టీటీడీ గోశాల వివాదానికి ముగింపు పలికే మార్గంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పయనిస్తున్నారు. ఈ పని విమర్శలు వచ్చినపుడే చేసి వుండాల్సింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా తయారైంది. ఇప్పటికైనా అనవసర గొడవలకు వెళ్లకుండా, సంయమనంతో ఆలోచించడం అభినందనీయం.
గోశాలలో ఏం జరుగుతున్నదో నిజాలు నిగ్గు తేల్చేందుకు నలుగురితో కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు బీఆర్ నాయుడు తెలిపారు. ఎస్వీ గోశాలను ఆయన శనివారం సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో గోవుల గడ్డిని కూడా తినేశారని ఆరోపించారు. గోశాల మాజీ డైరెక్టర్ హరినాథరెడ్డి అక్రమాలు అన్నీఇన్నీ కావని ఆయన చెప్పుకొచ్చారు.
గోశాలలో నలుగురు సభ్యులతో కూడిన కమిటీని వేస్తామన్నారు. ఆ కమిటీ గోశాలలో ఏం జరుగుతున్నదో తేలుస్తుందన్నారు. వైసీపీ హయాంలో జరిగిన తప్పుల్ని తమపై రుద్దడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. తప్పు చేసిన వారు తప్పించుకోలేరని ఆయన హెచ్చరించారు.
అలాగే బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామికి గోశాలలో జరిగిన అన్యాయం కనిపించలేదా? అని బీఆర్ నాయుడు ప్రశ్నించారు. టీటీడీ అంటే ఒంటికాలిపై లేచే సుబ్రమణ్యస్వామి నిజానిజాలేంటో తెలుసుకోరా? అని ఆయన నిలదీశారు. వైసీపీపై ఆయన ఎందుకు పిల్ వేయలేదని టీటీడీ చైర్మన్ ప్రశ్నించడం గమనార్హం.