ఉపాధ్యాయుడి మృతి… త‌ప్పెవ‌రిది?

అన్న‌మ‌య్య జిల్లా రాయ‌చోటిలోని కొత్త‌ప‌ల్లి జెడ్పీ హైస్కూల్‌లో లెక్క‌ల మాస్టార్ మ‌హ‌మ్మ‌ద్ ఏజియాస్ అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెంద‌డం విద్యారంగంలో ఆందోళ‌న రేకెత్తిస్తోంది

అన్న‌మ‌య్య జిల్లా రాయ‌చోటిలోని కొత్త‌ప‌ల్లి జెడ్పీ హైస్కూల్‌లో లెక్క‌ల మాస్టార్ మ‌హ‌మ్మ‌ద్ ఏజియాస్ అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెంద‌డం విద్యారంగంలో ఆందోళ‌న రేకెత్తిస్తోంది. విద్యార్థులు కొట్ట‌డం వ‌ల్లే చ‌నిపోయిన‌ట్టు సోష‌ల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జ‌రుగుతోంది. అయితే గుండెపోటుతో మృతి చెందిన‌ట్టు ఆ పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయుడు ష‌బ్బీర్ అహ్మ‌ద్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అయితే త‌న భ‌ర్త‌కు ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య లేద‌ని, ఉపాధ్యాయులు, విద్యార్థుల వ‌ల్లే చ‌నిపోయిన‌ట్టు మృతుడి భార్య రేహిమాని ఆరోపించారు.

ఈ నేప‌థ్యంలో ఉపాధ్యాయుల సోష‌ల్ మీడియా గ్రూప్స్‌లో ఒక పోస్టు వైర‌ల్ అవుతోంది. రాయచోటి సంఘటన ఉపాధ్యాయ లోకానికి మేలుకొలుపు కావాలని కోరుతూ ఆలోచింప‌జేసే ఆ పోస్టు గురించి తెలుసుకుందాం.

“ఈ దారుణంలో తప్ప ఎవరిది? ఉపాధ్యాయుడి చేతిలో నుంచి బెత్తం లాక్కున్న న్యాయ వ్యవస్థదా?
ఉపాధ్యాయుడు విద్యార్థిని మందలించి ఎప్పుడెప్పుడు దొరుకుతాడా అని ఎదురుచూస్తున్న ఫోర్త్ ఎస్టేట్‌దా?
మా బిడ్డలకు చదువు అక్కర్లేదు, చదివిన కాడికి చదువుతాడు… తిట్టొద్దు, కొట్టొద్దు అని ఉపాధ్యాయులను హూంకరిస్తున్న తల్లిదండ్రులదా?
పాఠశాలలో ఉపాధ్యాయుడికి, విద్యార్థికి మధ్య ఏ చిన్న సంఘటన జరిగినా ముందూవెనుకా ఆలోచించకుండా ఉపాధ్యాయుడిపై శాఖాపరమైన చర్యలకు దిగుతున్న అధికారులదా?
ఎవరిది? తప్పు ఎవరిది?
❓❗❓❗❓
తప్పు ఎవరిదైనా సరే!
ఇంత దారుణ సంఘటన జరిగిన తర్వాత తప్పకుండా దీనిపై లోతైన విశ్లేషణ, ఆలోచన ఉపాధ్యాయులు, సంఘాలు, తల్లిదండ్రులు, సమాజం, విద్యావేత్తలు, పాలకులు చేయాలి!

కేవ‌లం ఉపాధ్యాయుడి మ‌ర‌ణంగా మాత్రమే చూడొద్దు!
మారిన నేటి యువత ఆలోచన తీరు!
దిగజారి పోతున్న విద్యార్థుల భవిష్యత్తు!
మృగ్యమైపోతున్న మానవతా విలువలు!
దురలవాట్లతో చిన్న‌వ‌య‌సులోనే నేరాల‌కు పాల్ప‌డ‌డం, బాల నేరస్తులు సమాజంలో పెరుగుతుండడం!
వీటన్నింటికీ చెక్ పెట్టాల్సిన ప్రదేశం పాఠశాలనే!
పాఠశాల కేంద్రంగా విద్యార్థి సర్వతో ముఖాభివృద్ధి జరగాలి!
కానీ ఆ దిశగా పాఠశాలలో ఉపాధ్యాయుడి స్వేచ్ఛను నేడు హరించివేశారు కాబట్టే!
రాయచోటిలో ఇలాంటి దారుణ సంఘటన జరిగింది. నిజానికి చాలా ఉన్నత పాఠశాలలో కర్తవ్య నిర్వహణ ఉపాధ్యాయులకు కత్తి మీద సాములా మారింది!

ఉపాధ్యాయులపై తిరగబడడమే కాదు… కొన్ని చోట్ల మహిళా ఉపాధ్యాయులపై అసభ్యంగా కామెంట్ చేస్తున్న విద్యార్థులను చూస్తున్నాం! సమాజ నిర్మాతలుగా ఉన్న ఉపాధ్యాయులకు పాఠశాలలో స్వేచ్ఛాయుత వాతావరణంలో పని చేయడానికి వృత్తిపరమైన, చట్టపరమైన భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే! ప్రస్తుతం ఆ దిశగా ఉపాధ్యాయ సంఘాలు, పౌర‌ సమాజం, పాలకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది ఉపాధ్యాయుల కోసమే కాదు.. విద్యార్థుల భవిత కోసమే! ఈ సమాజ రక్షణ కోసమే!

కాబట్టి ముందుగా తల్లిదండ్రులను, సమాజాన్ని, పాలకులను చైతన్య పరచాల్సింది ఉపాధ్యాయులే!

ఉపాధ్యాయ సోదర, సోదరీమణులారా వచ్చే శనివారం నాడు జరగనున్న పేరెంట్ టీచర్ మీటింగ్‌లో విద్యార్థుల క్రమశిక్షణ ఉపాధ్యాయుని పాత్ర అనే అంశంపై రాయచోటి సంఘటనను ఉదహరిస్తూ అందరినీ చైతన్య పరచాల్సిందిగా విన్నవిస్తున్నాం” అని ఉపాధ్యాయ సంఘాల నాయ‌కులు అభ్య‌ర్థించ‌డం విశేషం.

11 Replies to “ఉపాధ్యాయుడి మృతి… త‌ప్పెవ‌రిది?”

  1. అల్లరిచిల్లర గ తిరిగే విద్యార్థులను వేరే సెక్షన్ లో పెట్టి మిగతా స్టూడెంట్స్ తో కలవకుండా చెయ్యాలి లేకపోతె వాళ్ళు పాడైపోయే ప్రమాదం వుంది వీలయితే వీళ్ళను మండలానికి ఒక సెక్షన్ పెట్టి అక్కడ హాస్టల్స్ ఉంచాలి

Comments are closed.