ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర మంత్రి కావాలని కలలు కన్నారు. కానీ ఆమె కల ప్రస్తుతానికి నెరవేరలేదు. పురందేశ్వరికి మంత్రి పదవి దక్కకపోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కారణమా? అనే చర్చకు తెరలేచింది. బాబు చెక్ పెట్టడం వల్లే పురందేశ్వరిని బీజేపీ అగ్ర నాయకత్వం పరిగణలోకి తీసుకోలేదని అంటున్నారు.
ఏపీ నుంచి నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్‌వర్మకు మోదీ కేబినెట్‌లో బెర్త్ ఖరారైంది. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ వర్మ సుదీర్ఘ కాలంగా బీజేపీలో కొనసాగుతున్నారు. నిఖార్సైన బీజేపీ నాయకుడిగా ఆయనకు పేరు వుంది. అందుకే ఆయన్ను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఈ దఫా కేంద్ర మంత్రి కావాలనే ఉద్దేశంతో పురందేశ్వరి మొదటి నుంచి వ్యూహాత్మకంగా పావులు కదిపారు. రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి ఆమె పోటీ చేసి గెలుపొందారు. కేంద్ర మంత్రి పదవి విషయంలో తనకు అడ్డు రాకుండా సుజనాచౌదరిని ఎమ్మెల్యేగా పోటీ చేయించారు. అయితే పురందేశ్వరి ఊహించింది ఒకటైతే, మరొకటి జరుగుతోంది.
ఒకే దఫా ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎంపీలకు అవకాశం ఇవ్వడం బాగుండదని బీజేపీ అగ్ర నేతలకు బాబు చెప్పారని అంటున్నారు. దీంతో టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌కు మాత్రమే చోటు ఇచ్చి, పురందేశ్వరిని ప్రస్తుతానికి పక్కన పెట్టారనే ప్రచారం జరుగుతోంది. పురందేశ్వరి పేరును లోక్‌సభ స్పీకర్‌గా పరిశీలిస్తున్నారనే ప్రచారం కూడా లేకపోలేదు. రానున్న రోజుల్లో పురందేశ్వరికి ఎలాంటి ప్రాధాన్యం ఇస్తారో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.