పోలీసు బాస్ దూకుడు సంతోషమే! కానీ..

ఎన్ని నేరాలు జరిగితే, నేరస్తులను ఎన్ని గంటల్లో పట్టుకున్నామో చెప్పుకుని మురిసిపోయే అలవాటు పోలీసులు మానుకోవాలి.

రాష్ట్రంలో మహిళల పట్ల అకృత్యాలకు, అరాచకాలకు పాల్పడేవారిపై ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తీవ్ర హెచ్చరికలు చేశారు. ఏఐ సాయంతో ఎక్కడికక్కడ నిఘా పెంచుతున్నామని, రాష్ట్రంలో ఏ ఒక్క మహిళ భయపడాల్సిన అవసరం లేదని, ఏ చిన్న ఆపద ఉన్నా వెంటనే పోలీసులను సంప్రదిస్తే పూర్తి రక్షణ కల్పిస్తామని భరోసా ఇస్తున్నారు. మహిళలపై దాడులకు పాల్పడేవారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

డీజీపీ హెచ్చరికలు బాగానే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే, మహిళలకు భద్రత పట్ల కాస్త ఆశ కలిగించేలా కూడా ఉన్నాయి. అయితే, “మహిళ జోలికి వస్తే మరణదండనే” అంటూ శిక్షలను కూడా పోలీసు బాస్ తేల్చేస్తుండడం కొంచెం చిత్రంగా కనిపిస్తోంది.

మహిళలపై అకృత్యాలకు పాల్పడే వారిని అరెస్టు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వీలైనంత త్వరగా శిక్ష పడేలా చేస్తే అందరూ సంతోషిస్తారు. కానీ, డీజీపీ “ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వీలైనంత త్వరగా మరణశిక్ష పడేలా చూస్తాం” అని చెప్పడం కొంత ఆశ్చర్యంగా ఉంది. మరణశిక్షను ముందుగానే నిర్ణయించుకుని, దానికి తగ్గట్టుగానే కేసులు నమోదు చేసి నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు వద్దకు తీసుకువెళతారా? అనేది ప్రజల్లో మెదులుతున్న సందేహం.

నేరం జరిగిన తర్వాత నేరస్తులను పట్టుకోవడానికి ఏఐ వాడుతారా? ఇంకో టెక్నాలజీ వాడుతారా? అనేది తర్వాతి సంగతి. కానీ, నేరం జరగకుండా చూసేందుకు ఏమి చేస్తున్నారు? అనే విషయాలే మహిళలకు ఎక్కువ ధైర్యం ఇస్తాయి. ఈ అంశాన్ని గుర్తించాలి.

ఇవాళ కూటమి సర్కారు కావొచ్చు, నిన్న జగన్ సర్కారు కావొచ్చు—మహిళల పట్ల అకృత్యాలు జరగాలనే ఆశతో ఏ ఒక్కరూ పాలన సాగించరు. తమ పరిపాలనలో ప్రతి ఆడబిడ్డ భద్రంగా, ధైర్యంగా బతకాలని ప్రతి పాలకుడు కోరుకుంటాడు. ఈ విషయంలో ఏ ఒక్క పాలకుడిని కూడా పూర్తిగా తప్పుబట్టలేం. వారి అవగాహనకు, బుద్ధికి తోచిన రీతిలో కొన్ని కొత్త ఆలోచనలు, జాగ్రత్తలను అమలు చేస్తారు. అమలులో లోటుపాట్లు గమనిస్తే దిద్దుకుంటూ, మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తారు.

రాజకీయంగా పరస్పరం దుమ్మెత్తిపోసుకోవడానికి “మీ హయాంలో ఇన్ని, మా హయాంలో ఇన్ని” నేరాలు జరిగాయని గణాంకాలతో తర్జనభర్జనలు చేసే నాయకులు ఉండొచ్చు. కానీ అందరికీ రక్షణ కల్పించాలనే చిత్తశుద్ధి నిజంగా ఎవరికి ఉంది? అనేదే అసలు ప్రశ్న.

ఎన్ని నేరాలు జరిగితే, నేరస్తులను ఎన్ని గంటల్లో పట్టుకున్నామో చెప్పుకుని మురిసిపోయే అలవాటు పోలీసులు మానుకోవాలి. ఇవాళ్టి సాంకేతిక ప్రపంచంలో అది పెద్ద ఘనత కాదు. కానీ నేరం జరగబోతున్నదని పసిగట్టి, ముందే అరికట్టి, అలాంటి గణాంకాలను ప్రజల ముందుంచగలిగితేనే—పోలీసులపై నిజమైన నమ్మకం పెరుగుతుంది. ఆ దిశగా వ్యవస్థలు మారాలి, చర్యలు తీసుకోవాలి.

7 Replies to “పోలీసు బాస్ దూకుడు సంతోషమే! కానీ..”

  1. అందుకే ప్యాలస్ ముందు సీసీటీవీ పెట్టింది. రాష్ట్రంలో లో నేరస్తుల అందరికీ మీటింగ్ పాయింట్ అదే.

    తమ ప్యాలస్ కి వచ్చే నేరస్తుల లోగుట్టు తెలుగళ్యకుండ జగన్ రెడ్డి అనే ఒక మామూలు ఎంఎల్ఏ , తమ ప్యాలస్ ముందు సీసీటీవీ లు పని చేయకుండా చేశాడు, ఇన్నాళ్లు.

    1. తమ పాలన లో నేరస్తుల వేలిముద్రలు వున్న కంప్యూటర్ లు కూడా పనిచేయకుండా వాటికి పవర్ లైన్ కట్ చేశాడు. అదీ జగన్ రెడ్డి అనే అతని నేర స్వభావం.

Comments are closed.