విశాఖలో గతంలో చూడని ఒక దృశ్యం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నో సార్లు విశాఖకు వచ్చారు. కానీ ఆయన ఈసారి రాక మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. ముఖ్యమంత్రి వేయి కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను విశాఖలో శ్రీకారం చుట్టడానికి వచ్చారు.
ఆయనకు ఎయిర్ పోర్టు నుంచి ఇనార్భిట్ మాల్ శంకుస్థాపన వేదిక వరకూ వేలాదిగా జనం రోడ్డుకు ఇరువైపులా నిలిచి ఘన స్వాగతం పలికారు. థాంక్ యూ సీఎం సార్ అంటూ ప్లే కార్డులు పట్టుకుని జగన్ కాన్వాయి మీద పూలు జల్లుతూ పలికిన ఈ స్వాగతం మర్చిపోలేనిదిగా ఉంది.
విశాఖ అభివృద్ధి కోసం అకుంఠిత దీక్షతో పనిచేస్తున్న మన ముఖ్యమంత్రికి ఇదే స్వాగతం అంటూ ఏర్పాటు చేసిన అతి పెద్ద మానవహారాన్ని చూసి జగనే పులకించి పోయారు. అందరికీ చిరునవ్వుతో పలకరిస్తూ ముందుకు సాగారు. సాధారణంగా సీఎం కాన్వాయ్ ఎపుడూ స్పీడ్ గా వెళ్ళిపోతుంది.
మొదటిసారి సీఎం కాన్వాయ్ నెమ్మదిగా కదులుతూ ఉంటే అందులో నుంచి జగన్ అందరికీ అభివాదం చేస్తూ కనిపించారు. ఇదంతా విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ ఇంచార్జి కేకే రాజు ఏర్పాటు చేశారు. విశాఖలో గత రెండు మూడు నెలలలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టారని, విశాఖ పట్ల సీఎం ప్రేమకు చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం అంటూ వైసీపీ నాయకులు ఆయనకు ఈ విధంగా స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశారు.