక్కడైనా వున్నాడా? మహా కోటీశ్వరులు కూడా బాల్యాన్ని కొనలేరు. మృత్యువుతో బేరమాడలేరు.
ఆకలి ముందు అన్నీ దిగదిడుపే. కడుపు నిండకపోతే నెమలి కూడా నాట్యం చేయలేదు. పెనుభారంగా వున్న రెక్కలే తన సౌందర్యమని తెలియదు.
గురి బాణంలో లేదు, విల్లులో లేదు. చేతిలోనూ, కంటిలోనూ అసలు లేదు. పక్షి తల రాతలో వుంది. ధర్మ శాస్త్రాలు చదివినవాడు వేటగాడు కాలేడు.
చర్మం ఒలవకపోతే పెన్సిల్‌లో ఆర్టిస్ట్ వున్నాడని ఎప్పటికీ తెలియదు. నిప్పులో కాలినవాడే ఆయుధంగా మారుతాడు. దగ్ధమైతేనే రూపం మారుతుంది.
తీగ మీద నడిచేవాడికి ప్రతి అడుగూ పునర్జన్మే. గాల్లో ఎగిరే పక్షి సుడిగాలిని లెక్క చేయదు. రెక్కల్లో బలమున్నంత కాలం ఎగరాల్సిందే. వేరే దారిలేదు. ఎంతెత్తు ఎగిరినా ఆఖరి మజిలి ఈ భూమి మాత్రమే. మట్టి రేణువుల్ని తడిమి చూడు నీ పూర్వీకులు మాట్లాడతారు. జీవిక కోసం చేసిన యుద్ధాలను వర్ణిస్తారు. నాగరికత అంతా చెమట నుంచి మొలకెత్తిందే.
రాజులైనా సైనికులైనా నేలలోపల సమాధి కావాల్సిందే. మట్టి పైన జరిగేదంతా ఒక భ్రాంతి. భూమి అందర్నీ సమానంగా చూస్తుంది. తన కోసం యుద్ధాలు చేస్తున్న వాళ్లని చూసి నవ్వుకుంటుంది.
తనలో ఒక సీతాకోకచిలుక వుందని గొంగళి పురుగుకి తెలుసు. కానీ తాను ఒకప్పుడు గొంగళి పురుగని సీతాకోకచిలుక మరిచిపోతుంది. గతాన్ని మరిచిపోవడం పురుగుల సహజ లక్షణం.
సినిమాల్లో మాత్రమే క్లైమాక్స్ ఆఖరులో వస్తుంది. జీవితం అడుగడుగునా క్లైమాక్స్‌లే. శుభం కార్డ్ వుండదు. రాసుకోడానికి నువ్వు ప్రయత్నించినా అది ఇంటర్వెల్ మాత్రమే.
ఎవడు ఏ ముఖంతో వస్తాడో తెలీని కాలం. కోవిడ్ ఆగినా మాస్క్‌లు మాయం కాలేదు. బహురూప సంచారమే నవీన ఆచారం. డాక్టర్ జెకిల్, మిస్టర్ హైడ్, అపరిచితుడు, చంద్రముఖి అందరూ కలిసిపోయి ఒక్కరుగా జీవిస్తున్నారు.
డిక్షనరీలు మారిపోతున్నాయి. ఎవడి నిఘంటువు వాడే తయారు చేస్తున్నాడు. వ్యతిరేకర్థాలకే పెద్దపీట. పని రాకపోతే నువ్వే పనిమంతుడు. బుద్ధి లేకపోతే బుద్ధిమంతుడు. నిన్ను నువ్వు కరెక్ట్‌గా అమ్ముకోవడమే మార్కెటింగ్. గులకరాయికి సుగర్ కోటింగ్ ఇస్తే అదే చక్కెర గుళిక. పిచ్చివాళ్ల కంపార్ట్‌మెంట్‌లో వున్నావ్. జర్నీ జాగ్రత్త!
జీఆర్ మహర్షి
Deyyalu.. veedalu vallistunnayi..
ilantivi enni chadivina jagan maaradu anduke vesaru subham card
ప్రతి మంగళవారం అప్పు అని జగన్ మీద విషం చిమ్మిన ఈనాడు జ్యోతి ఇప్పుడు ఆ ఊసెత్తడం లేదు
విజనరీ బాబు
మన బాబు 40 రోజుల్లో 30 వేల కోట్ల అప్పు