ఆనందయ్య మందుకి మరో బ్రేక్..!

ఆనందయ్య మందుకి మరో బ్రేక్ పడింది. ప్రభుత్వ అనుమతితో సోమవారం నుంచి అధికారికంగా మందు పంపిణీ మొదలు కావాల్సి ఉంది. అయితే ఈరోజే ఆనందయ్య సోదరుడు నాగరాజు కృష్ణపట్నం గ్రామంలో మందు పంపిణీ మొదలు…

ఆనందయ్య మందుకి మరో బ్రేక్ పడింది. ప్రభుత్వ అనుమతితో సోమవారం నుంచి అధికారికంగా మందు పంపిణీ మొదలు కావాల్సి ఉంది. అయితే ఈరోజే ఆనందయ్య సోదరుడు నాగరాజు కృష్ణపట్నం గ్రామంలో మందు పంపిణీ మొదలు పెట్టారు. మందు కోసం తమ ఇంటి చుట్టూ జనాలు గుమికూడి ఉండటం చూసి ఆయన ఈ పని చేశారు. ఆనందయ్య దగ్గర నుంచి మందు తీసుకొచ్చి ప్యాకెట్లను ఇంచి చుట్టుపక్కల వేచి చూస్తున్నవారికి ఇచ్చేశారు.

దీంతో ఈ విషయం ఆనోటా ఈనోటా జిల్లాలో పాకిపోయింది. ఇంకేముంది జనం ఎగబడ్డారు. అటు పోలీసులకు మందు పంపిణీపై సమాచారం లేదు. సోమవారం నుంచి కృష్ణపట్నం పోర్టు ఏరియాలో ఆనందయ్య మందు పంపిణీ చేస్తారని మాత్రం వారికి తెలుసు. దానికి తగ్గ ఏర్పాట్లు పోర్టు యాజమాన్యం చేసుకుంటోందనీ తెలుసు.

ఇటు కృష్ణపట్నంలో హడావిడిగా ఆనందయ్య సోదరుడు నాగరాజు మందు పంపిణీ మొదలు పెట్టడంతో అందరూ ఎగబడ్డారు. కొవిడ్ నిబంధనలు పక్కనపెట్టి మళ్లీ గుంపులు గుంపులుగా చేరిపోయారు. దీంతో స్థానికులిచ్చిన సమాచారంతో పోలీసులు కృష్ణపట్నం వెళ్లారు. ఆనందయ్య ఇంటి వద్ద జరుగుతున్న మందు పంపిణీని ఆపేశారు.

అయితే ఈ వ్యవహారంతో ఆనందయ్యకు ఏమాత్రం సంబంధం లేదని తెలుస్తోంది. కేవలం తమ ఇంటి వద్ద గుమికూడి ఉన్న జనాన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక ఆయన అప్పటికే తయారు చేసి ఉన్న పొట్లాలను అందించారు. దీంతో గందరగోళం నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి ఆ పంపిణీని ఆపివేయించారు.

మరోవైపు ఆనందయ్య మందు సోమవారం నుంచి అధికారికంగా పంపిణీ కావాల్సి ఉంది. ముందుగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు, ఆ తర్వాత ఇతర ప్రాంతాల వారికి అందిస్తామని చెప్పారు.

రాజకీయ రంగు పులమొద్దు..

అటు తన ఆయుర్వేద మందుపై రాజకీయం చేయాలని చూస్తున్న టీడీపీ నేతలకు కూడా ఆనందయ్య గట్టిగానే బుద్ధి చెప్పారు. తనని రాజకీయాల్లోకి లాగొద్దని చెప్పారు. 

ఆనందయ్య వెబ్ సైట్ అంటూ తప్పుడు డాక్యుమెంట్లతో అసత్య ఆరోపణలు చేసిన మాజీ మంత్రి సోమిరెడ్డిపై చీటింగ్ కేసు నమోదు కావడం ఈ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్. మొత్తమ్మీద ఆయుర్వేద మందుతో వెలుగులోకి వచ్చిన ఆనందయ్య వ్యవహారం ప్రతి రోజూ పతాక శీర్షికలకెక్కుతోంది.