విశాఖలో నిజంగా ఒక పెద్ద ఆపరేషనే జరుగుతోంది. ఏ విషయం మీద అయితే ఏపీ మొత్తం ఊగిందో, రాజకీయ కాక రేగిందో అందరికీ తెలిసిందే. కొన్నేళ్ళుగా ఉన్న అక్రమ గంజాయి రవాణా అన్నది రాజకీయ దినుసుగా మారిపోయింది. దాంతో జరిగిన రాద్ధాంతం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
ఇక ఆంధ్రా ఒడిషా బోర్డర్ ప్రాంతంలోని విశాఖ ఏజెన్సీలో వేల ఎకరాల్లో గంజాయి సాగు అవుతూంటే పట్టుకునేది మాత్రం కేవలం కొన్ని కిలోలు మాత్రమే. ఈ నేపధ్యంలో అక్రమ గంజాయిని కాదు పట్టుకోవాల్సింది. యావత్తు గంజాయి పంటనే ద్వంసం చేయాలని వైసీపీ సర్కార్ నిర్ణయించింది. ఒక విధంగా గంజాయి సాగు మీద ఉక్కు పాదమే మోపింది.
గత నెల రోజులుగా విశాఖ ఏజెన్సీలో ఆపరేషన్ పరివర్తన పేరిట పోలీస్ రెవిన్యూ ఇతర ప్రభుత్వ విభాగాలు అన్నీ కలసి చేపడుతున్న ఆపరేషన్ మంచి ఫలితాలు ఇస్తోంది. ఒక్క నెల తేడాలో ఏకంగా ఆరు వేల ఎకరాల దాకా గంజాయి పంటను సర్వ నాశనం చేశారు. ఇక మిగిలిన దానిని కూడా ద్వంసం చేసి తుదికంటా గంజాయిని అయిపూ అజా లేకుండా చేయాలని గట్టి సంకల్పమే చేపట్టారు.
ఒక విధంగా ఏ ప్రభుత్వంలో జరగని అతి పెద్ద ఆపరేషన్ ఇది. దేశంలోనే ఇది భారీ ఆపరేషన్ గా కూడా పేర్కొంటున్నారు. గంజాయి పంటను టోటల్ గా లేకుండా చేయడమే కాకుండా గిరిజనులకు చైతన్యం చేయడం ద్వారా ఇతర వాణిజ్య పంటలను సాగు చేసుకునేలా అధికారులు విలువైన సూచనలు ఇస్తున్నారు.
గంజాయి అంటూ విపక్షాలు రాజకీయంగా ఏ విధంగా వాడుకున్నా విశాఖ ఏజెన్సీ వరకూ కూడా అది మంచే చేసిందని అంటున్నారు. ఉక్కు సంకల్పంతో ప్రభుత్వం గంజాయి అన్న ఆనవళ్ళే లేకుండా చేయడం పట్ల సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.