శిక్ష పడ్డాక రాహుల్‌ రేటింగ్స్‌ రెట్టింపయ్యాయా?

రాహుల్‌ గాంధీ కి శిక్ష పడింది. ఎక్కడా? కోర్టులో. కానీ రాహుల్‌ గాంధీ ఇమేజ్‌ పెరిగింది. ఎక్కడా? భారత రాజకీయాల్లో. Advertisement పరువు నష్టం కేసు ఇది. ఎలా ఒకరి పరువుకు ఆయన నష్టం…

రాహుల్‌ గాంధీ కి శిక్ష పడింది. ఎక్కడా? కోర్టులో. కానీ రాహుల్‌ గాంధీ ఇమేజ్‌ పెరిగింది. ఎక్కడా? భారత రాజకీయాల్లో.

పరువు నష్టం కేసు ఇది. ఎలా ఒకరి పరువుకు ఆయన నష్టం కలిగించారు? నోటి మాటతో. అది కూడా ఒక సభలో. 13 ఏప్రిల్‌ 2019న లోక్‌ సభ ఎన్నికలకు రాహుల్‌ ప్రచారం చేస్తున్నారు. కర్ణాటక లోని కోలార్‌ లో జరిగిన ఒక ర్యాలీలో మాట్లాడుతూ ‘ దొంగలందరికి ఇంటిపేరు మోడీయే వుంటుందేమిటి?’ అని వ్యంగ్య ధోరణిలో మాట్లాడారు. అందుకు సూరత్‌ పశ్చిమ( గుజరాత్‌)కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్‌ మోడీ నొచ్చుకున్నారు. ‘మోడీ’ పేరున్న వారినందరినీ కించపరిచేలా రాహుల్‌ గాంధీ మాట్లాడారని ఆయన కోర్టులో ఫిర్యాదు చేశారు. (ఐపీసీ సెక్షన్లు 499, 500 కింద క్రిమినల్‌ పరువు నష్టం దావా వేశారు.) సూరత్‌ జిల్లా కోర్టు ఈ కేసును విచారించింది. గురువారం ( 23 మార్చి 2023న) నాడు కోర్టు రాహుల్‌ గాంధీ పై నేరనిర్ధారణ చేసింది. చీఫ్‌ జ్యుడిషయల్‌ మెజిస్ట్రేటు రెండేళ్ళు కారాగార శిక్షను విధించింది. అయితే పై కోర్టులో అప్పీలు చేసుకునేందుకు వీలుగా 30 రోజుల పాటు శిక్షను నిలుపు చేసింది.

వెనువెంటనే ఏర్పడే పరిణామం. రాహుల్‌ పార్లమెంటు సభ్యత్వం పై అనర్హత వేటు. ఈ తీర్పువెలువడిన మరుసటి రోజే (24 మార్చి 2023న)  లోక్‌ సభ సెక్రటేరియట్‌ ఈ పని పూర్తి చేసింది. వాయనాడ్‌ (కేరళ) నుంచి 2019లో పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయిన విషయం తెలిసిందే. తర్వాత జరిగే పరిణామం. ఖాళీఅయిన పార్లమెంటు నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిర్వహించంటం. ఈ పనిని భారత ఎన్నికల సంఘం పూర్తి చెయ్యాల్సి వుంటుంది.

అయితే ఈ లోపుగా రాహుల్‌ గాంధీ హైకోర్టును ఆశ్రయించాల్సి వుంటుంది. అక్కడ ఆయన ఈ శిక్ష మీద స్టే తెచ్చుకోగలిగితే, అనర్హత చెల్లకుండా పోయి, ఆయన తిరిగి పార్లమెంటు సభ్యుడి హోదాను  పొందవచ్చు. కాంగ్రెస్‌ ఇప్పటికే ఈ పనిని చేపట్టింది. ఇదంతా చట్టపరమైన అంశం.

కానీ, ఈ శిక్ష రాహుల్‌ గాంధీ ప్రతిష్ట ను రాజకీయాల్లో తగ్గిస్తుందా? పెంచుతుందా? ఈ మేరకు చూస్తే, పెరిగే అవకాశమే కనిపిస్తోంది. గత పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్‌ పరాజయానికి బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవిని వదలుకున్నారు. అంతిమంగా కాంగ్రెస్‌ పార్టీలో ఎన్నికలు జరిగి మలికార్జున్‌ ఖర్గే అధ్యక్షులయ్యారు. ఈ మార్పు జరుగుతుండగానే ఆయన ‘జోడో యాత్ర’ చేపట్టారు. చిత్రమేమిటంటే, ఈ యాత్ర వల్ల కాంగ్రెస్‌ పరపతి పెద్దగా పెరగక పోయినా, రాహుల్‌ పట్ల కొంత సానుకూలత జనంలో కనిపించింది. కానీ ఇదేమీ ఎన్నికలలో కాంగ్రెస్‌ను ముందు వుంచలేదు.

అయితే రానున్న 2024 పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ తో దేశవ్యాపితంగా ఎవరు తలపడగలరు? ఈ ప్రశ్న వచ్చినప్పుడు వెంటనే వచ్చే సమాధానం: ఎక్కడికక్కడ వున్న ప్రాంతీయ పార్టీలు. వీటితో ఒక ఫ్రంట్‌ కట్టాలని పలురాష్ట్రాల్లోని ఈ పార్టీల నేతలు ఉవ్విళ్ళూరుతూ వచ్చారు. ఈ పార్టీలు కాంగ్రెస్‌ విషయంలో మూడు వైఖరులు తీసుకున్నాయి:

ఒకటి: కూటమిలో కాంగ్రెస్‌ వుండకూడదు.

రెండు: కూటమిలో భాగంగా కాంగ్రెస్‌ వుండ‌వ‌చ్చు కానీ నేతృత్వం వహించకూడదు.

మూడు: కూటమిని నడిపించేదిగా కాంగ్రెస్‌ మాత్రమే వుండాలి.

ఇంత వరకూ మొదటి రెండు వైఖరులకే ఎక్కువ మొగ్గు వుంది. కాంగ్రెస్‌ను ముందు వుంచాలన్న వాదన మాత్రం మెల్లమెల్లగా బలహీన పడిపోయింది.

కానీ రాహుల్‌ గాంధీకి శిక్ష పడటం వల్ల, ఆయన పై మాత్రమే కాకుండా,  కాంగ్రెస్‌ పై సానుభూతి పెరిగే అవకాశం కనిపిస్తుంది. కారణం ఆయనకు శిక్ష పడింది ఈ అవినీతి కేసులోనో, లేక ఏ హింస, దాడులకు సంబంధించో కాదు. వైరి రాజకీయ పక్షాన్ని టార్గెట్‌ చేస్తూ చేసిన వ్యాఖ్య వల్ల. బీజేపీ వ్యతిరేకత వున్న రాజకీయ పక్షాలు తమ అవసరం కోసమైనా, రాహుల్‌ గాంధీ పట్ల సానుభూతి చూపిస్తారు. ఇప్పటికే అది మొదలయి పోయింది.

ఇలా శిక్ష పడిన వెంటనే అలా అనర్హత వేటు వెయ్యటం ఎంత వరకు సబబు? ఈ విషయం పై  యూపీయే అధికారంలో వుండగా కేంద్రం చర్చ చేసింది. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పశు దాణ కేసు విచారణ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఈ మేరకు ఒక ఆర్డినెన్సు తేవాలని చూశారు. ఈ ఆర్డినెన్సు  ముందుకు వెళ్ళి వుంటే, ఇలా శిక్ష పడ్డ వెంటనే,  చట్ట సభల సభ్యత్వం పై అలా అనర్హత వేటు వెయ్యటం వీలువుండేది కాదు. కానీ, అందుకు అప్పట్లో రాహుల్‌ గాంధీయే వ్యతిరేకించారు. చివరికి నేడు అదే రాహుల్‌ గాంధీపై ఆఘమేఘాల మీద అనర్హత వేటు పడిరది. 

ఒక వేళ పై కోర్టు స్టే ఇస్తే సరేసరి ఇవ్వక పోతే మాటేమిటి? అత్యునత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు? అక్కడ కూడా స్టే రాక పోతే..? శిక్ష తర్వాత ఆరు నెలల పాటు ఎన్నికలలో పోటీ చెయ్యటానికి వుండదు.

రాహుల్‌ గాంధీ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ స్టే వస్తే కొంత లాభపడుతుంది. స్టే రాక పోతే మాత్రం ఎక్కువ లాభపడుతుంది.

స్టే వచ్చేసినా, ఈ మధ్యలో కాంగ్రెస్‌ పట్ల బీజేపీయేతర పక్షాల వైఖరి మారుతుంది. కాంగ్రెస్‌ను కలుపుకుని పోయే ఫ్రంటు కట్టాలన్న వాదన బలపడుతుంది. స్టే రాని పక్షంలో, రాహుల్‌ స్థానంలో నెహ్రూ`గాంథీ కుటుంబం నుంచే ఎవరో ఒకరిని ముందుంచాల్సి వస్తుంది. అప్పుడు అనివార్యంగా ఆయన సోదరి ప్రియాంక వద్రా గాంధీ కాంగ్రెస్‌లో మరింత్ర క్రియాశీలంగా మారుతుంది. అప్పుడు బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌ కు కాంగ్రెసే సారథ్యం వహించినా ఆశ్చర్యపోనవసరంలేదు.