నవంబర్ లో బాక్సాఫీస్ కు దరిద్రం పట్టింది. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఆడలేదు. 26 సినిమాలు రిలీజ్ అయితే అందులో ఒక్కటి కూడా క్లిక్ అవ్వలేదు, దురదృష్టం ఏంటంటే కనీసం యావరేజ్ టాక్ కూడా లేకపోవడం. అయితే దీనికి రివర్స్ లో ఓటీటీలో మాత్రం 2 సినిమాలు మెరిశాయి.
నవంబర్ మొదటి వారంలో మంచి రోజులు వచ్చాయి, పెద్దన్న, ఎనిమి సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో మారుతి డైరక్షన్ లో సంతోష్ శోభన్ నటించిన మంచి రోజులు వచ్చాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పెద్దన్న సినిమాపై భారీ అంచనాలుండేవి. కానీ ఈ రెండు సినిమాలు అంచనాలు అందుకోలేకపోయాయి. కామెడీ క్లిక్ అవ్వక మారుతి సినిమా ఫ్లాప్ అవ్వగా.. నాసిరకం కంటెంట్ తో పెద్దన్న సినిమా డిజాస్టర్ కా బాప్ అనిపించుకుంది.
ఇక విశాల్ సినిమాలు ఎప్పుడొస్తున్నాయో, ఎప్పుడు పోతున్నాయో కూడా తెలియడం లేదు. ఎనిమి కూడా ఆ లిస్ట్ లో కలిసిపోయింది. ఓవైపు ఈ 3 సినిమాల ఫలితాలు ఇలా ఉంటే, మరోవైపు ఓటీటీలో రిలీజైన జై భీమ్ మాత్రం సూపర్ హిట్టయింది. లాయర్ పాత్రలో సూర్య నటించిన ఈ సినిమా అనూహ్య విజయాన్నందుకుంది. విశ్లేషకులు కొంతమంది ఈ సినిమాను క్లాసిక్ అన్నారు.
నవంబర్ రెండో వారంలో కూడా ఓ మోస్తరు అంచనాలతో 2 సినిమాలొచ్చాయి. కార్తికేయ నటించిన రాజావిక్రమార్క, ఆనంద్ దేవరకొండ నటించిన పుష్పక విమానం సినిమాలు రిలీజ్ అయ్యాయి. రాజావిక్రమార్కతో బ్లాక్ బస్టర్ కొట్టి భార్యకు గిఫ్ట్ ఇద్దామనుకున్నాడు కార్తికేయ. కానీ బ్లాక్ బస్టర్ మాట దేవుడెరుగు, కనీసం బిలో యావరేజ్ కూడా అనిపించుకోలేదు ఈ సినిమా. అటు పుష్పక విమానం కూడా సోదిలో లేకుండా పోయింది.
ట్రయిలర్ చూపించి కడుపుబ్బా నవ్వుకోమని ఊరించిన పుష్పక విమానం, థియేటర్లలోకి వెళ్లిన తర్వాత వేరే జానర్ చూపింది చిరాకు తెప్పించింది. ఈ రెండు సినిమాలతో పాటు వచ్చిన కురుప్, తెలంగాణ దేవుడు, ది ట్రిప్, కపటనాటక సూత్రధారి సినిమాలు ఇలా రిలీజై, అలా వెళ్లిపోయాయి.
నవంబర్ మూడో వారంలో బాక్సాఫీస్ వద్ద రిలీజ్ జాతర నడిచింది. కార్తికేయ, పుష్పకవిమానం సినిమాలు చాప చుట్టేయడంతో.. ఒకేసారి 10 సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా నిలబడలేకపోయింది.
రామ్ ఆసుర్, ఛలో ప్రేమిద్దాం, సావిత్రి వైఫ్ ఆఫ్ కృష్ణమూర్తి, గూడుపుఠాణి లాంటి సినిమాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇక అదే వారం ఓటీటీలో రిలీజైన అద్భుతం సినిమా కూడా ఏమంత అద్భుతం అనిపించుకోలేకపోయింది. వేల గంటల వ్యూయర్ షిప్ వచ్చినట్టు డిస్నీ హాట్ స్టార్ ప్రకటించుకున్నప్పటికీ సామాన్య ప్రేక్షకుడు పట్టించుకోలేదు.
ఇక చివరి వారం కూడా ఓ సినిమా అంచనాలతో వచ్చింది. అదే అనుభవించు రాజా. అన్నపూర్ణ స్టుడియోస్ లాంటి పెద్ద బ్యానర్ బ్యాకప్ తో వచ్చిన రాజ్ తరుణ్ సినిమా ఇది. శ్రీను గవిరెడ్డి డైరక్ట్ చేసిన ఈ సినిమా ఏ దశలోనూ అలరించలేకపోయింది. ఈ సినిమాతో పాటు వచ్చిన సంపూర్ణేష్ బాబు క్యాలీఫ్లవర్, భగత్ సింగ్ నగర్, లాల్ బాగ్, కార్పోరేటర్, 1997 లాంటి సినిమాలన్నీ ఒక్క ఆటకే తిరుగుటపా కట్టేశాయి.
ఇక ఇదే వారం దృశ్యం-2 వచ్చింది. వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవ్వలేదు. నేరుగా ఓటీటీలో వచ్చిన ఈ సీక్వెల్ రీమేక్ అందర్నీ ఆకట్టుకుంది. దృశ్యం-2, జై భీమ్ మినహా నవంబర్ నెలలో థియేటర్లలో క్లిక్ అయిన సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. అలా నవంబర్ లో థియేటర్లపై ఓటీటీ పైచేయి సాధించింది. ఇక బాక్సాఫీస్ భారమంతా డిసెంబర్ నెలపైనే.