గాజువాకలో ఇద్దరు వారసుల మధ్యన భీకర యుద్ధం సాగుతోంది. ఎవరు ఎవరికీ తీసి పోవడం లేదు. రెండూ ఘనత వహించిన పార్టీలు, ఆ పార్టీల నుంచి ఇద్దరు నేతలు దిగారు. వారే మంత్రి గుడివాడ అమర్నాధ్, టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు.
ఈ ఇద్దరికీ అనేక పోలికలు ఉన్నాయి. ఇద్దరి తండ్రులూ ఎమ్మెల్యేలుగా ఒకసారి మాత్రమే చేశారు. గుడివాడ అమర్నాధ్ తండ్రి గుడివాడ గురునాధరావు అయితే మంత్రిగా కూడా చేశారు. అదే వారసత్వంతో అమర్నాధ్ కి మంత్రి పదవి దక్కింది. పల్లా శ్రీనివాసరావు తండ్రి సింహాచలం మాత్రం ఎమ్మెల్యేగా రాజకీయం చాలించారు.
ఒక్కసారి మూడున్నర దశాబ్దాల వెనక్కి వెళ్తే ఆనాడు పెందుర్తి నియోజకవర్గంలో గాజువాక ఉండేది. అలా 1989 ఎన్నికల్లో పెందుర్తి నుంచి పల్లా సింహాచలం పోటీ చేస్తే కాంగ్రెస్ నుంచి గుడివాడ గురునాధరావు పోటీ చేసి ఆయన్ని ఓడించారు.
ఇప్పుడు పల్లా గుడివాడ వారసులలో ఎవరు ఎవరిని ఓడిస్తారు అన్నది ఒక ఎడతెగని చర్చగా సాగుతోంది. ఇద్దరూ బలమైన సామాజిక వర్గానికి చెందిన వారే కావడం విశేషం. గుడివాడ అమర్నాధ్ కి రాజకీయాలకు అతీతంగా బలమైన సొంత సామాజిక వర్గం దన్ను దక్కుతోంది. పల్లా శ్రీనివాసరావు తనదైన శైలిలో అందరినీ కూడగట్టుకుంటున్నారు.
ఈ ఇద్దరూ తొలిసారి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఆ తరువాత ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఎమ్మెల్యేగా పోటీ చేయడం పల్లాకు ఇది మూడవసారి అయితే గుడివాడకు రెండవసారి. గాజువాక నుంచి ఆయన తొలిసారి పోటీలో ఉన్నారు. తాత తండ్రి వారసత్వం బలంగా గుడివాడకు ఉంది. తండ్రి వారసత్వంతో పల్లా శ్రీనివాసరావు ఢీ కొంటున్నారు.
గుడివాడ మరో అడుగు ముందుకేసి తన సొంత ఎన్నికల మ్యానిఫేస్టోని గాజువాక కోసం ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ తన లక్ష్యంగా అందులో పేర్కొన్నారు. టీడీపీ కూటమి కూడా ఆ హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కూటమిలో ఉన్న బీజేపీ స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పాలని గుడివాడ అంటున్నారు.
స్టీల్ ప్లాంట్ అంశాన్ని గుడివాడ తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో ఉన్నారు. టీడీపీ కూటమిలో బీజేపీ ఉండడం పల్లాకు ఇబ్బందిగా మారుతోంది. ఈ ఇద్దరు వారసుల పోరుతో రాజకీయ కాక గాజువాకలో లో తీవ్ర స్థాయిలో ఉంది. గెలిచేది ఎవరు అన్నది జనాలు డిసైడ్ చేస్తారు కానీ కాబోయే ఎమ్మెల్యేలం మేమే అంటున్నారు ఇద్దరూ.