పవన్ కల్యాణ్ మెల్లగా సినిమాలు తగ్గించాలని డిసైడ్ అయ్యారా? ఆల్రెడీ ప్లాన్-బి ను అమల్లోకి తీసుకొచ్చారా? అవుననే అంటున్నారు చాలామంది.
ఎప్పుడైతే పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచారో ఆ వెంటనే అకిరా తెరపైకి రావడం మొదలైంది. పవన్ గెలుపు ఖాయమైన వెంటనే అకిరా మీడియా ముందుకొచ్చాడు. చేతిని పైకెత్తి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఆ తర్వాత మెగా సంబరాల్లో కూడా అకిరానే మెయిన్ ఎట్రాక్షన్ గా నిలిచాడు.
అక్కడితో ఆగలేదు. ప్రధాని నరేంద్ర మోడీని గౌరవపూర్వకంగా కలవడానికి వెళ్లినప్పుడు కూడా అకిరాను వెంటేసుకెళ్లారు పవన్. ఇలా తను ఎమ్మెల్యేగా మారిన వెంటనే, కొడుకు అకిరాను పూర్తిస్థాయిలో పబ్లిక్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
మొదట్నుంచి సినిమాలపై విముఖత
పవన్ ఇదంతా ఎందుకు చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన పూర్తిస్థాయిలో రాజకీయాల్లో కొనసాగాలనుకుంటున్నారు. అందుకే కొడుకును నటవారసుడిగా ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది.
నిజానికి పవన్ కు ఆది నుంచి సినిమాలపై ఆసక్తి లేదు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చినట్టు ఆయన పలు సందర్భాల్లో చెప్పుకున్నారు. ఒక దశలో సినిమాలు కూడా ఆపేయాలనుకున్నట్టు వెల్లడించారు. ఇప్పుడు అకిరా నందన్ రాకతో, పవన్ పూర్తిస్థాయిలో సినిమాల నుంచి తప్పుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం పవన్ చేతిలో ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలున్నాయి.
అకిరా నందన్ ఎప్పటికైనా సిల్వర్ స్క్రీన్ పైకి వస్తాడని అతడి తల్లి రేణుదేశాయ్ ఎన్నోసార్లు ప్రకటించారు. ఆ మేరకు అకిరా పూర్తిస్థాయిలో శిక్షణ కూడా తీసుకున్నాడు. అకిరా ఇప్పటికే పియానో నేర్చుకున్నాడు. మార్షల్ ఆర్ట్స్ లో కూడా ప్రావీణ్యం ఉంది. మ్యూజిక్ కూడా చేస్తాడు. తాజాగా తనలోకి ఎడిటింగ్ స్కిల్స్ కూడా బయటపెట్టాడు.
ఇప్పుడు ఏకంగా నటనలో శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. 19 ఏళ్లకే అతడు ఫిలిం స్కూల్ లో చేరాడు. రాఘవేంద్రరావు మనవడు కార్తికేయ, అకిరా కలిసి అమెరికాలోని ఒకే ఫిలిం స్కూల్ లో ట్రయినింగ్ తీసుకుంటున్నారు.
అకిరా డెబ్యూ మూవీ ఎవరితో..?
తన కొడుకు అకిరా తెరపైకి రావడానికి ఇంకా చాలా టైమ్ ఉందంటూ రేణు దేశాయ్ ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం నడుస్తున్న పరిణామాలు చూస్తుంటే, అకిరా తొందర్లోనే తెరపైకి వచ్చేలా ఉన్నాడు. ఎన్టీఆర్, మహేష్ బాబు, తరుణ్.. ఇలా చాలామంది హీరోలు చిన్న వయసులోనే హీరోలుగా మారారు. అంతెందుకు, అల్లు అర్జున్ కూడా 21 ఏళ్లకే సినిమాల్లోకి వచ్చాడు.
సో.. మరో ఏడాది లేదా రెండేళ్లలో అకిరా తెరపైకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అతడి తొలి సినిమాను ఎవరు డైరక్ట్ చేస్తారు.. బ్యానర్ ఏంటనే చర్చ ఆల్రెడీ పవన్ ఫ్యాన్స్ లో మొదలైంది.