ఒక సమస్య: మూడు ట్రీట్‌మెంట్లు!

ప్రజలకు సమస్యలు చాలా వుంటాయి. అన్నీ ఎన్నికల సమస్యలుగా మారలేవు. అవినీతి వుంది. కొన్ని సందర్భాలలో ఇది ఎన్నికల సమస్య అవుతుంది. కొన్ని సందర్భాలలో కాదు. రాజీవ్‌ గాంధీ ప్రధానమంత్రిగా వున్నప్పుడు ఆయన మీద…

ప్రజలకు సమస్యలు చాలా వుంటాయి. అన్నీ ఎన్నికల సమస్యలుగా మారలేవు. అవినీతి వుంది. కొన్ని సందర్భాలలో ఇది ఎన్నికల సమస్య అవుతుంది. కొన్ని సందర్భాలలో కాదు. రాజీవ్‌ గాంధీ ప్రధానమంత్రిగా వున్నప్పుడు ఆయన మీద వచ్చినది ‘బోఫోర్స్‌’ స్కాం. ఈ అంశాన్ని ఉపయోగించుకునే విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ ఎన్నికల్లో రాజీవ్‌ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ను పరాజయం పాలు చెయ్యగలిగారు.

కానీ నరేంద్రమోడీ సర్కారు మీద వచ్చిన ‘రఫేల్‌’ స్కాము వుంది. ఇది ఆ తరహా అవినీతి ఆరోపణే. కానీ, దీనిని ఎన్నికల సమస్యగా చూపించ లేకపోయారు ఆయన ప్రత్యర్థులు. కాబట్టి రెండవ సారి (2019లో) కూడా మోడీ`అమిత్‌ షాల నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఒకే అంశం ఒకసారి ఎన్నికల సమస్య కాగలుగుతుంది. ఒక్కొక్క సారి కాలేక పోతుంది. ఎందుకు?

సమస్య సమస్యగా వుండిపోతే అది ఎన్నికల సమస్యగా కాలేదు. సమస్యకు రాజకీయ పరిష్కారం ఒక్కటే మార్గం అని ప్రజలు నమ్మాలి. అప్పుడే అది ఎన్నికల సమస్యగా ఆవిర్భవిస్తుంది. అ అవినీతి పోవాలంటే ఈ ప్రభుత్వం దిగి మరో ప్రభుత్వం రావాలి` అనే భావన ప్రజల్లో కలగాలి. లేదా అవినీతి పోవాలంటే పార్లమెంటులో ‘లోక్‌పాల్‌’లాంటి బిల్లు రావాలని ప్రజలు కోరుకోవాలి. ఇది రాజకీయ పరిష్కారమే.

కానీ ప్రతీ సమస్యకు జనం రాజకీయ పరిష్కారమే కోరుకుంటారా? అసలు సమస్యకు పరిష్కారాలు ఎన్ని వుంటాయో తెలిస్తే కానీ, రాజకీయ పరిష్కారమంటే ఏమిటో అర్థం కాదు. రోగం ఒక్కటే .కానీ దానిని నయం చెయ్యటానికి ఇంగ్లీషు వైద్యం, ప్రకృతి వైద్యం, ఆయుర్వేదం, హోమియోపతి, యునాని వైద్యం.. ఇలా భిన్న వైద్య రీతులు వుంటాయి. ప్రజలు ప్రతీసారీ ఇంగ్లీషు వైద్యాన్నే కోరుకోవాలని రూలు లేదు. ఇతర వైద్యాల మీద కూడా పలు సందర్బాల్లో ఆధారపడతారు. ఇంగ్లీషు వైద్యం వల్ల తప్ప మరోలా నయం కాదు అని నమ్మినప్పుడు మాత్రమే అందరూ ఇంగ్లీషు వైద్యానికి క్యూకడతారు.

సమస్యల విషయంలో కూడా ప్రజలు ఇలాగే ప్రవర్తిస్తారు. తాగుడు సమస్య వుంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఉద్యమం వచ్చింది. అయితే జనం వెంటనే ఉద్యమబాట పట్టలేదు. పలు పరిష్కారాల కోసం అన్వేషించారు. ఈ ఉద్యమానికి స్త్రీలు కీలకం. అందరూ కూలి, నాలి చేసుకునే స్త్రీలు. వారితో పాటు తమ భర్తలు కూడా కష్టపడతారు. కానీ వారి సంపాదన అంతా, తాగుడుకే పోతుంది. కేవలం స్త్రీ తనకొచ్చే కూలితోనే పిల్లల కడుపు నింపాలి. అది ఆమెకు నరక ప్రాయంగా అనిపించింది. ఆమెకున్న ఏకైక సమస్య భర్తతాగుడు. కోరుకుంటున్నది ఏమిటి? భర్త తాగుడు మానివెయ్యటం. ఇప్పుడు ఆమె పరిష్కారాల వైపు చూస్తుంది.

మొదటి పరిష్కారం: ఎన్జీవో సంస్కరణ

చదువుకున్న కొందరు స్వఛ్చంద సేవా సంస్థ పెట్టుకుని, సారా తాగటం వల్ల ఆరోగ్యం ఎలా చెడిపోతుందో, వివరించటానికి గ్రామాల్లో క్యాంపులు పెడుతుంటారు. ఈ విషయం ఆ స్త్రీల చెవిన పడుతుంది. తమ భర్తల్ని నచ్చచెప్పి ఆ శిబిరాలకు తీసుకుని వెళ్తారు. సంస్థ వారు ప్రాజెక్టర్లు తెచ్చి, తెర మీద బొమ్మలతో పాటు చూపిస్తారు. మొత్తానికి కొందరు పురుషులు భయపడి కొన్ని రోజులు తాగకుండా వుంటారు. కానీ కొన్నాళ్ళకు మళ్ళీ మొదలు పెడతారు.

రెండవ పరిష్కారం: ట్రేడ్‌ యూనియన్‌ ఆందోళన

తర్వాత ఏ కార్మిక సంఘాల వారో వస్తారు. ఇలా విడివిడిగా బాధపడితే సమస్యకు పరిష్కారం రాదని చెబుతారు. శ్రామిక మహిళలందరూ సంఘంగా ఏర్పాడలనే ఉద్బోధ చేస్తారు. వారన్నట్టుగా స్త్రీలు సంఘటితమవుతారు. ‘గ్రామాల్లో సారా అమ్ముతున్నారు కాబట్టి మగవాళ్లు తాగుతున్నారు. ఇక్కడ సారా అమ్మకుండా చేస్తే..?’ ఇలాంటి ఆలోచన వారికి కలుగుతుంది లేదా కలిగిస్తారు. అంటే ఏంచెయ్యాలి. సారా దుకాణాలను మూసివేయించాలి.

దుకాణాల వారు తమంతట తాము మూసివేయరు. మరెలా? సారా దుకాణాల మీద మూకుమ్మడి దాడులు చెయ్యాలి. చేస్తారు కూడా. కానీ దుకాణాలు నడపటానికి ‘పర్మిట్లు’ వుంటాయి. దాడి చేస్తే వారు చట్టాన్ని ఆశ్రయిస్తారు. వారికి చట్టం రక్షణ కల్పించవచ్చు. మళ్ళీ వాళ్ళు దుకాణాలు తెరవవచ్చు. సమస్య తిరిగి మొదలు కొస్తుంది.

మూడవ పరిష్కారం: రాజకీయ పరిష్కారం

సారా అమ్మటానికి ప్రభుత్వం పర్మిషనే ఇవ్వకూడదు. ఇప్పుడున్న ప్రభుత్వం ఇస్తుంది. ‘మా పార్టీ అధికారంలోకి వస్తే, ఈ సారానేమిటి? మొత్తం రాష్ట్రంలో సారా, మద్య విక్రయాలనే నిలుపు చేసే ఉత్తర్వులిస్తాం. సారా, మద్య పాన నిషేధ చట్టం తెస్తాం?’ అంటూ ప్రతిపక్షంలో వున్న పార్టీ ముందుకొస్తుంది.

ఇప్పుడు ‘తాగుడు’ అన్నది ఎన్నికల సమస్య అవుతుంది. ఈ సమస్య తీవ్రమయినదనుకుని ఇతర పార్టీలు ‘మేం కూడా సారా, మద్యం విక్రయాలకు వ్యతిరేకం’ అంటూ తిరుగుతారు. కానీ విశ్వసనీయత, జనాకర్షణ ఆ క్షణానికి పొందగలిగిన ఒక నేత ఈ విషయాన్ని బలంగా చెప్పాడనుకోండి. ఈ సమస్యను ఆయన సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగినట్లు లెక్క.

అప్పట్లో తెలుగుదేశం అధినేత ఈ పనిని సమర్థవంతంగా చేశారు. తన పార్టీని గెలిపిస్తే, తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన ‘తొలి సంతకాన్ని’ మద్యపాన నిషేధం ఫైలు మీద పెడతానని హామీ ఇచ్చారు. ఎక్కువ మంది వోటర్లు నమ్మినట్లున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. 1994లో అన్నంత పనీ చేశారు. సంతకం పెట్టేశారు. అప్పటి నుంచే ‘తొలిసంతకం’ అనేది బాగా ప్రచారంలోకి వచ్చింది.

తాగుడు అనే సమస్య ఎప్పుడూ వుండేదే… ఆ సందర్భంలోనే అది ఎన్నికల సమస్య అయ్యింది. ఎందుకూ..? ఈ సమస్యకు ‘రాజకీయ పరిష్కారం’ ఒక్కటే ఏకైక మార్గమని జనం నమ్మగలగాలి. ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో ఒక కాంగ్రెస్‌ నేత ‘తాగుడు’ ను ఎజెండా మీదక తెచ్చారు. ‘తాగుడు’ అలవాటున్నవాళ్లకి పార్టీ టికెట్‌ ఇవ్వకూడదంటున్నారు. ఇది ఏ పరిష్కారమో మరి!

3 Replies to “ఒక సమస్య: మూడు ట్రీట్‌మెంట్లు!”

  1. before 90s public did not have enough money. so, drinking ruined people financially. These days lot of public have money either self earned or through free schemes. So, everyone is trying to enjoy. So, no one cares about this concept called prohibition. Customer is always right. Pubji gaadu learnt it the hard way. Or may be he did not. He is still singing praises about his useless liqor policy. Veedu vegetarian food thintadani andaru vegetarian tinali ani policy chesthe kummi vadalra. Idi anthe.

Comments are closed.